తగ్గుతున్న బడి పిల్లలు
ABN , Publish Date - Aug 19 , 2026 | 07:21 AM
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలోనూ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత నాలుగేళ్లుగా జననాల రేటు తగ్గుతుండడమే దీనికి కారణమని తెలుస్తోంది. 2025-26లో అన్ని మేనేజ్‌మెంట్ల పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల సంఖ్య 84.37 లక్షలుగా ఉంది.
పడిపోతున్న జననాల రేటుతో తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య
1-12 తరగతులకు ఏడాదిలో
తగ్గిన విద్యార్థులు 2.61 లక్షలు
ప్రైవేటులో 2.23 లక్షల మంది తగ్గుదల
వీరిలో లక్ష మంది సర్కారీ స్కూళ్లకు
అయినా ప్రభుత్వ బడుల్లో పిల్లలు తక్కువే
‘ఒక్కరే ముద్దు’ అంటున్న కుటుంబాలు
2.1 నుంచి 1.5కు తగ్గిన జననాల రేటు
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. జననాల రేటు పడిపోవడంతో ఆ ప్రభావం స్కూళ్లపై స్పష్టంగా కనిపిస్తోంది. పిల్లల సంఖ్య తగ్గిపోవడంతో 2025-26, 2026-27 విద్యా సంవత్సరాల్లో అడ్మిషన్లు భారీగా పడిపోయాయి.
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలోనూ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత నాలుగేళ్లుగా జననాల రేటు తగ్గుతుండడమే దీనికి కారణమని తెలుస్తోంది. 2025-26లో అన్ని మేనేజ్‌మెంట్ల పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల సంఖ్య 84.37 లక్షలుగా ఉంది. ఈ ఏడాది ఆ సంఖ్య 81.75 లక్షలకు పడిపోయింది. అంటే 2.61 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. మేనేజ్‌మెంట్ల వారీగా చూస్తే.. ప్రైవేటు పాఠశాలల్లో 2.24 లక్షల మంది తగ్గారు. ప్రభుత్వ పాఠశాలల్లో 31 వేల మంది తగ్గారు. ఎయిడెడ్ పాఠశాలల్లో 6,375 మంది తగ్గిపోయారు. కాగా, గతేడాదితో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడ్డాయి. ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం విద్యార్థుల సంఖ్య అసాధారణ రీతిలో పడిపోయింది. గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 41.4 శాతం మంది విద్యార్థులుంటే ఈ ఏడాది అది 42.34 శాతానికి చేరింది. అదే ప్రైవేటులో 57.47 శాతం నుంచి 56.57కు తగ్గింది. ఎయిడెడ్‌లో 1.13 శాతం నుంచి 1.09 శాతానికి తగ్గింది.
ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడులకు
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోకుండా ఉండటానికి ప్రధాన కారణం ప్రైవేటు విద్యార్థులే. ఈ విద్యా సంవత్సరంలో 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడుల్లో చేరారు. దీంతో ప్రభుత్వ బడుల్లోని విద్యార్థుల సంఖ్య చాలా వరకు నిలకడగా ఉంది. పాఠశాల విద్యలో తీసుకొచ్చిన సంస్కరణలు, పదో తరగతిలో పెరిగిన ఉత్తీర్ణత, దీనిపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారం వంటి అంశాలు కలిసి వచ్చాయి. ఫలితంగా ప్రైవేటు పాఠశాలలకు ఫీజులు కట్టడం ఎందుకని భావించిన తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. వచ్చే ఏడాది ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే, ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలు భారీగా వస్తున్నప్పటికీ ప్రభుత్వ పాశాలల్లో ఇంకా పిల్లలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
తగ్గిపోతున్న జననాల రేటు
రాష్ట్రంలో జననాల రేటు భారీగా తగ్గిపోతోంది. ఇటీవల గణాంకాల ప్రకారం జననాల రేటు 2.1 నుంచి 1.5కు పడిపోయింది. చాలా కుటుంబాల్లో ‘ఒక్కరు ముద్దు’ అనే భావన కనిపిస్తోంది. పెరిగిన జీవన వ్యయం, విద్యా ఖర్చుల నేపథ్యంలో ఒక్కరు చాలు అనే నిర్ణయానికి వస్తున్నారు. జననాల రేటులో ఈ ప్రతికూలతను గమనించిన ప్రభుత్వం ‘పిల్లలే సంపద’ పేరుతో ఇటీవల ఓ పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఇద్దరు కంటే ఎక్కువ మందిని కనేవారికి ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ పథకం ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

వార్తలు కూడా చదవండి...
55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ
నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్
స్థానిక ఎన్నికలపై మాధవ్ కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News