పచ్చని సంసారంలో చాటింగ్ చిచ్చు!
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:25 AM
పెళ్లికి ముందు యువకుడితో ఉన్న పరిచయాన్ని పెళ్లయ్యాక కూడా ఆ యువతి కొనసాగించడం.. ఇది ఇంట్లో తెలిసి గొడవలు జరగడంతో ఏడాదిన్న బిడ్డను వదిలేసి...
ప్రియుడితో పాత పరిచయాన్ని కొనసాగించిన వివాహిత
మందలించి పుట్టింటికి పంపించేసిన భర్త
గ్రామ శివార్లో ప్రియుడితో కలిసి ఆత్మహత్య
నాగర్‌కర్నూల్ జిల్లా ఎల్లూరులో విషాదం
కొల్లాపూర్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): పెళ్లికి ముందు యువకుడితో ఉన్న పరిచయాన్ని పెళ్లయ్యాక కూడా ఆ యువతి కొనసాగించడం.. ఇది ఇంట్లో తెలిసి గొడవలు జరగడంతో ఏడాదిన్న బిడ్డను వదిలేసి ఆ యువకుడితో కలిసి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా ఈ ఘటన జరిగింది. కొల్లాపూర్ మండలం ఎల్లూరుకు చెందిన రేణుక (21) అదే గ్రామానికి చెందిన అవివాహితుడు శివ (25) ప్రేమించుకోగా పెద్దలు ఒప్పుకోలేదు. రేణుకకు ఇదే మండల పరిధిలోని ముక్కిడిగుండం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిపించారు. రేణుక దంపతులకు ఏడాదిన్నర వయసున్న పాప ఉంది. అయితే, శివతో రేణుక స్నేహాన్ని కొనసాగించినట్లు, ఇద్దరూ సెల్‌ఫోన్‌లో చాటింగ్ చేసుకుంటున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం బయటపడటంతో భర్త, ఆమెను పుట్టింటికి పంపాడు. పెద్దలు భర్తకు నచ్చజెప్పి అతడి వెంట రేణుకను పంపించారు. ఇంట్లో భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవలు తలెత్తాయి. వారం క్రితం రేణుక.. బిడ్డతో ఎల్లూరులోని పుట్టింటికొచ్చేసింది. శుక్రవారం రాత్రి నిద్రిస్తున్న బిడ్డను వదిలేసి, ఇంట్లోంచి వెళ్లిపోయింది. అదే సమయంలో శివ కూడా అర్ధరాత్రి తన స్నేహితుడిని కలిసిసొస్తానని ఇంట్లో చెప్పి బైక్‌పై వెళ్లిపోయాడు. శనివారం ఉదయం గ్రామ శివార్లో గొర్రెలకాపరులకు మామిడితోటలో చెట్టుకు ఒకే చీరతో ఉరి వేసుకున్నస్థితిలో రేణుక, శివ కనిపించారు.