Share News

సీబీఐ వలలో మైనింగ్‌ డీడీ

ABN , Publish Date - Aug 19 , 2026 | 07:30 AM

గనుల శాఖలో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించే ఉన్నతాధికారి.. ఒక క్వారీలో జరిగిన ఘోర ప్రమాదంలో యజమానులకు అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా సీబీఐ అరెస్టు చేసింది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని వాసవి గ్రానైట్‌ క్వారీలో ఈ ఏడాది జూన్‌ 25న ప్రమాదం జరిగింది.

సీబీఐ వలలో మైనింగ్‌ డీడీ

  • ఒంగోలులో 2 లక్షలు తీసుకుంటుండగా

  • డీజీఎంఎస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ శివశంకర్‌ పట్టివేత

  • వాసవి గ్రానైట్‌ వ్యాపారి, కన్సల్టెంట్‌ కూడా అరెస్టు

  • గత జూన్‌లో చీమకుర్తి క్వారీలో ప్రమాదం

  • అనుకూల నివేదిక కోసం శివశంకర్‌కు

  • తొలుత రూ.లక్ష లంచమిచ్చిన వ్యాపారి

  • తర్వాత మరో 2 లక్షలు డిమాండ్‌ చేసిన డీడీ

  • ఇది తెలిసి నిఘా పెట్టిన సీబీఐ.. ఒంగోలులో లంచం

  • తీసుకుంటుండగా అరెస్ట్‌.. 1 వరకు రిమాండ్‌

హైదరాబాద్‌/ఒంగోలు/విశాఖపట్నం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): గనుల శాఖలో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించే ఉన్నతాధికారి.. ఒక క్వారీలో జరిగిన ఘోర ప్రమాదంలో యజమానులకు అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా సీబీఐ అరెస్టు చేసింది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని వాసవి గ్రానైట్‌ క్వారీలో ఈ ఏడాది జూన్‌ 25న ప్రమాదం జరిగింది. కేసులో తమను బాధ్యులను చేయకుండా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరుతూ ఆ కంపెనీ ప్రతినిధులు ఒంగోలుకు చెందిన లోటస్‌ ఎన్విరో మైనింగ్‌ సర్వీసెస్‌ అధినేత, కన్సల్టెంట్‌ సుభాస్కర్‌ రెడ్డిని కోరారు. వాసవీ గ్రానైట్స్‌ యాజమాన్యం తరఫున ఆయన కథ నడిపించడం ప్రారంభించారు.


ఇటీవల హైదరాబాద్‌లోని కేంద్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ (డీజీఎంఎస్‌) హైదరాబాద్‌-111 రీజియన్‌ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ యు.శివశంకర్‌ను కలిసి మొదట రూ.లక్ష లంచంగా ఇచ్చారు. ఈ సమాచారం సీబీఐకి అందింది. నివేదిక అనుకూలంగా ఇచ్చేందుకు శివశంకర్‌ మరో రూ.2 లక్షలు డిమాండ్‌ చేశారు. దీనిపై సీబీఐ అధికారులు నిఘా పెట్టారు. శివశంకర్‌ సోమవారం ప్రకాశం జిల్లాలోని బల్లికురవ గనుల్లో భద్రతను పరిశీలించారు. రాత్రికి ఒంగోలులో ఓ రెస్టారెంట్‌లో బస చేశారు. పొద్దుపోయాక అక్కడకు వాసవి గ్రానైట్‌ అధిపతి శిద్దా వెంకట సురేశ్‌కుమార్‌, సుభాస్కర్‌రెడ్డి వెళ్లారు.


శివశంకర్‌కు వారు రూ.2 లక్షలు ఇస్తుండగా సీబీఐలోని ఏసీబీ విభాగం డీఎస్పీ రత్నకుమార్‌ శుక్లా సిబ్బందితో మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. ముగ్గురినీ మంగళవారం ఉదయం అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. అక్కడి సీబీఐ కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి వచ్చేనెల 1 వరకూ రిమాండ్‌ విధించినట్లు హైదరాబాద్‌ జోన్‌ సీబీఐ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శివశంకర్‌ కార్యాలయం, కడప, హైదరాబాద్‌లోని నివాసాలతో పాటు ఒంగోలులో కూడా సోదాలు నిర్వహించినట్లు వెల్లడించారు. వాస్తవానికి శివశంకర్‌ మంగళవారం చీమకుర్తిలోని గోల్డెన్‌ గ్రానైట్‌ క్వారీ సహా కొన్ని క్వారీల్లో భద్రతను తనిఖీ చేయాల్సి ఉంది.


వార్తలు కూడా చదవండి...

55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ

నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్

స్థానిక ఎన్నికలపై మాధవ్ కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 19 , 2026 | 07:31 AM