‘మెగా డీఎస్సీ’పై తోకముడిచిన వైసీపీ!
ABN , Publish Date - Jun 14 , 2026 | 05:41 AM
మెగా డీఎస్సీపై చేస్తున్న నిరాధార ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలన్న టీడీపీ నేతల సవాల్‌పై వైసీపీ తోక ముడిచింది! శనివారం ఉదయం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో..
ఆరోపణలపై చర్చకు రావాలన్న టీడీపీ నేతలు
తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో గంటకు పైగా వేచిచూసిన ఎమ్మెల్సీ శ్రీకాంత్, శాప్ చైర్మన్ రవి నాయుడు
తిరుపతి సిటీ, జూన్ 13(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీపై చేస్తున్న నిరాధార ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలన్న టీడీపీ నేతల సవాల్‌పై వైసీపీ తోక ముడిచింది! శనివారం ఉదయం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, శాప్ చైర్మన్ రవి నాయుడు ఇతర నేతలతో కలిసి గంటకు పైగా ఎదురుచూసినా వైసీపీ నేతలు ఎవరూ రాలేదు. దీంతో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకుని.. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను, నిరుద్యోగ యువతను రెచ్చగొట్టే ప్రయత్నాలు విరమించాలని టీడీపీ నేతలు హితవు పలికారు. డీఎస్సీ, స్పోర్ట్స్ కోటా నియామకాలపై జగన్, వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలు, రాజకీయ దురుద్దేశపూరితమైనవని ఎమ్మెల్సీ శ్రీకాంత్ స్పష్టం చేశారు.
కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన 16వేల మంది అభ్యర్థులు, వారి కుటుంబాల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించి, వేలాది టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలోనూ అర్హత కలిగిన అభ్యర్థులకే ఉద్యోగాలు లభించాయని స్పష్టంచేశారు. నియామకాల్లో అవినీతి జరిగి ఉంటే.. ఖాళీ పోస్టులు మిగిలి ఉండేవి కాదన్నారు. వైసీపీ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని, టీసీఎస్ ఐయాన్ సాంకేతిక వ్యవస్థ ద్వారా పరీక్షల నిర్వహణతో పాటు ప్రశ్నాపత్రాలను ఎన్కిప్ర్టెడ్ విధానంలో భద్రపరిచినట్లు వివరించారు. బహుళస్థాయి భద్రతా వ్యవస్థల కారణంగా పేపర్ లీకేజీకి ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు. స్పోర్ట్స్ కోటా నియామకాలు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో జరిగాయని తెలిపారు. నిపుణుల కమిటీ అర్హతలను పరిశీలించిన అనంతరమే ఎంపికలు జరిగాయన్నారు.
స్పోర్ట్స్ అథారిటీ ఎటువంటి క్రీడా సర్టిఫికెట్లు జారీ చేయదని, గుర్తింపు పొందిన సంఘాలు, ఫెడరేషన్లు, విశ్వవిద్యాలయాలు మాత్రమే వాటిని జారీ చేస్తాయని పునరుద్ఘాటించారు. డీఎస్సీ నియామకాలపై వచ్చిన ప్రతి అభ్యంతరానికీ అధికారులు, శాఖాధిపతులు, ప్రభుత్వం ఇప్పటికే ఆధారాలతో సమాధానాలు ఇచ్చినప్పటికీ, వైసీపీ నేతలు మళ్లీ అదే ఆరోపణలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. బహిరంగ చర్చకు రావాలని వైసీపీ నాయకులను మరోసారి ఆహ్వానించారు.