బ్యాక్ టు స్కూల్.. ఆందోళనను అధిగమించండిలా..
ABN , Publish Date - Jun 14 , 2026 | 11:48 AM
జూన్ నెల మొదలయ్యిందంటే చాలు.. ఆకాశంలో తొలకరి మబ్బులతో పాటు సగటు తల్లిదండ్రుల్లో ఆందోళన మేఘాలు కమ్ముకుంటాయి.
జూన్ నెల మొదలయ్యిందంటే చాలు.. ఆకాశంలో తొలకరి మబ్బులతో పాటు సగటు తల్లిదండ్రుల్లో ఆందోళన మేఘాలు కమ్ముకుంటాయి. కొత్త తరగతి హుషారు పిల్లలదైతే... తల్లిదండ్రులకు మాత్రం రకరకాల ఒత్తిళ్లు షురూ. ప్రతీ ఏడాది ‘బ్యాక్ టు స్కూల్’ సీజన్ అనేది పేరెంట్స్‌కు నిజంగా ఓ పరీక్షా సమయమే. పాఠశాలలు తెరిచిన వేళ.. పనికొచ్చే పేరెంటింగ్ టిప్స్... ఈ వారం కవర్ స్టోరీ!
వేసవి సెలవుల్లో సహజంగానే బద్ధకం తిష్ట వేస్తుంది. అర్థరాత్రి వరకూ మేలుకుని వుండటం, ఆలస్యంగా నిద్ర లేవడం, ఇష్టం వచ్చినప్పుడు తినడం లాంటివి పిల్లలకు అలవాటవుతాయి. స్కూళ్లు తెరవగానే ఒక్కసారిగా ఉదయం 6 గంటలకే నిద్ర లేవడం, చకచకా తయారై, స్కూల్ బస్ అందుకోవడం వారికి కష్టమైపోతుంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులే అయితే... అలాంటి ఇళ్లలో ఉదయం పూట టిఫిన్, వంట చేయడం, లంచ్ బాక్సులు సిద్ధం చేయడం, చిన్నారులను సకాలంలో రెడీ చేసి పంపేసి, ఆలస్యమవకుండా ఆఫీసులకు పరుగెత్తడం- ఇలాంటి సవాలక్ష సమస్యలతో ముఖ్యంగా తల్లులు సతమతమవుతుంటారు.
‘‘నాకు పదేళ్ల బాబు ఉన్నాడు. నిన్న మొన్నటి దాకా తనకు ఉదయం 9 గంటలవరకూ నిద్రపోవడం అలవాటయ్యింది. ఇప్పుడు ఒక్కసారిగా 6 గంటలకే నిద్ర లేపాల్సి వస్తోంది. వాడు లేవనని మారాం చేస్తాడు, ఏడుస్తాడు. ఇటు నాకేమో ఆఫీస్ లాగిన్ టైమ్.. అటు స్కూల్ బస్ టైమ్ దాదాపు ఒకే సమయం! ఉదయం 7 నుంచి 8.30 గంటల మధ్య మా ఇంట్లో చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది’’ అంటోంది ఐటీ ఉద్యోగిని సుహాసిని. ఇది ఆమె ఒక్కరి సమస్యనే కాదు... స్కూలు లేదా కాలేజీకి వెళ్తున్న పిల్లలున్న ప్రతీ తల్లి ‘బ్యాక్ టు స్కూల్’ సీజన్ ఆవేదన. అయితే ‘కొంతకాలం ప్రణాళిక బద్ధంగా ఉంటే... తర్వాత అదే అలవాటు అవుతుంద’ని అంటున్నారు పేరెంటింగ్ నిపుణులు.
15 నిమిషాల చొప్పున...
చిన్నపిల్లలైనా, పెద్దవారైనా తగినంత నిద్రపోతే పొద్దున్నే లేవడం కష్టం అనిపించదు. అందుకే స్కూళ్లు మొదలవుతున్నాయంటే... ప్రతీరోజూ పడుకునే సమయాన్నీ, నిద్ర లేచే సమయాన్నీ 15 నిమిషాల చొప్పున ముందుకు జరుపుతుండాలి. క్రమక్రమంగా ఇలా చేస్తే వారం రోజుల్లో సమయం నియంత్రణలోకి వచ్చి, ఉదయంపూట తగిన సమయం చిక్కుతుంది. అప్పుడిక బద్ధకం ఒళ్లు విరుచుకోదు.
ముందస్తు ప్రణాళిక...
పిల్లలు స్కూలుకు వెళ్లే తేదీలు ముందుగానే తెలుసు కాబట్టి... అదే రోజు కాకుండా... వారం ముందు నుంచే యూనిఫామ్‌లు ఇస్ర్తీ చేసి ఉంచడం, బ్యాగుల్లో పిల్లలు అన్నీ సర్దుకునేలా ప్రోత్సహించడం... ఇలాంటి ముందస్తు ప్రణాళికను మెల్లిగా పిల్లలకు అలవాటు చేయాలి. తల్లిదండ్రులు కూడా చేసుకోవాలి. మరుసటి రోజు లంచ్‌బాక్స్‌లో ఏముండాలో రాత్రే ఆలోచించి, అవసరమైనవి సిద్ధం చేసుకుంటే... ఉదయం పూట ఒత్తిడి 50 శాతం తగ్గిపోతుంది.
ఫీజులు, ఇతరత్రా ఖర్చులు...
విద్యా సంవత్సరం ఆరంభంలో ట్యూషన్ ఫీజు మాత్రమే కాకుండా... డొనేషన్లు, రీ అడ్మిషన్ ఫీజు, డిజిటల్ తరగతుల ఫీజు పేరిట భారం మోపుతున్నారు. పైగా ఏటా పుస్తకాలూ, యూనిఫామ్‌లూ, రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి. అందుకే విద్యా మార్గదర్శకాలపై పేరెంట్స్ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలి. ‘‘నాకు ఇద్దరు పిల్లలు. ఫిఫ్త్, ఎయిత్ క్లాసుల్లో ఉన్నారు. ఇద్దరికీ కలిపి పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ ఇతరత్రా ఖర్చులు చాలానే అవుతున్నాయి. ట్యూషన్ ఫీజు, రవాణా చార్జీలు అదనం. ప్రతీ ఏడాది జూన్ నెల వచ్చిందంటే చాలు తెలియని ఆందోళన మొదలవుతోంది’’ అని ఆవేదన చెందుతున్నారు విజయవాడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి సత్యనారాయణ.
అందుకే ముఖ్యమైన ఖర్చుల కోసం ముందస్తుగానే బడ్జెట్ రూపొందించుకోవడం అవసరం అంటున్నారు ఆర్థిక నిపుణులు. ‘స్కూల్ ఫండ్’ పేరుతో తల్లిదండ్రులు ప్రతీ నెలా కొంత డబ్బును పక్కన పెట్టడం అలవాటు చేసుకోవాలి. ప్రతీ ఏడాదీ జనవరి నెల నుంచే ఈ పొదుపు మొదలుపెడితే మేలు. దీనివల్ల పిల్లల విద్యకు సంబంధించిన ఖర్చులకు ఇబ్బంది ఉండదు. అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా ‘స్కూల్ ఫండ్’ సమకూర్చుకోవచ్చు.
కొత్త తరగతుల ఒత్తిడి
సెలవుల తర్వాత ఇళ్లు విడిచి బడికి వెళ్లాలంటే భయపడటం చిన్నపిల్లల్లో సహజం. కొత్త సిలబస్, కొరుకుడుపడని పాఠాలు, పరీక్షల భయం పిల్లల్లో ఆందోళన కలిగించొచ్చు. అలవాటుపడేదాకా కొంత గందరగోళం ఉండటం సహజమే. మార్కుల గురించి మొదటి నుంచే ప్రస్తావించడం వారిపై తెలియని ఒత్తిడి కలగజేయటమే. ఆ పొరపాటు చేయకూడదు. పిల్లలతో ‘నీ శక్తి మేరకు ప్రయత్నించు’ అని చెప్పటం సరైన పద్ధతి. మార్కుల కన్నా ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. పిల్లల చిన్న విజయాలను తేలిగ్గా తీసిపారెయ్యకుండా... వాటిని మనస్ఫూర్తిగా అభినందిస్తుండాలి.
పోషకాహారం ముఖ్యం...
పోషక విలువలున్న సమతులాహారం విద్యార్థుల ఆరోగ్యానికీ, ఎదుగుదలకూ చాలా కీలకం. అయితే ఉదయాన్నే సమయం సరిపోక అల్పాహారం మానివేస్తుంటారు చాలామంది పిల్లలు. బయట జంక్ ఫుడ్ ఎక్కువ తినేస్తుంటారు. అందుకే వారు బ్రేక్ ఫాస్ట్ మానకుండా శ్రద్ధ తీసుకోవాలి. పండ్లు, గుడ్లు, పాలు, మిల్లెట్స్ లాంటి ఆహారం ఇవ్వాలి. రోజూ ఒకేలా ఉండే కూరలు చూస్తే పిల్లలకు ఇష్టంగా తినాలనే ఆసక్తి ఉండదు. బలవంతంగా కాస్త రుచి చూసి వదిలేస్తారు. అందుకే ఏరోజుకారోజు వైవిధ్యం ఉండేలా లంచ్‌బాక్సును సిద్ధం చేయడం చాలా ముఖ్యం. అందులో పోషకాహారాలు తప్పనిసరిగా ఉండేలా చూడాలి.
స్నేహాలు, సామాజిక నైపుణ్యాలు
కొందరు పిల్లలు కొత్త పరిసరాల్లో ఇట్టే కలిసిపోతారు. కానీ అందరికీ ఈ విషయంలో తగిన చొరవ ఉండదు. తమకు అలవాటు లేని వాతావరణంలో.. పరిచయం లేని వారితో కలిసిపోవడంలో ఇబ్బంది పడతారు. దీన్ని గ్రహించి వారిలో బెరుకు పోగొట్టడంపై తల్లిదండ్రులు దృష్టిపెట్టాలి. స్కూల్లో జరిగిన విషయాల గురించి అడగాలి. వారి మాటలనూ, భావాలనూ ఓపిగ్గా వినాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి మనసు గాయపడేలా తప్పు పట్టకూడదు. ఇతరులను గౌరవించడం, మర్యాదగా ప్రవర్తించడం, స్నేహితులతో మంచి విషయాలు పంచుకోవడం నేర్పాలి.
వేధింపులపై అప్రమత్తత
విద్యార్థులు కొన్నిసార్లు తరగతిలో, స్కూలు ఆవరణలో, ఇతర ఉమ్మడి ప్రదేశాల్లో తోటివారి మూలంగా శారీరకంగానో, మానసికంగానో వేధింపులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ బుల్లీయింగ్‌తో వారు బాధపడుతున్నా, టీచర్లకు ఫిర్యాదు చేయలేరు. మరోవైపు తల్లిదండ్రులతోనూ చెప్పుకోలేరు. లోలోపలే మథనపడుతుంటారు. పిల్లలు మాటల్లో వ్యక్తీకరించకపోయినా... వారి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు వస్తే గమనించాలి. స్కూలుకు వెళ్లడానికి సాకులు చెప్తున్నా, మారాం చేస్తున్నా... ఎవరైనా బెదిరిస్తున్నారేమో కారణాలను తెలుసుకోవాలి. అవసరమైతే తరగతి ఉపాధ్యాయులతో, మెంటార్లతో వివరంగా మాట్లాడాలి.
పేరెంట్స్... టీచర్ల భాగస్వామ్యం
‘మంచి స్కూల్లో చేర్పించాం. ఇక అంతా వాళ్లే చూసుకుంటారు’ అనే అభిప్రాయం చాలామంది తల్లిదండ్రుల్లో ఉంటుంది. అందుకే పరీక్షల ఫలితాలు వచ్చినపుడు మాత్రమే స్కూలును సంప్రదిస్తారు. అలా కాకుండా పేరెంట్- టీచర్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరవ్వాలి. ఆ మీటింగ్స్‌ను మొక్కుబడిగా భావించకుండా బాధ్యతగా చూడాలి. పిల్లల బలాలూ, బలహీనతలపై చర్చించాలి. తమ వైపు నుంచి ఏం చేయాలో అడగాలి. తమ పిల్లల పురోగతిలో తామూ, ఉపాధ్యాయులూ భాగస్వాములని గుర్తించాలి.
స్క్రీన్ టైమ్ నియంత్రణ
వేసవి సెలవుల్లో ఇంటిల్లిపాదికీ మొబైల్, ట్యాబ్ వినియోగం, టీవీ కార్యక్రమాల వీక్షణం పెరిగివుంటుంది. ఇప్పుడు దీన్ని నియంత్రించడం తప్పనిసరి. పిల్లలు వీటిని చూడటానికి రోజుకు నిర్దిష్ట సమయం మాత్రమే అనుమతించాలి. భోజన సమయంలోనూ, నిద్రకు ముందూ గ్యాడ్జెట్ల వాడకాన్ని తగ్గించడం క్రమక్రమంగా అలవాటు చేయాలి. పుస్తకాలూ, క్రీడలూ, హాబీల వైపు వారి దృష్టిని మళ్ళించడానికి ప్రయత్నించాలి. పిల్లలు రోజుకు కనీసం అరగంటసేపైనా శారీరక వ్యాయామం చేసేలా చూడాలి. వారి ఆసక్తి మేరకు సైక్లింగ్, ఈత, క్రికెట్, బ్యాడ్మింటన్‌లాంటి వాటిని ప్రోత్సహించాలి.
మానసిక ఆందోళనలు
కొత్త తరగతిలోకి వెళ్లేటప్పుడు పిల్లల్లో ‘కొత్త టీచర్లు ఎలా ఉంటారు?’, ‘నా పాత ఫ్రెండ్స్ నా సెక్షన్లోకి వస్తారా లేదా?’ అనే సందేహాలూ, ఆందోళనలూ ఉంటాయి. తల్లిదండ్రుల్లోనూ సామాజికపరమైన ఒత్తిడి కనిపిస్తుంది. తోటి ఉద్యోగులు, బంధువుల పిల్లలు ఏ తరహా స్కూళ్లలో చదువుతున్నారు, వారు ఎంత ఫీజు కడుతున్నారు, ఏ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కు వెళ్తున్నారు అనే విషయాలతో పోల్చుకోవడం సహజంగానే మానసిక ఒత్తిడికి గురిచేస్తుంటాయి. ‘‘జూన్, జూలై నెలల్లో మా వద్దకు వచ్చే కేసుల్లో స్కూల్ యాంగ్జయిటీకి సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. పిల్లలు బడికి వెళ్లనని ఏడుస్తుంటారు. కడుపునొప్పి అని సాకులు చెప్తుంటారు.
దీనికి తోడు కొందరు తల్లిదండ్రులు తమ ఆర్థిక స్థోమతకు మించి వేరే వాళ్లతో పోటీ పడి కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లలో చేరుస్తుంటారు. ఆ తర్వాత ఆర్థిక భారానికి తోడు న్యూనతాభావానికి వారు లోనవుతున్నారు’’ అంటున్నారు కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ లలిత . ఇలాంటి మానసిక ఆందోళనలకు పిల్లలతో పాటు పెద్దలు కూడా గురికావొద్దు. తల్లిదండ్రులు పిల్లలతో కూర్చుని చొరవగా మాట్లాడాలి. వారు స్వేచ్ఛగా తమ భావాలు వ్యక్తీకరించేలా ప్రోత్సహించాలి. భయపెట్టే ధోరణిలో మాట్లాడకూడదు. కొత్త తరగతిలో నేర్చుకునే విశేషాలూ, కొత్తవారిని స్నేహితులుగా ఎలా చేసుకోవాలో సానుకూలంగా వివరించాలి. అదేవిధంగా బ్రాండ్లు, స్కూల్ భవంతుల ఘనతను చూసి ప్రభావితం కాకుండా తమ ఆర్థిక పరిమితులను లోబడి, విద్యార్థులను ఒత్తిడికి గురిచేయకుండా నాణ్యమైన విద్యను అందించే పాఠశాలలను ఎంచుకోవడం ఉత్తమం.
డిజిటల్ భద్రత
విద్యార్థులు తమ హోమ్ వర్క్ కోసం, అసైన్‌మెంట్లు రాయడానికీ ఏఐ చాట్ బాట్లను ఉపయోగించే ధోరణి పెరుగుతోంది. నేర్చుకోవడానికి మొదట్లో సహాయపడినా, పూర్తిగా వాటిపై ఆధారపడటం ప్రమాదకరం. సోషల్ మీడియాలో మితిమీరి గడిపితే నష్టాలూ, గేమింగ్ వల్ల సైబర్ ప్రమాదాలపై వారికి అవగాహన పెంచాలి. డిజిటల్ వినియోగ లాభనష్టాలపై సంభాషిస్తుండాలి. వ్యక్తిగత సమాచారం ఏ రూపంలోనూ ఆన్‌లైన్‌లో పంచుకోవద్దని గట్టిగా చెప్పాలి. వయసుకు తగిన యాప్స్ మాత్రమే అనుమతించాలి.
పాఠశాల అనేది అక్షర జ్ఞానం నేర్పే చోటు మాత్రమే కాదు. అది క్రమశిక్షణతో కూడిన జీవితాన్నీ, విలువలనూ అలవర్చే అమూల్యమైన వేదిక. చదువు, క్రీడలు, సంగీతం, కోడింగ్... ఇలా ప్రతీ దాంట్లో ముందుండాలని తల్లిదండ్రులు కోరుకోవడం పిల్లల్లో ఒత్తిడిని పెంచుతుందని గ్రహించాలి. సరైన ముందస్తు ప్రణాళిక, నిబంధనలపై అవగాహన, పిల్లలతో నాణ్యమైన సమయం గడపడం ద్వారా ఈ విద్యా సంవత్సరాన్ని ఒత్తిడి లేకుండా చేసుకోవచ్చు. కఠిన నియంత్రకులుగా కాకుండా ప్రేమతో మార్గదర్శకులుగా మారితే చాలు.. పిల్లలు చదువులో ముందుండటమే కాదు, ఆత్మవిశ్వాసంతో.. సకల నైపుణ్యాలతో వికసిస్తూ ముందుకు దూసుకెళతారు. ఆల్ ది బెస్ట్!
సండే డెస్క్
పుస్తకాల మార్గనిర్దేశనం...
పిల్లలకు ఆహ్లాదం ఇచ్చే, పెద్దలకు మార్గదర్శనం చేసే.. ప్రాచుర్యం పొందిన కొన్ని పుస్తకాలున్నాయి. వాటిని చదివి ‘బ్యాక్ టు స్కూల్’ సీజన్‌పై కొంత అవగాహన ఏర్పరచుకోవచ్చు.
వీఆర్ డిఫరెంట్ అండ్ ఇట్స్ టోటల్లీ కూల్
కేమీ యే హృద్యమైన రచన ఇది. దీనిలో హాస్యభరితమైన పోలికలూ, విలక్షణమైన బొమ్మలూ ఉంటాయి. పాఠశాలలు తిరిగి ప్రారంభమైన ఈ సమయంలో దీన్ని చదవటం సందర్భోచితం. తరగతిలో నేస్తాలను కలుపుకుని బిగ్గరగా చదివి ఆనందించడానికి ఈ పుస్తకం మంచి ఎంపిక.
స్కూల్ ఈజ్ కూల్
పాఠశాల ప్రారంభమైన మొదటి రోజుల కోసం సిద్ధమవుతున్నవారికి ఇది అద్భుతమైన బహుమతి. రచన.. సబ్రీనా మొయ్‌లీ. బడిలో ఉండే నియమాలేవీ తెలియవనీ, స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి, అందరితో ఎలా కలిసిపోవాలి అని ఆందోళన చెందుతున్నవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. చమత్కార ధోరణిలో ఆహ్లాదకరంగా సాగుతుందీ పుస్తకం.
గెటింగ్ బ్యాక్ యువర్ చైల్డ్ బ్యాక్ టు స్కూల్
క్రిస్టఫర్ ఎ. కెర్నీ రాసిన ఈ పుస్తకం పాఠశాల హాజరు సమస్యలను పరిష్కరించడానికి తల్లిదండ్రులకు కొన్ని కిటుకులను అందిస్తుంది. మైండ్‌ఫుల్ పద్ధతులు, తల్లిదండ్రుల భాగస్వామ్య వ్యూహాలను వివరించారు.
బ్యాక్ టు స్కూల్ ఫర్ పేరెంట్స్
తరగతి గదిలో తమ పిల్లలు నాణ్యమైన విద్య మెరుగ్గా పొందేలా సహాయపడటానికి తల్లిదండ్రులు పాటించదగ్గ మెలకువలు ఈ పుస్తకంలో ఉన్నాయి. రచయిత.. మైకేల్ డి బఫోర్డ్ బమెడ్. పాఠశాలల పునఃప్రారంభ వేళ సగటు పేరెంట్స్ కూడా అనుసరించగల సరళమైన వ్యూహాలను దీనిలో వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News