Share News

ఓవర్‌ డ్రాఫ్ట్‌..పర్సనల్‌ లోన్‌ఏది బెస్ట్‌?

ABN , Publish Date - Jun 14 , 2026 | 03:28 AM

తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఈ రోజుల్లో అనేక మంది రుణాలపై ఆధారపడుతున్నారు. బ్యాంకులు, ఫిన్‌టెక్‌ సంస్థలు.. ప్రీ అప్రూవ్డ్‌ రుణ ...

ఓవర్‌ డ్రాఫ్ట్‌..పర్సనల్‌ లోన్‌ఏది బెస్ట్‌?

తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఈ రోజుల్లో అనేక మంది రుణాలపై ఆధారపడుతున్నారు. బ్యాంకులు, ఫిన్‌టెక్‌ సంస్థలు.. ప్రీ అప్రూవ్డ్‌ రుణ ఆఫర్లతో ఊరిస్తుంటాయి. అయితే రుణాలు తీసుకునే సమయంలో వ్యక్తిగత రుణం తీసుకోవాలా లేక ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయాన్ని వినియోగించుకోవాలా? అని చాలా మంది ఆలోచిస్తుంటారు. వీటిలో మీరు దేన్ని ఎంచుకోవాలన్నా మీ ఆర్థిక పరిస్థితి, అవసరాలు, తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం, వడ్డీ రేటు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటిపై అవగాహనను పెంచుకుంటే దేన్ని ఎంచుకోవాలన్న నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఓవర్‌డ్రాఫ్ట్‌..

బ్యాంకులు.. సాలరీ అకౌంట్‌ ఖాతాదారులు, వ్యాపార సంస్థలు, వ్యాపారస్తులు, బ్యాంకులతో మంచి సంబంధాలు కలిగిన వారికి ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయాన్ని కల్పిస్తుంటాయి. ఆదాయ స్థాయిలు, అకౌంట్‌ బ్యాలెన్స్‌ తీరు లేదా ఇప్పటికే కలిగి ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను బట్టి ఆమోదించే పరిమితి ఆధారపడి ఉంటుంది. ఓవర్‌డ్రాఫ్ట్‌ ద్వారా రుణగ్రహీతలు తమ కరెంట్‌ లేదా సేవింగ్స్‌ ఖాతా నుంచి ముందే ఆమోదించిన పరిమితి మేరకు డబ్బును ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తాయి. తమ ఖాతాలో డబ్బు లేకున్నా డబ్బు తీసుకోవచ్చన్న మాట. ఉపసంహరించుకునే పరిమితి బ్యాంకును బట్టి ఉంటుంది. తమ అవసరాన్ని బట్టి రుణగ్రహీతలు డబ్బులు తీసుకోవచ్చు. దాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా చెల్లించవచ్చు. ఎంత డబ్బు అయితే వినియోగించుకుంటారో దానికి మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. తాత్కాలికంగా డబ్బు అవసరం ఉన్నవారికి లేదా అత్యవసరంగా డబ్బు అవసరం ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

వ్యక్తిగత రుణం

వ్యక్తిగత రుణం అనేది అన్‌సెక్యూర్డ్‌ రుణం. ఈ రుణం మంజూరుకు ఎలాంటి హామీ అవసరం ఉండదు. అయితే ఈ రుణం ఇవ్వడానికి ముందు రుణదాతలు సదరు రుణగ్రహీత ఆదాయం, రీపేమెంట్‌ చరిత్ర, క్రెడిట్‌ స్కోర్‌ను మదింపు చేస్తారు. ఈ రుణం మంజూరు అయితే ఆ మొత్తం నేరుగా రుణగ్రహీత బ్యాంకు ఖాతాలో జమవుతుంది. ముందే నిర్దేశించిన కాలానికి అనుగుణంగా నెలవారీ వాయిదాల పద్ధతి (ఈఎంఐ)లో తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఎంత డబ్బును అయితే మంజూరు చేస్తారో ఆ మొత్తంపై మొదటి రోజు నుంచే వడ్డీ పడుతుంది. మీ ఖాతాలో పడిన డబ్బులో ఎంత మీరు ఉపయోగించుకున్నారన్న దానితో సంబంధం ఉండదు. ఎంత డబ్బు అవసరం ఉంటుందో ముందుగానే తెలిసిన వారు పర్సనల్‌ లోన్‌ను ఎంచుకోవచ్చు.


