Share News

డిగ్రీ పూర్తయినా.. పట్టా రాలే

ABN , Publish Date - Aug 19 , 2026 | 08:29 AM

హైదరాబాద్‌కు చెందిన అవినాశ్‌ ఓ ప్రముఖ కాలేజీ నుంచి బీటెక్‌ పూర్తిచేశాడు. ఎంటెక్‌లో ప్రవేశం కోసం పీజీఈసెట్‌ రాసి మంచి ర్యాంకు సాధించాడు.. పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలంటే ప్రొవిజినల్‌ మెమో, టీసీ, బోనఫైడ్‌ సర్టిఫికెట్లు సమర్పించాలి.

డిగ్రీ పూర్తయినా.. పట్టా రాలే
Degree students certificate issue

  • ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్న యాజమాన్యాలు

  • పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు

  • సర్కారు ఇవ్వకపోవటంతో విద్యార్థులను అడుగుతున్న కాలేజీలు

  • సర్టిఫికెట్ల కోసం నిరీక్షిస్తున్న రెండు లక్షల మంది విద్యార్థులు

  • మంచి ర్యాంకులు వచ్చినా ఉన్నత చదువుల కోసం వెళ్లలేని పరిస్థితి

  • ప్రభుత్వం తక్షణం చెల్లించాల్సిన బకాయిలు రూ.2,500 కోట్ల పైనే

  • పాత బకాయిలు రూ.7,000 కోట్ల వరకు ఉంటాయంటున్న ఫాతీ

హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన అవినాశ్‌ ఓ ప్రముఖ కాలేజీ నుంచి బీటెక్‌ పూర్తిచేశాడు. ఎంటెక్‌లో ప్రవేశం కోసం పీజీఈసెట్‌ రాసి మంచి ర్యాంకు సాధించాడు.. పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలంటే ప్రొవిజినల్‌ మెమో, టీసీ, బోనఫైడ్‌ సర్టిఫికెట్లు సమర్పించాలి. వీటిని ఇచ్చేందుకు కాలేజీ నిరాకరిస్తోంది. ఏడాదికి రూ.35 వేల చొప్పున మూడేళ్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ. 1.05 లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సర్కారు సకాలంలో ఇవ్వకపోవడంతో ఈ ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో కౌన్సెలింగ్‌లో అవినాశ్‌ దరఖాస్తు చేసుకోలేకపోతున్నాడు. ఇలాంటి సమస్యనే రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. ఇంజనీరింగ్‌, ఫార్మసీ, ఇతర యూజీ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు భారీగా పెండింగులో ఉండటంతో కాలేజీలు సర్టిఫికేట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి.


బకాయిలు రూ.7,000 కోట్లు: ఫాతీ

గత నాలుగేళ్లలో ప్రభుత్వం కాలేజీలకు బకాయి పడిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తం రూ.10 వేల కోట్ల వరకు ఉందని తెలంగాణ ఉన్నత విద్య ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘాల సమాఖ్య (ఫాతీ) అంటోంది. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని ఫాతీ ఏడాది కాలంగా కోరుతోంది. గత ఏడాదిలో ప్రభుత్వం దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకు విడుదల చేసింది. మొత్తం బకాయిలు చెల్లించకపోడంతో కొన్ని కాలేజీలు ఇటీవల హైకోర్టును ఆశ్రయించాయి.


ప్రభుత్వం బకాయిలు చెల్లించలేని పక్షంలో విద్యార్థుల నుంచి వసూలు చేసుకొనేందుకు కాలేజీలకు అనుమతించాలని హైకోర్టు సూచించింది. అయితే, విడతలవారీగా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. పాత మూడేళ్ల బకాయిలు జూలై-31లోపు, ఈ ఏడాది ప్రవేశాలు తీసుకుంటున్నవారికి ఆగస్టు-31లోపు చెల్లిస్తామని చెప్పింది. అయితే, పాత బకాయిలపై మళ్లీ పేచీ నడుస్తోంది. ఈ బకాయిలు దాదాపు రూ.7 వేల కోట్ల వరకు ఉన్నాయని ఫాతీ చెబుతోంది. జూలై-31లోపు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే విడుదల చేసిందని ఫాతీ ప్రతినిధి, ఫార్మసీ కాలేజీల సంఘం అధ్యక్షుడు రామదాసు తెలిపారు.


ఈ ఏడాది ఇంజినీరింగ్‌, ఫార్మసీ, బీఈడీ, ఇతర డిగ్రీ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థుల పెండింగ్‌ బకాయిలు రూ.2,500 కోట్లు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం బకాయిలను సకాలంలో చెల్లించకపోవటంతో పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌లో అవకాశం కోల్పోతామన్న భయంతో కొందరు విద్యార్థులు స్వయంగా ఫీజులు చెల్లించి సర్టిఫికేట్లు తీసుకుంటున్నారు. వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వచ్చాక తిరిగి ఇస్తామని కాలేజీలు చెబుతున్నాయి. అయితే, అంతమొత్తం ఫీజు చెల్లించే స్తోమత లేని విద్యార్థులు పీజీఈసెట్‌లో అవకాశం కోల్పోతున్నారు. విద్యార్థులు పీజీ చదివే అవకాశం కోల్పోకుండా కాలేజీలు ఒరిజినల్‌ సర్టిఫికేట్ల తమవద్దే పెట్టుకొని స్కాన్డ్‌ కాపీలు ఇవ్వాలని ఫాతీ విజ్ఞప్తి చేస్తున్నా కాలేజీలు అంగీకరించడం లేదు.


ఈ వార్తలు కూడా చదవండి:

క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు.. నేటి రేట్స్ ఇవీ..

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 19 , 2026 | 08:29 AM