శాడిస్టు సాదిక్
ABN , Publish Date - Aug 19 , 2026 | 07:52 AM
పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు ఆత్మహత్య, కుటుంబసభ్యులు గల్లంతైన కేసులో విస్మయపరిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రైఫిల్ షూటర్ సాదిక్ ఖాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
ఆస్తుల కోసం నరకం.. ఇస్లాంలోకి మారాలని నా కోడలిపై ఒత్తిడి
మానసికంగా తీవ్ర వేధింపులు.. నా కుమారుడి మృతిలోనూ అతడి పాత్ర!
షూటర్ సాదిక్ ఖాన్‌పై పోలీసులకు ఏఈ నూకరాజు వియ్యంకుడి ఫిర్యాదు
కేసు నమోదు.. నూకరాజు భార్య, కుమార్తె కోసం గాలింపు ముమ్మరం
కాకినాడ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు ఆత్మహత్య, కుటుంబసభ్యులు గల్లంతైన కేసులో విస్మయపరిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రైఫిల్ షూటర్ సాదిక్ ఖాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నూకరాజు తన భార్య మీనా, కుమార్తె కొవ్వూరి సౌజన్య, మనవడు కార్తికేయరెడ్డితోసహా ఆదివారం రాత్రి గోదావరిలో దూకిన విషయం తెలిసిందే. నూకరాజు అల్లుడు జగదీశ్వర్‌రెడ్డి గత నెల రెండో తేదీన మరణించారు. అయితే, తన కుమారుడి మరణానికి సాదిక్ ఖానే కారణమని ఆరోపిస్తూ జగదీశ్వర్‌రెడ్డి తండ్రి, నూకరాజు వియ్యంకుడు భాస్కర్‌రెడ్డి కాకినాడ సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సర్పవరం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. తన మనవడు కార్తికేయరెడ్డితో మాట్లాడగా, ఈ విషయం తెలిసిందని ఆయన పేర్కొన్నారు.
సాధిక్‌తోపాటు మరో వ్యక్తి పాత్ర ఉన్నట్టు అనుమానం వ్యక్తంచేశారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి, అల్లుడి మరణానికీ సాధికే కారణం అనే కోణంలో అతడి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.మరోవైపు గోదావరిలోకి దూకేందుకు ముందు నూకరాజు కుమార్తె సౌజన్య బండిలో ఉంచిన మూడు కవర్లను పోలీసులు గుర్తించారు. సాదిక్ తనను, తన కుటుంబ సభ్యులను ఎలా వేధిస్తున్నాడనే విషయాలను వాటిలో ప్రస్తావిస్తూ లెటర్ రాసినట్టుగా భాస్కర్‌రెడ్డి తెలిపారు. అంతేకాదు తన కుమారుడు జగదీశ్వర్ రెడ్డిని ఏదో మందు ఇచ్చి సాదిక్‌ఖాన్ చంపినట్టు సౌజన్య ఆ లెటర్‌లో రాసిందని పోలీసులకు చెప్పారు. సౌజన్య ప్రైవేటు విషయాలను అడ్డుపెట్టుకుని సాదిక్ బ్లాక్‌మెయిల్ చేసేవాడని, ఆమె ఫోన్‌ను ట్రాప్ చేసి ఆస్తి కోసం బెదిరించేవాడని, సహకరించకపోతే నూకరాజు కుటుంబాన్ని, మనవడు కార్తికేయరెడ్డిని చంపుతానని బెదిరించేవాడని వాపోయారు. ఈ విషయాలను తన కోడలు తన కుమారుడికి చెప్పినా, అతడిని కూడా సాదిక్ కొట్టి చివరికి చంపేశాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మానసికంగా వేధించి..
సాదిక్ రాక్షస ప్రవర్తనతో నూకరాజు కుటుంబం నరకం అనుభవించిందని, తన కోడలిని ముస్లిం మత ఆచారాలను పాటించాలని, ఇస్లాం పుస్తకాలు చదివి అందులోకి మారాలని తీవ్ర ఒత్తిడి చేస్తూ వాటిని రోజూ రాయించేవాడని తెలిపారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సాదిక్ చెప్పినట్టే సౌజన్య చేసేదని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటిని, తన కుమారుడి ఫోన్, ఎస్‌బీఐ లాకర్ కీ, నూకరాజు ఆస్తి పత్రాలు అన్నీ వశపరచుకున్నట్టుగా సౌజన్య రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొందని తెలిపారు. జగదీశ్వర్‌రెడ్డిని చంపినట్టుగానే తనను, తన తండ్రి, కుమారుడిని సాధిక్ చంపుతాడనే భయంతోనే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకునేందుకు రాజమహేంద్రవరం వెళుతున్నట్టుగా ఆ లెటర్‌లో ఆమె తెలిపారన్నారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు క్రైం నంబర్ 260/2026, బీఎన్‌ఎస్ సెక్షన్లు 103(1), 308(5), 127(1), 351(3), 108, 299 కింద కేసు నమోదు చేశారు. సాదిక్‌ఖాన్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సుమారు ఎనిమిది బృందాలు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. అయితే, ఇప్పటికే అతడిని పోలీసు అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. నూకరాజు కారు డ్రైవర్‌పైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొనసాగుతున్న గాలింపు
నదిలో గల్లంతైన నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆచూకీ కోసం తీవ్ర గాలింపు కొనసాగుతోంది. మత్స్యకారులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది పడవల్లో వెళ్లి గాలిస్తున్నారు. గల్లంతయిన వారు దిగువకు వెళ్లిపోకుండా ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను మూసివేశారు. మద్దూరు గట్టు ప్రాంతానికి చేరుకోవచ్చనే అంచనాతో మత్స్యకారులు గాలిస్తున్నా, మంగళవారం రాత్రి వరకూ ఫలితం లేకపోయింది. పోలీసులు డ్రోన్లతో గోదావరిని జల్లెడ పడుతున్నారు.
వార్తలు కూడా చదవండి...
55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ
నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్
స్థానిక ఎన్నికలపై మాధవ్ కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News