ఎడారి పండు... ఎన్ని రకాలో...
ABN , Publish Date - Jun 14 , 2026 | 08:54 AM
ఖర్జూర... రుచిలో మేటి, పోషకాలు పుష్కలం. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడే స్నాక్ ఇది.
ఖర్జూర... రుచిలో మేటి, పోషకాలు పుష్కలం. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడే స్నాక్ ఇది. ఖర్జూరాలలో చాలా రకాలున్నాయి. ఒక్కోరకం ప్రత్యేకమైన రుచిని, నాణ్యతను కలిగి ఉంటుంది. ఒకప్పుడు గల్ఫ్ దేశాల్లోనే పండిన ఖర్జూరాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సాగవుతున్నాయి.
ఖర్జూర అనగానే గల్ఫ్ దేశాలు గుర్తొస్తాయి. వందల ఎకరాల్లో ఈత వనాల్లాంటి ఖర్జూర తోటలు అక్కడ సాధారణం. కొన్ని శతాబ్దాలుగా గల్ఫ్ దేశస్తులకి ఖర్జూరాలు ప్రధాన ఆహారం. డేట్స్ తినకుండా వారి రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. నోరూరించే తీపితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఖర్జూరాల వినియోగం పెరిగింది. మనదగ్గర సైతం సూపర్‌మార్కెట్‌కి వెళితే నాలుగైదు రకాల ఖర్జూరాలు కనిపిస్తున్నాయి.
ఒకప్పుడు సౌదీ అరేబియాలో మాత్రమే పండిన ఖర్జూరాలు ఇప్పుడు అనేక దేశాలలో సాగవుతున్నాయి. అయితే సౌదీలోని మదీనా ప్రాంతంలో పండే ఖర్జూరాలకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంటోంది. ఇక్కడ నాణ్యమైన ఖర్జూరాలు సాగవుతుంటాయి. వీటిలో చాలా రకాలున్నాయి. వాటి సైజు, రంగు, తీపి... ఇలా ప్రతీ అంశంలోనూ తేడా ఉంటుంది.
ఖర్జూరాలలో రారాజు...
మెడ్‌జూల్ డేట్స్... వీటిని ‘కింగ్స్ ఆఫ్ డేట్స్’గా పిలుస్తారు. మెత్తగా, జ్యూసీగా, క్యారమెల్‌లా తియ్యగా ఉంటాయి. ఈ రకమైన ఖర్జూరాలు మొరాకోకు చెందినవంటారు. ప్రస్తుతం సౌదీ అరేబియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా సాగవుతున్నాయి. తక్షణ శక్తినిస్తాయి. వీటిలో ఉండే మెగ్నీషియం గుండెకు మేలు చేస్తుంది. నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. వీటిని తరచుగా తింటే సహజసిద్ధమైన ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మధుమేహంతో బాధపడేవారు మితంగా తీసుకోవచ్చు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మెడ్‌జూల్ ఖర్జూరాలను స్నాక్స్, స్మూతీస్, డెజర్ట్స్, ఎనర్జీ బార్‌ల తయారీలో వాడతారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతిలో 25 శాతం మెడ్‌జూల్ ఖర్జూరాలదే. అల్జీరియా, ట్యునీషియా దేశాలలో పండే మెడ్‌జూల్ ఖర్జూరాలను ఫ్రాన్స్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. పెద్ద సైజులో లభించే మెడ్‌జూల్ డేట్స్‌ని నెదర్లాండ్స్‌లో లగ్జరీకి చిహ్నంగా అమ్ముతుంటారు.
