Share News

బాంచన్‌ దొర.. ఇక వద్దు

ABN , Publish Date - Aug 19 , 2026 | 07:36 AM

ప్రజా ప్రభుత్వంలో మంచి, చెడు.. ఏమున్నా మాట్లాడుకొని ముందుకు వెళదామని, ఈ ప్రభుత్వం అందరిదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

బాంచన్‌ దొర.. ఇక వద్దు
CM Revanth Reddy

  • ప్రజా ప్రభుత్వంలో అందరికీ సమాన అవకాశాలు

  • కేసీఆర్‌ చేసిన అప్పు.. పెద్ద ముప్పుగా మారింది

  • అబద్ధాలు ప్రచారం చేస్తున్న బావ, బామ్మర్ది

  • డీఎస్‌తో వైఎస్‌లాగే.. మహేశ్‌తో నా కాంబినేషన్‌

  • 2029లో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం

  • కులవృత్తిని గౌరవిస్తూ.. పిల్లలను చదివించాలి

  • ఛత్రపతి శివాజీలాగే పాపన్నగౌడ్‌: సీఎం రేవంత్‌

  • ముదిరాజ్‌లు ఆరాధించే పండుగ సాయన్న

  • జయంతినీ అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటన

  • ట్యాంక్‌బండ్‌పై సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహాన్ని

  • ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ: ప్రజా ప్రభుత్వంలో మంచి, చెడు.. ఏమున్నా మాట్లాడుకొని ముందుకు వెళదామని, ఈ ప్రభుత్వం అందరిదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం పోయి.. మళ్లీ దొరల గడీల ముందు ‘బాంచన్‌ దొరా..’ అనే పరిస్థితి రావద్దన్నారు. ఆనాడు డీఎస్‌, వైఎస్‌ల కాంబినేషన్‌లో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినట్లే.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌తో తన కాంబినేషన్‌లో 2029లోనూ రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం గౌడన్నలందరూ సహకరించాలని కోరారు.


మంగళవారం సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ 376వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలనలో సామాజిక న్యాయం, సమానమైన అవకాశాలు, జీవించడానికి స్వేచ్ఛ ఉందన్నారు. కేవలం జయంతి, వర్ధంతి రోజు వచ్చి పాపన్నగౌడ్‌ విగ్రహానికి దండ వేసి దండం పెట్టుకోకుండా.. నిత్యం స్ఫూర్తి నింపేలా తీర్చిదిద్దాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సూచించారు. పాపన్నగౌడ్‌ కేవలం ఒక కులం కోసమో, కుటుంబం కోసమో పని చేయలేదని, బహుజనులందరినీ కూడగట్టుకొని దండయాత్ర చేసి.. గోల్కొండ ఖిల్లా మీద జెండా ఎగరేసి బహుజనుల సామ్రాజ్యాన్ని స్థాపించిన వీరుడని కొనియాడారు.


ఛత్రపతి శివాజీలాగే పాపన్నగౌడ్‌.

మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పెట్టుకోవడానికి మరాఠీలు ఎంత ప్రాధాన్యమిస్తారో.. తెలంగాణ బిడ్డలు కూడా పాపన్నగౌడ్‌ విగ్రహానికి అంతే ప్రాధాన్యమిస్తారని సీఎం అన్నారు. పాపన్నగౌడ్‌ పౌరుషం, పోరాటం, వీరత్వం, గొప్ప గాథను బ్రిటిషర్లు గ్రంథం రూపంలో ఇంగ్లండ్‌ లైబ్రరీలో పెట్టారని గుర్తు చేశారు. అదేవిధంగా ముదిరాజ్‌ల ఆరాధ్యమైన పండుగ సాయన్న పౌరుషం, పోరాటం కూడా పాలమూరు జిల్లాలో ప్రతి ఒక్కరికీ తెలుసునని రేవంత్‌ అన్నారు. అక్టోబరు 22న పండుగ సాయన్న జయంతిని కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించారు. గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని, నేత కార్మికులు, గీత కార్మికులు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నా.. అందరికీ పెన్షన్లు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలిచ్చామని చెప్పారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాలువ గట్ల మీద తాటి, ఈత చెట్లను పెంచితే ఎవరితోనూ పంచాయితీలు ఉండవన్నారు. అవి పెరగడానికి మూడు నాలుగేళ్లు పట్టొచ్చేమో గానీ.. వంద ఏళ్లు ఆ వృత్తిని కాపాడటానికి పనికొస్తాయని అన్నారు.


