పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Aug 18 , 2026 | 02:47 PM
జైలు శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్‌కు తాజాగా భారీ ఊరట దక్కింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఖాన్‌ను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని పాక్ సుప్రీం కోర్టు తాజాగా ఆదేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: జైలు శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్‌కు తాజాగా భారీ ఊరట దక్కింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఖాన్‌ను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని పాక్ సుప్రీం కోర్టు తాజాగా ఆదేశించింది. 48 గంటల్లోపు ఆయనను ఆసుపత్రిలో చేర్పించాలని స్పష్టం చేసింది. ఖాన్ ఆరోగ్యంపై దృష్టి సారించేందుకు త్వరలో ఓ మెడికల్ బోర్డు కూడా ఏర్పాటు కానుందని తెలిపింది. ఈ బోర్డులో ఖాన్ వ్యక్తిగత వైద్యుడితో పాటు ఆయన సోదరి డా. ఉజ్మాఖాన్ కూడా సభ్యులుగా ఉంటారని తెలిపింది. అయితే, ఇమ్రాన్ ఖాన్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో వైద్య రికార్డులను బహిరంగ పరిచి రాజకీయ వివాదాలను రెచ్చగొట్టొద్దని ఆయన తరఫు లాయర్లకు స్పష్టం చేసింది. ఇమ్రాన్ ఖాన్‌ను వారానికి ఒకసారి తన కుటుంబసభ్యులను కలిసేందుకు అనుమతించాలని కూడా ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
2023 నుంచి ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. అవినీతితో పాటు ఇతరత్రా కేసుల్లో దోషిగా తేలిన ఆయన అడియాలా జైల్లో ఉంటున్నారు. అయితే తాను నిర్దోషినని ఇమ్రాన్ ఖాన్ మొదటి నుంచీ వాదిస్తున్నారు. రాజకీయ దురుద్దేశాలతో కేసులు పెట్టి జైలుపాలు చేశారని పలుమార్లు ఆరోపించారు. మరోవైపు, ఆయన ఆరోగ్యం అంతకంతకూ దిగజారుతోందని ఇమ్రాన్ ఖాన్ తనయులు, వారి లాయర్లు గతేడాదిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుడి కంటి చూపు బాగా తగ్గిపోయిందని కూడా చెప్పారు ప్రస్తుతం వైద్య కారణాలతో ఇమ్రాన్ ఖాన్‌కు కాస్త ఊరట లభించడంతో పీటీఐ అధికార ప్రతినిధి హర్షం వ్యక్తం చేశారు. ఇంకాస్త ముందుగా ఇది జరిగి ఉంటే మెరుగ్గా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యం పూర్తిగా మెరుగయ్యే వరకూ ఇమ్రాన్ ఖాన్‌ను ఆసుపత్రిలోనే ఉంచాలని డిమాండ్ చేశారు.
2018 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ ఆ తరువాత 2022 నాటి బలనిరూపణలో ఓడిపోయి ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత ఆయనపై అవినీతి, చట్టవ్యతిరేకంగా వివాహం చేసుకోవడం వంటి అనేక కేసులు దాఖలయ్యాయి. కొన్నింట్లో ఆయన దోషిగా తేలారు. మరికొన్నిటిని కోర్టులు కొట్టేశాయి. మరికొన్ని కేసుల్లో అప్పీళ్లపై ఇంకా విచారణ జరుగుతోంది. పీటీఐ తన పార్టీ గుర్తు కూడా కోల్పోవడంతో 2024 ఎన్నికల్లో పీటీఐ నేతలు స్వతంత్ర అభ్యుర్థులుగా పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటికీ పాక్‌లో పీటీఐకి ప్రజల మద్దతు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉందని అక్కడి మీడియా చెబుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం
భారత్ ఎన్నికల విధానంపై ట్రంప్ ప్రశంసలు.. అమెరికాలోనూ తప్పనిసరి ఓటర్ ఐడీకి పట్టు..