జాగర్తండీ బాసులు.. ఏఐ మెరుపు తీగలు!
ABN , Publish Date - Aug 19 , 2026 | 08:05 AM
బాగా రీల్స్ చూసే అలవాటున్న ఓ యవకుడు ఓ డేటింగ్ యాప్ ప్రకటన కనబడితే డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేశాడు.
డేటింగ్ యాప్స్‌లో కల్పిత అమ్మాయిలు
నవ్వించి, కవ్వించి లవ్వంటూ వలేస్తారు
న్యూడ్ చాటింగ్ అంటూ ప్రేరేపిస్తారు
అక్కడి నుంచి ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభిస్తారు
రోజు రోజుకూ పెరిగిపోతున్న బాధితులు.. అప్రమత్తతే దీనికి మందు
రాష్ట్రంలో ఏడాది వ్యవధిలో 569 మంది బాధితులు
వారి నుంచి రూ.2.81 కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు
బాధితుల్లో 61శాతం మంది 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులే
హైదరాబాద్ సిటీ: బాగా రీల్స్ చూసే అలవాటున్న ఓ యవకుడు ఓ డేటింగ్ యాప్ ప్రకటన కనబడితే డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేశాడు. నిమిషాల్లోనే ఓ అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చింది. సో అండ్ సో అంటూ తనను తాను పరిచయం చేసుకుంది. మాటల సందర్భంగా తన సొంతూరు సమీపంలోని టౌనుకు చెందిన పిల్లనే ఆమె అని అతడు తెలుసుకున్నాడు. ఆ టౌనులో ఫలానా మార్కెట్టు.. ఫలానా కూడలి అంటూ సరిగ్గా వివరాలూ చెప్పడం.. పైగా తన ఫోన్ నంబరు ఇవ్వాలని అడగడంతో వెనుకాముందు ఆలోచించకుండా ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆమెనే చాటింగ్ మొదలు పెట్టింది. ఇద్దరూ మెసేజ్‌లు ఇచ్చిపుచ్చుకుంటుండటంతో అతడికి సమయమే తెలిసేది కాదు. ఒకసారి ఆమే చొరవ తీసుకొని.. ‘‘ఎన్నాళ్లిలా మాటలు? ఒకసారి కలుద్దాం’’ అనేసరికి అతడు మురిసిపోయాడు.
కలిసేందుకు ఆమె చెప్పిన చోటుకు వెళ్లాడు. అక్కడికి వెళ్లేసరికి ఆమే ఫోన్ చేసి.. ‘‘సారీ, మా సమీప బంధువు ఆస్పత్రిలో ఉన్నాడు. అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది’’ అని దాదాపు ఏడుస్తున్న గొంతుతో చెప్పింది. పైగా ‘‘చికిత్స కోసం ఓ యాభై వేలు కావాలి’’ అని ఆమె అడిగితే అతడు ఆన్‌లైన్‌లో పంపాడు. రెండ్రోజులకు ఆమే ఫోన్ చేసి.. ‘‘నీ హెల్ప్ మరిచిపోలేను’’ అంటూ డబ్బు పంపినందుకు థ్యాంక్స్ చెప్పింది. ఆ రోజు రాత్రి అతడికి వీడియో కాల్ చేసి మాటల్లో పెట్టి.. ఒంటిపై ఒక్కో వస్త్రాన్ని తొలగిస్తూ పూర్తిగా నగ్నంగా మారింది. అతడినీ అలాగే మారిపోవాలని కవ్వించేసరికి సరేనన్నాడు. అయితే అతడి ఆ ఫొటోలు, వీడియోలు రికార్డు చేసిన ఆమె.. మర్నాటి నుంచి అతడిని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చింది.
వారం రోజుల్లో అతడి నుంచి రూ.లక్ష లాగేసుకుంది. జేబు ఖాళీ అవ్వడం, ఆ ఫొటోలు, వీడియోలను తన ఫోన్ కాంటాక్ట్స్‌లోని చాలామందికి ఆమె షేర్ చేయడంతో దిక్కుతోచని స్థితిలో అతడు పోలీసులను ఆశ్రయించాడు. వారు ఊరుకుంటారా? ఆ మోసగత్తెను అరెస్టు చేసే ఉంటారు అని అనుకుంటున్నారు కదూ! లేదు.. ఎందుకంటే అసలు అమ్మాయి అంటూ ఎవ్వరూ లేరు. ఆమె అమ్మాయి కాని అమ్మాయి! అంటే.. ఏఐ నెరజాణ అన్నట్టు! ఫోన్‌లో పరిచయమైంది మొదలు.. వీడియో కాల్స్‌లో మాట్లాడేదాకా బాధితుడికి ఏ దశలోనూ చిన్న అనుమానమైనా రాలేదు! యువకుల ఇదే బలహీనతను ఆసరాగా చేసుకొని సైబర్ కేటుగాళ్లు విజృంభిస్తున్నారు. ఏఐ అమ్మాయిలతో వలపువల విసిరి.. కమ్మని మాటలతో కవ్వించి ఉన్నదంతా దోచేస్తున్నారు.