వీటిపై దృష్టి పెట్టాలి..

ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌలభ్యంగా ఉంటుంది. మీ దగ్గర ఉంటే తీసుకున్న మొత్తాన్ని కట్టేయవచ్చు. నిర్ణీత ఈఎంఐ వంటిది ఉండదు. అయితే ఓవర్‌ డ్రాఫ్ట్‌ను నిర్లక్ష్యం చేస్తే స్వల్పకాలానికి తీసుకున్న అప్పు భారీ అప్పుగా మారే ప్రమాదం ఉంటుంది. వ్యక్తిగత రుణం విషయానికి వస్తే.. ప్రతి నెలా ఈఎంఐ చెల్లించాలనే నియమం ఉండటం వల్ల క్రమశిక్షణతో అప్పు చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే ఈఎంఐ మిస్సయితే మాత్రం జరిమానాల భారం పడుతుంది. అలాగే క్రెడిట్‌ స్కోర్‌పైనా ప్రభావం పడే చాన్సు ఉంది. ఇక రుణగ్రహీతలు ప్రాసెసింగ్‌ చార్జీలపై దృష్టిపెట్టాలి.

వడ్డీ రేట్లు ఎలా ఉంటాయంటే..

ఓవర్‌డ్రాఫ్ట్‌పై వ్యక్తిగత రుణాలకన్నా అధిక వడ్డీ రేటు ఉంటుంది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఓవర్‌డ్రాఫ్ట్‌ రేట్లు వార్షికంగా 18 శాతం నుంచి 24 శాతం మధ్య ఉండగా.. కొన్ని సందర్భాల్లో ఎక్కువ కూడా ఉండవచ్చని తెలుస్తోంది. అయితే వ్యక్తిగత రుణం తీసుకునే వారికి ముఖ్యంగా మంచి క్రెడిట్‌ రికార్డు ఉన్న వారికి తక్కువ రేట్లలోనే రుణం లభించే అవకాశం ఉంటుంది. ఓవర్‌డ్రాఫ్ట్‌ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో కాలయాపన చేస్తే చెల్లించాల్సిన వడ్డీ భారం పెరిగిపోతుంది. వ్యక్తిగత రుణం తీసుకున్న వారికి నెలవారీగా ఎంత మొత్తం చెల్లించాలో తెలుస్తుంది కాబట్టి ఆ మేరకు వారు బడ్జెట్‌ ప్లాన్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక స్వల్పకాలానికి నిధుల అవసరం ఉన్నప్పుడు, , వెంటనే తిరిగి చెల్లించే అవకాశం ఉన్నప్పుడు, ఆదాయంలో అస్థిరత లేదా తాత్కాలికంగా నగదుకు ఇబ్బంది ఉన్నప్పుడు, తక్కువ మొత్తంలో నగదు అవసరం ఉన్నప్పుడు ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్లడం సరైనదిగా నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు వేతన జీవులు నెలాఖరులో నగదుకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటే అలాంటి వారికి ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం ఉపయోగకరంగా ఉంటుంది.

ఖర్చు ప్రణాళికాబద్ధమై ఉండి, ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం ఉన్నప్పుడు, ఒకేసారి మొత్తం డబ్బు కావాలనుకున్నప్పుడు, నెలవారీ వాయిదాలు చెల్లించడానికి సిద్ధమైనప్పుడు వ్యక్తిగత రుణాన్ని ఎంచుకోవడం మేలు. పెళ్లిళ్లు, వైద్య చికిత్సలు, ఉన్నత విద్య, ప్రయాణాలు లేదా ఇల్లు రిపేరు లేదా రెనోవేషన్‌ చేయాలనుకున్నప్పుడు ఈ రుణాన్ని ఎంచుకుంటుంటారు. పటిష్ఠ క్రెడిట్‌ ప్రొఫైల్‌, 700కు మించి క్రెడిట్‌ స్కోర్‌ ఉన్న వారు మంచి రేటుతో.. అధిక మొత్తం వ్యక్తిగత రుణం పొందడానికి అవకాశం ఉంటుంది.

Updated Date - Jun 14 , 2026 | 03:29 AM