కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై 12న ఓవర్‌సైట్ కమిటీ భేటీ
ABN , Publish Date - Oct 08 , 2026 | 06:33 AM
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్‌లపై చర్చించేందుకు ఓవర్ సైట్ కమిటీ ఈనెల 12న న్యూఢిల్లీలో సమావేశం కానుంది.
హైదరాబాద్, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్‌లపై చర్చించేందుకు ఓవర్ సైట్ కమిటీ ఈనెల 12న న్యూఢిల్లీలో సమావేశం కానుంది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులు 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2023 అక్టోబరులో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాకు కుంగిపోగా అన్నారం, సుందిళ్లలో భారీగా సీపేజీలు బయటపడ్డాయి. ఆ తర్వాత ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా చేసిన పరీక్షల ఫలితాలు కూడా వచ్చాయి.
ఓవర్ సైట్ కమిటీ సమావేశంలో ఈ పరీక్షల ఫలితాలను నివేదిస్తారు. ఈ ఫలితాల ఆధారంగా ఏయే పనులు చేపట్టాలనే దానిపై స్పష్టత రానుంది. తాజా అంచనాల ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఎగువ భాగంలో ఒక్కో డయాఫ్రంవాల్ కట్టాలని, ఆ తర్వాత దిగువ భాగంలో గేట్ల నుంచి విడుదలయ్యే వరద ప్రవాహ ఉధృతిని నియంత్రించడానికి స్టిల్లింగ్ బేసిన్‌ను విస్తరించాలనే అంచనాకు వచ్చారు. దీంతో 12న జరిగే సమావేశం తర్వాత పునరుద్ధరణపై మరింత స్పష్టత రానుంది.
వి కూడా చదవండి...
జోరుగా యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణాలు
చికిత్సకు ముందు-తర్వాత ప్రచారం ఇక కుదరదు!
అక్టోబరు జీతంతోనే 2 డీఏలు
Read Latest AP News And Telugu News