డేటింగ్ యాప్‌ల బారిన పడి రాష్ట్రంలో ఏడాదిలో 569 మంది మోసపోయారని.. వీరంతా కలిపి రూ.2.81 కోట్లు సైబర్ నేరగాళ్లకు సమర్పించుకున్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ లెక్కలన్నీ ఫిర్యాదు చేసిన యువకలకు సంబంధించినవే! పరువుపోతుందని మౌనంగా ఉండిపోయిన బాధితులు ఎంతో మంది ఉంటారని పోలీసులు చెబుతున్నారు. డేటింగ్ యాప్‌లు.. అందులోని ఏఐ యువతుల మాయలో పడి మోసపోతున్నవారిలో 61శాతం 18-35 ఏళ్ల వారేనని పోలీసుల అధ్యయనాలు చెబుతున్నాయి. ఆన్‌లైన్ కేటుగాళ్లు తమ రూటు మార్చారని.. అందమైన అమ్మాయిలను సృష్టించి.. యువకులను లక్ష్యంగా చేసుకొని వల విసురుతున్నారని హెచ్చరిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో పరిచయాలు చేసుకోవడం తప్పు కాదని, అయితే ఆ పరిచయమైన వ్యక్తిని పూర్తిగా నమ్మడమే ప్రమాదం అని చెబుతున్నారు. సాంకేతికత పెరగడంతో ఇప్పుడిలాంటి మోసాలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఆన్‌లైన్‌లో యువతులు తామే చొరవ తీసుకొని మాట్లాడినా, కవ్విస్తూ రెచ్చగొట్టినా, ఫొటోలు పంపాలని ఒత్తిడి చేసినా, ఏదైనా లింక్ ఓపెన్ చేయాలని చెప్పినా.. న్యూడ్‌గా వీడియో చాటింగ్ చేద్దామని రెచ్చగొట్టినా అనుమానించాల్సిందేని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏఐతో సృష్టించే అమ్మాయిలను కాస్త పరిశీలనగా చూస్తే గుర్తుపట్టవచ్చునంటున్నారు నిపుణులు. ఏఐ అమ్మాయిల్లో శ్వాసకు అనుగుణంగా ఛాతీ, భుజాలు కదలకపోవడం, కంటి రెప్పల కదలికల్లో అసహజత్వం వంటి లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు. ముఖ కవళికలు, పెదవుల కదలికలకు సరిగ్గా సింక్ కాకపోవడం, కళ్ల కదలికల్లో అసహజత్వం, వెలుతురు, నీడల్లో తేడాలు ఉంటే వెంటనే అనుమానించాలని సూచిస్తున్నారు.
ఎలా గుర్తించవచ్చంటే...
నిపుణులు ఇంకొన్ని సూచనలు చేస్తున్నారు. ‘‘మీతో వీడియో కాల్ మాట్లాడే వ్యక్తులకు తమ ముఖం ముందు చేతిని అడ్డంగా పెట్టి అటూ ఇటూ ఆడించమనండి. ఏఐ వీడియో అయితే ముఖం మీదకు చేయి రాగానే ముఖం బ్లర్‌గా మారుతుంది. అలాగే మీతో మాట్లాడే వ్యక్తులను ఓ పక్కకు తిరగమనండి. అలా చేసినప్పుడు వారి ముఖ డిజైన్ మారిపోతే అది ఏఐ వీడియోనే! మీ అనుమానం బలపడితే.. పక్కన ఉన్న వస్తువు ఏదైనా చేతుల్లోకి తీసుకొని చూపించమనండి. ఏఐ అయితే త్వరగా అలా చేయలేదు’’ అని చెబుతున్నారు. ఫొటోలు, వీడియోలు పంపడం ద్వారా సైబర్ వలలో చిక్కుకుపోయామని అనిపిస్తే అస్సలు భయపడకూడదు. వారు అడిగిన డబ్బిస్తే సమస్య పరిష్కారమవుతుందని అనుకోవొద్దు. వారితో చేసిన చాట్స్, ఫోన్ నంబర్లు, ప్రొఫైల్ వివరాలు., పేమెంట్స్ తాలూకు స్ర్కీన్‌షాట్స్, లింకులు వంటి ఆధారాలను డిలీట్ చేయకుండా భద్రపరుచుకోవాలి. వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఏఐ భామల వలలో పడకుండా ఉండాలంటే
తెలియని లింక్‌లను క్లిక్ చేయొద్దు.
నెట్‌లో ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి యాప్ డౌన్‌లోడ్ చేయొద్దు.
ఏపీకే ఫైల్స్ లేదంటే ఽథర్డ్ పార్టీ లింక్‌లకు దూరంగా ఉండాలి.
పరిచయం లేని వ్యక్తులకు వీడియోలు, వ్యక్తిగత ఫొటోలు పంపకూడదు.
వీడియో కాల్ పరిచయం ఉందని, ఓటీపీలు, యుపీఐ పిన్‌లు లాంటివి అసలు చెప్పకూడదు.
ఈ వార్తలు కూడా చదవండి:
క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు.. నేటి రేట్స్ ఇవీ..
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News