పవిత్రమైన ఖర్జూరం
‘అజ్వా’... ఇస్లామిక్ సంప్రదాయంలో పవిత్రమైన ఖర్జూరంగా గుర్తింపు పొందింది. వీటిని ప్రీమియం క్వాలిటీగా చెబుతారు. మెత్తగా, కొద్దిగా తియ్యగా, ఒక పండును పోలిన రుచిని కలిగి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. చిన్నగా నలుపు రంగులో మృదువుగా ఉండే వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఐరన్ పుష్కలం. క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. జీర్ణవ్యవస్థకు మంచిది. వీటిలో ఉండే నేచురల్ షుగర్స్ తక్షణ శక్తిని అందిస్తాయి. స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు. ఉపవాసం ఉన్న రోజుల్లో తీసుకోదగిన ఖర్జూరాలివి. అజ్వా ఖర్జూరాలు సౌదీ అరేబియాలోని మదీనాలో విరివిగా సాగవుతుంటాయి.
మబ్రూమ్ డేట్స్
ఈ రకం ఖర్జూరాలు నాణ్యమైనవి. పోషకాలు ఎక్కువ. ఇతర ఖర్జూరాలతో పోలిస్తే కాస్త గట్టిగా ఉంటాయి. క్యారమిల్ ఫ్లేవర్ ఉంటుంది. సౌదీ అరేబియాలో ఎక్కువగా సాగవుతుంటాయి. ఫైబర్ శాతం ఎక్కువ. జీర్ణవ్యవస్థకు, గట్‌హెల్త్‌కు మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ఈ డేట్స్‌ను తినొచ్చు. పొడవుగా, ముదురు గోధుమరంగులో, ఉపరితలం ముడతలు పడి ఉంటుంది. క్యాల్షియం పాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి.
రుచిలో నెంబర్‌వన్
‘కిమియా’ ఖర్జూరాలకు రుచిలో మరేవీ సాటి రావు. మృదువుగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా... ముదురు రంగులో జ్యూసీగా ఉంటాయి. క్యారమిల్ ఫ్లేవర్‌తో నోరూరిస్తాయి. వీటిని ‘మజఫటి డేట్స్’ అని కూడా పిలుస్తారు. ఈ ఖర్జూరాలో పోషకాలు ఎక్కువ. నేచురల్ స్వీట్‌నెస్ వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. వీటిలో ఉండే పొటాషియం కండరాలు, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ డేట్స్‌ని ప్రీ వర్కవుట్ స్నాక్స్‌గా తీసుకోవచ్చు. ఫైబర్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం దూరమవుతుంది. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడుతున్నవారు ఈ ఖర్జూర తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇరాన్‌లోని బామ్ రీజియన్‌లో మొదట పండించినట్టుగా ఆధారాలున్నాయి.
మలినాలను తొలగిస్తాయి
డీటాక్సిఫికేషన్ కోసం ‘ఖుద్రి’ డేట్స్ ఉపయోగపడతాయి. ముదురు గోధుమ రంగులో, కొద్దిగా ముడతలతో ఉంటాయి. ఎక్కువ తీపి ఉండవు. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ఇవి నేచురల్ డిటాక్సిఫయర్‌గానూ పనిచేస్తాయి.
అంబర్ ఖర్జూర
అంబర్ ఖర్జూరాలను సౌదీ అరేబియాలోని మదీనా రీజియన్‌లో కొన్నివేల ఏళ్ల క్రితం పండించారు. బైబిల్, ఖురాన్‌లలో అంబర్ ఖర్జూరాల ప్రస్తావన ఉంటుంది. పెద్దగా, పొడవుగా, తియ్యగా, రుచికరంగా ఉంటాయి. వీటిలో అధిక స్థాయిలో కెరొటినాయిడ్స్ ఉంటాయి. ఐరన్ అధికంగా ఉంటుంది కాబట్టి రక్తహీనతతో బాధపడుతున్నవారు వీటిని తింటే ప్రయోజనం ఉంటుంది. ఈ ఖర్జూరలో ఉండే ప్రొటీన్ కండరాల పటుత్వానికి సహాయపడుతుంది. అరేబియా ద్వీపకల్పంలోని ఎడారుల నుంచి మొరాకోలోని వివిధ వాతావరణ పరిస్థితులలో ఇవి సాగవుతున్నాయి. సౌదీ అరేబియా, ఒమన్, యెమన్, ఇరాక్, ఇరాన్, అల్జీరియా, మొనాకో దేశాలతో పాటు చాలా దేశాల్లో ఈ రకం ఖర్జూరాను పండిస్తున్నారు.
