ఆహార వ్యర్థాలతో పేపర్ టవల్స్
ABN , Publish Date - Aug 19 , 2026 | 06:41 AM
మిగిలిపోయిన ఆహారాన్ని కూడా మరో రకంగా ఉపయోగించుకోవచ్చని నిరూపించాడు 17 ఏళ్ల విద్యార్థి. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అర్నవ్ కొడవటి తన సైన్స్ ప్రాజెక్టులో భాగంగా...
17 ఏళ్ల కాలిఫోర్నియా
స్టూడెంట్ అర్నవ్ కొడవటి ప్రతిభ
న్యూఢిల్లీ, ఆగస్టు 18: మిగిలిపోయిన ఆహారాన్ని కూడా మరో రకంగా ఉపయోగించుకోవచ్చని నిరూపించాడు 17 ఏళ్ల విద్యార్థి. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అర్నవ్ కొడవటి తన సైన్స్ ప్రాజెక్టులో భాగంగా ఆహార వ్యర్థాలను బయోడిగ్రేడబుల్ పేపర్ టవల్స్‌గా మార్చి అందర్నీ అబ్బురపరిచాడు. అర్నవ్ ప్రాజెక్టుతో ఆహార వ్యర్థాల నిర్వహణ సులువు అవ్వడమే కాకుండా, పేపర్ టవల్స్ కోసం చెట్లను నరకాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. అర్నవ్ కనుగొన్న విధానంలో మొదట ఆహార వ్యర్థాల నుంచి సెల్యులోజ్ అధికంగా ఉండే ఫైబర్లను సేకరిస్తారు. దానికి పెక్టిన్ అనే జిగురులాంటి పదార్థాన్ని కలుపుతారు. కాల్షియం క్లోరైడ్‌తో దానిని బలోపేతం చేస్తారు. ఇలా తయారైన పేపర్ షీట్లకు తడిని పీల్చుకునే శక్తి అధికంగా ఉంటోందని అర్నవ్ నిరూపించాడు. అంతేకాకుండా పేపర్ టవల్స్‌ను చౌకగా కూడా తయారు చేసే అవకాశం కలుగుతోందని వివరించాడు. శాన్‌జో్‌సలోని లిన్‌బ్రూక్ హైస్కూల్‌లో చదువుతున్న అర్నవ్.. తన ప్రాజెక్టును చిన్న వీడియో రూపంలో వివరించాడు. ఆహార వ్యర్థాలను పేపర్‌గా మార్చే ప్రక్రియలో మొదట ఆ వ్యర్థాల్లోని సెల్యులోజ్‌ను సేకరించి బాగా ఎండబెట్టి పొడి చేయాలి. కొంత రసాయన ప్రక్రియ జోడించిన తర్వాత పేపర్‌కు అవసరమయ్యే సెల్యులోజ్, అధిక ఫైబర్ మెటీరియల్ వస్తుంది. అయితే ఇప్పుడు తయారయ్యే పేపర్ తడిసిన వెంటనే పీలికలు అయిపోకుండా ఉండాలి. తర్వాత దానిని సన్నని షీట్లగా మార్చాలి. ఆ షీట్లు తడిసిన వెంటనే చిరిగిపోకుండా ఉండటానికి కాల్షియం క్లోరైడ్ కలపాలి. కాల్షియం అయాన్లు ఫైబర్ల మధ్య ద్రుఢమైన బంధాన్ని ఏర్పరిచి పేపర్‌కు బలాన్ని చేకూరుస్తాయి. దీని తయారీ ఖర్చు విషయానికి వస్తే.. పెద్దమొత్తంలో తయారు చేస్తే 100 షీట్లకు కేవలం 2.98 డాలర్లు (సుమారు రూ. 285) మాత్రమే ఖర్చువుతుందని అర్నవ్ చెప్పాడు. ఇక సంప్రదాయంగా చెట్ల నుంచి తయారు చేస్తున్న 100 పేపర్ టవల్స్‌కు 3.40 డాలర్లు (సుమారు రూ. 325) ఖర్చు అవుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు
మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం