స్వయంకృషితో ఎదిగిన మేధావి
ABN , Publish Date - Jun 14 , 2026 | 02:58 AM
ఒకప్పుడు ఏడాదికి ఐదారు చిత్రాలతో బిజీగా ఉన్న నటి పూనమ్ థిల్లాన్. స్టార్ హీరోలు... దర్శకులు కోరుకున్న కథానాయికగా వెండితెరపై అలరించిన ఆమెకు దివంగత దర్శక దిగ్గజం భారతీరాజాతో ప్రత్యేక అనుబంధం
ఒకప్పుడు ఏడాదికి ఐదారు చిత్రాలతో బిజీగా ఉన్న నటి పూనమ్ థిల్లాన్. స్టార్ హీరోలు... దర్శకులు కోరుకున్న కథానాయికగా వెండితెరపై అలరించిన ఆమెకు దివంగత దర్శక దిగ్గజం భారతీరాజాతో ప్రత్యేక అనుబంధం. ఆయన దర్శకత్వంలో చేసింది రెండే చిత్రాలు అయినా... తనపై చెరగని ముద్ర వేశారంటారు పూనమ్. ‘చెన్నై వెళ్లినప్పుడు భారతీరాజాను కలవాలని ప్రయత్నించాను. కానీ ఆయన అనారోగ్యంగా ఉండటంవల్ల కుదరలేదు’ అంటూ ఓ ఇంటర్వ్యూలో పూనమ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...
‘‘ఒక నటిగా నేను వందకు పైగా చిత్రాలు, టెలివిజన్ షోస్‌లో నటించాను. ఎంతోమంది సాంకేతిక నిపుణులతో కలిసి పని చేశాను. కానీ భారతీరాజా సర్ లాంటి వ్యక్తిని చూడలేదు. ఆయన గొప్ప దర్శకుడు. వినయశీలి. నిరాడంబరమైన వ్యక్తి. నాకు ఆయన పట్ల ఎంతో ఆప్యాయత, గౌరవం ఉన్నాయి. చివరి రోజుల్లో కొన్నిసార్లు చెన్నై వెళ్లినప్పుడు సర్‌ను కలవాలనుకున్నాను. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. కలవడం కుదరదని కుటుంబ సభ్యులు చెప్పారు. దాంతో ఆయన్ను చూడలేకపోయాను.
ఎంతో నేర్చుకున్నాను...
నా కెరీర్ ఆరంభంలోనే ‘రెడ్ రోజ్’ చిత్రం ద్వారా భారతీరాజాతో కలిసి పని చేసే అదృష్టం దక్కింది. తమిళ సినిమా ‘సిగప్పు రోజక్కల్’కు రీమేక్ అది. అందులో కమల్‌హాసన్, శ్రీదేవి నటించారు. కమల్ పాత్రను హిందీలో రాజేష్ ఖన్నా పోషించారు. ఆ తరువాత ఆరేళ్లకు ‘సవేరే వాలీ గాడీ’లో చేశాను. ఆయన దర్శకత్వంలో నటించింది రెండే సినిమాలు. కానీ ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. మా ఇద్దరి మధ్య మంచి అవగాహన, చక్కని అనుబంధం ఉండేవి.

నిరాశపడి ఉంటారు...
భారతీరాజా మొదటిసారి నన్ను చూసినప్పుడు ఆశ్చర్యపోయి ఉంటారని నేను అనుకుంటున్నాను. తన చిత్రంలో అత్యంత ముఖ్యమైన పాత్ర చేయబోయే అమ్మాయి ఈమే అని తెలిసి నిరాశపడివుంటారు. ఎందుకంటే తమిళంలో ఆ పాత్రను శ్రీదేవి పోషించారు. తను అద్భుతమైన నటి. చిన్నప్పుడే పరిశ్రమలోకి వచ్చింది కాబట్టి, కచ్చితంగా నాకంటే ఆమెకు ఎక్కువ అనుభవం ఉంటుంది. అప్పుడు నేనేమో కళావిహీనంగా ఉన్న టీనేజర్‌ని. తమిళ వెర్షన్‌తో పోల్చినప్పుడు ‘రెడ్ రోజ్’ కూడా బాగానే వచ్చింది. కానీ పెద్దగా ఆడలేదు. బహుశా అప్పట్లో హిందీ ప్రేక్షకులకు సైకోపాత్ యాంటీ హీరో పాత్రలు కొత్త కావడం ఒక కారణం కావచ్చు. దానికితోడు రాజేష్ ఖన్నా రొమాంటిక్ హీరోగా వెలిగిపోతున్న రోజులవి. కానీ కమల్ వేరు. తను ఎలాంటి పాత్రనైనా పోషించి, ఆ ఇమేజి నుంచి బయటకు రాగలరు. ఇప్పుడు కాలం మారింది. ‘రెడ్ రోజ్’ తన కాలానికి ముందే వచ్చిందనిపిస్తోంది.
‘వికారంగా మార్చలేము’ అన్నారు...
ఒక నటిగా రూపుదిద్దుకోవడంలో భారతీరాజా పాత్ర ఎంతో ఉంది. కెరీర్ ఆరంభంలో, అంటే నా తొలి చిత్రం ‘నూరీ’ తరువాత ఆయనతో కలిసి పని చేసే అరుదైన అవకాశం లభించింది. నాకు అనుభవం లేకపోవడంతో పూర్తిగా దర్శకుడిపైనే ఆధారపడ్డాను. ప్రతిదీ నటించి చూపించేవారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. నేనే కాదు... భారతీరాజా ద్వారా పరిచయమైన, కలిసి పని చేసినవారు ఎవరైనా ఇదే చెబుతారని అనుకొంటున్నాను. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధికను ఆయనే పరిచయం చేశారు. ఆమె అద్భుతమైన నటి. రాధిక తనను తీర్చిదిద్దిన ఘనతను సర్‌కే ఇస్తారు. భారతీరాజా దర్శకత్వంలో ఒక సినిమా వస్తుందని తెలిసి, అందులో చేయాలని ఎంతో అనుకున్నాను. అందవిహీనంగా ఉండే పాత్ర అది. ‘సర్... నేను వేరే మేకప్ వేసుకొంటాను. ముందుకు పొడుచుకువచ్చిన పళ్లు పెట్టుకుంటాను. నాకు ఆ వేషం ఇవ్వండి’ అని అడిగాను. ‘లేదు... నీ ముఖాన్ని వికారంగా మార్చలేము’ అని సర్ అన్నారు. సవాలు విసిరే, విభిన్నమైన పాత్ర ఒకటి చేయాలనేది నా కల. అది నెరవేరలేదు. ఒక నటిగా నేను ఎంత కష్టపడ్డా చివరకు వచ్చే గుర్తింపు... ‘ఓహ్... ఆమె చాలా అందంగా ఉంటుంది’ అనే! అది నాకు చికాకు తెప్పించేది. దానివల్ల నాకు రావాల్సిన గుర్తింపు రాలేదు.
భగవంతుడు ఇచ్చిన వరం...
నేను, భారతీరాజా చాలాకాలం మంచి స్నేహితులుగా ఉన్నాం. ఆ తరువాత మా మధ్య సంబంధాలు తెగిపోయాయి. అందుకు బాధపడుతున్నాను. చివరి రోజుల్లో కలవాలని ఎంత ప్రయత్నించినా కలవలేకపోయాను. ఒక శృంగార సన్నివేశంలో చేతిని ఎలా పెట్టాలి అనే విషయం మొదలు... నటనలో ఎన్నో విషయాలు సర్ నుంచి నేర్చుకున్నాను. నాలోని లోపాలు, నాలో ఉన్న మంచి లక్షణాలు ఆయనకు తెలుసు. నాలో ఎనలేని ఆత్మవిశ్వాసం నింపారు. తను పని చేసిన వారిలో నా ముఖమే అందమైనదని భావించారు. భారతీరాజా స్వయంకృషితో ఎదిగిన మేధావి. సృజనాత్మకత, సంగీత జ్ఞానం ఆయనకు భగవంతుడు ఇచ్చిన వరం.’’
హిందీ రాకపోవడంతో...
‘రెడ్ రోజ్’ తీస్తున్నప్పుడు సరదా ఘటనలు చాలా జరిగాయి. ఆయనకు హిందీ రాకపోవడంతో నా నుంచి ఎలాంటి హావభావాలు కోరుకొంటున్నారో సరిగ్గా చెప్పలేకపోయేవారు. దాంతో నాకు అర్థమయ్యేలా ఆయనే రకరకాలుగా నటించి చూపించేవారు. తన మనసులో ఏముందో... ఎదుటివారి నుంచి ఏంకోరుకొంటున్నారో స్పష్టంగా, ఎలాంటి సంకోచం లేకుండా వ్యక్తపరిచేవారు. ఆయన ముఖ కవళికలు చూసి కొన్నిసార్లు నవ్వుకొనేదాన్ని. రాజేష్ ఖన్నాతో నేను నటించాల్సిన రొమాంటిక్ సన్నివేశాన్ని ఎలా చేయాలో చూపిస్తూ... ముఖం మీద వణుకుతున్న తన చేతిని అడ్డం పెట్టుకొనేవారు. నాకు నవ్వు ఆగేది కాదు. ‘సవేరే వాలీ గాడీ’ అప్పుడు కూడా సన్నీడియోల్‌తో నా శృంగారభరిత సన్నివేశాలను సర్ చేసి చూపించేవారు.