ఆహారంలో తీపి కోసం...
ఇరాక్‌లోని సఫావియా ప్రాంతానికి చెందిన ఖర్జూరాలివి. ఆసియా దేశాలలో ఆహారపదార్థాలలో తియ్యదనం కోసం ఈ ఖర్జూరాలను ఉపయోగిస్తుంటారు. ఈ ఖర్జూరాలలో తీపి గింజ నుంచే వస్తుంది. ముదురు నలుపు రంగులో ఉంటాయి. తరచుగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గట్ హెల్త్‌కు మేలు చేస్తుంది.
క్వీన్ ఆఫ్ డేట్స్
డెగ్లెట్ నూర్ డేట్స్... వీటిని ‘ఖర్జూరాల రారాణి’ అంటారు. ఈ ఖర్జూరాలు తక్కువ తీపితో కాస్త ఎండిన స్థితిలో, డెలికేట్ ఫ్లేవర్‌తో ఉంటాయి. ఇవి మొదటిసారి అల్జీరియాలో పండినట్టు ఆధారాలున్నాయి. మినరల్స్ ఎక్కువగా, ఫ్యాట్ తక్కువగా ఉండే ఈ ఖర్జూరాలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి. క్రీడాకారులకు బెస్ట్ స్నాక్‌గా చెప్పుకోవచ్చు. నేచురల్ ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తాయి. గట్ హెల్త్‌కు మేలు చేస్తాయి. ఐరన్, పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తసరఫరా మెరుగవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. తక్కువ తీపిగా ఉంటాయి కాబట్టి రోజూ తీసుకోవచ్చు. అల్జీరియాతో పాటు ట్యునీషియా, అమెరికాలోని క్యాలిఫోర్నియా, అరిజోనా, టెక్సాస్‌లలో విరివిగా పండుతాయి. ట్యునీషియాలోని ఒయాసిస్‌లలో సాగవుతుంటాయి. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో చక్కెరకు బదులుగా ఈ ఖర్జూరాలను ఉపయోగించారు. క్యాండీలకు ప్రత్యామ్నాయంగా ఇవి ఉపయోగపడతాయి. ఎగుమతుల విలువ ప్రకారం చూస్తే ఈ ఖర్జూరాలు అగ్రస్థానంలో ఉన్నాయి.
తేనే రుచిలో..
అప్పుడే తెంపిన ‘సుక్కారి డేట్స్’ బంగారు వర్ణంలో ఉంటే, ఎండిన తరువాత లేత గోధుమ రంగులోకి మారతాయి. వీటిని మొదట సౌదీ అరేబియాలోని ఖాసిం ప్రాంతంలో పండించినట్టు చెబుతారు. తేనె రుచితో చాలా తియ్యగా ఉంటాయి. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువ. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయి. వీటిలో ఉండే పాలీఫెనాల్స్ చర్మాన్ని తేమగా ఉంచుతాయి. యాంగ్జయిటీని తగ్గిస్తాయి. చర్మ నిగారింపునకు ఉపకరిస్తాయి. మిల్క్ షేక్స్, పేస్ట్రీల తయారీలో ఈ ఖర్జూరాలను వాడతారు.
పోషక విలువలివి...
ఫైబర్ ఉంటుంది. జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.
పొటాషియం, మెగ్నీషియం, కాపర్ వంటి ముఖ్యమైన మినరల్స్ పుష్కలం.
మెటబాలిజానికి సహాయపడే నియాసిన్, విటమిన్ బి6, పాంటోథెనిక్ యాసిడ్ ఉంటాయి.
ఫ్లేవనాయిడ్లు, కెరొటినాయిడ్స్, ఫెనొలిక్ యాసిడ్స్ లభిస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాల వ్యాధులు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
త్వరలో ఆర్టీసీలో వెల్ఫేర్ కమిటీల రద్దు
Read Latest AP News And Telangana News And International News And Telugu News