రాష్ట్రంలో 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లు..

కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయితే ఫ్యామిలీ జస్టిస్‌, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే సోషల్‌ జస్టిస్‌ జరుగుతుందని సీఎం రేవంత్‌ అన్నారు. రాష్ట్ర నలుమూలలా 7లక్షల ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని, పదేళ్లలో కేసీఆర్‌ అనుకుంటే పేదలకు 20 లక్షల ఇళ్లు వచ్చేవని తెలిపారు. కానీ, వారికి ఏ రోజూ పేదోడి ఇంటిమీద ధ్యాస లేదని, పేదోడి బతుకును బాగు చేయాలనే ఆలోచన లేదని, ఆయన ఉండడానికి మాత్రం పది ఎకరాల్లో గడీ కట్టుకున్నారని విమర్శించారు. ‘‘ప్రగతి భవన్‌కు గద్దరన్న పోతే గేటు బయట కూర్చోబెట్టిండు. అందెశ్రీ పాటను పదేళ్లు బంద్‌ చేసిండు. మేం వచ్చాక ‘జయ జయహే తెలంగాణ’ పాటకు విముక్తి కలిగించాం.


గద్దర్‌ అవార్డుల ద్వారా ఆయన పేరును శాశ్వతంగా చరిత్ర పుటల్లోకి ఎక్కించాం. మాదిగ ఉపకులాల వర్గీకరణ, బీసీల కులగణన దేశంలోనే మొట్టమొదటిగా చేశాం. కొన్ని మీరు అనుకున్నంత వేగంగా జరగకపోవచ్చు. ఎందుకంటే రూ.8.11 లక్షల కోట్ల అప్పుంది. ఈ అప్పే మా ప్రాణానికి పెద్ద ముప్పు అయింది. ఏడాది తిరిగితే రూ.75 వేల కోట్ల అసలు, మిత్తి కట్టాల్సి వస్తోంది. కేసీఆర్‌ చేసిన అప్పులకు, తప్పులకు ఆ పైన వచ్చిందే మనది. దాంతోనే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం’’ అని సీఎం రేవంత్‌ వివరించారు. బావ, బామ్మర్ది చెరో దిక్కున, ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లనుద్దేశించి రేవంత్‌ అన్నారు. వాటిని ప్రజలు నమ్మకపోవడంతో కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్లి అఘోరా పూజలు చేస్తున్నారని ఆరోపించారు.


కులవృత్తిని గౌరవించాలి.. పిల్లలను చదివించాలి

మన తలరాతను మనం మార్చుకోలేమని, కానీ.. మన పిల్లల తలరాతను మనం మార్చవచ్చునని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కులవృత్తిని గౌరవించాలని, పిల్లలను మాత్రం చదివించాలని సూచించారు. పదేళ్లు ఏలిన వారు.. తమ ప్రభుత్వంపై వారి సొంత మీడియాలో, సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఆనాటి ప్రభుత్వం మీరు బర్రెలు, గొర్రెలు పెంచుకోండి.. చేపలు పట్టుకోండి.. చెప్పులు కుట్టుకోండి.. చీరలు నేయండి.. కల్లు గీయండి అని చెప్పింది. వాళ్ల పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలుతారని చెప్పింది. మా ప్రభుత్వం మాత్రం అన్నివర్గాల వారి పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తోంది. మన పిల్లలు రాజ్యాన్ని ఏలాలంటే చదువొక్కటే పరిష్కారం’’ అని రేవంత్‌ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు.. నేటి రేట్స్ ఇవీ..

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 19 , 2026 | 07:36 AM