Share News

జానూ.. ఎక్కడున్నావ్‌!

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:50 AM

ఎనిమిది రోజులు గడుస్తున్నా కాకినాడ జిల్లా తుని రూరల్‌ మండలం సీహెచ్‌ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి(జానూ) జాడ కనిపించడం లేదు.

జానూ.. ఎక్కడున్నావ్‌!

  • 8 రోజులుగా మిస్టరీగా మారిన చిన్నారి అదృశ్యం

  • క్లూ దొరుకుతుందనుకుంటే పెంపుడు కుక్కా మృతి

  • చిన్నారి జాడ కనుగొనేందుకు ఉన్న ఏకైక ఆశా ఆవిరి

  • రేబిస్‌తో మృతి చెందినట్లు గుర్తించి పోస్టుమార్టం

  • చిన్నారి తండ్రితో వివాదం ఉన్న వ్యక్తులను విచారించినా ప్చ్‌

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

ఎనిమిది రోజులు గడుస్తున్నా కాకినాడ జిల్లా తుని రూరల్‌ మండలం సీహెచ్‌ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి(జానూ) జాడ కనిపించడం లేదు. పాప తప్పిపోయిన ప్రాంతం నుంచి 16 కిలోమీటర్ల మేర వెయ్యెకరాల అటవీప్రాంతాన్ని అణువణువూ గాలించినా చిన్న క్లూ కూడా పోలీసులకు లభించలేదు. మరోపక్క పాప తప్పిపోయినప్పుడు ఆమెతోపాటు ఉన్న పెంపుడు కుక్క శనివారం మధ్యాహ్నం అనారోగ్యంతో చనిపోయింది. వాస్తవానికి కుక్కకు శుక్రవారం జీపీఎస్‌ తగిలించి అది వెళ్లిన దారిలో పాప కోసం వెదికారు. ఆరు కిలోమీటర్ల మేర అటవీప్రాంతంలో తిరిగిన శునకం మళ్లీ ఇంటికి వచ్చేసింది. తీరా జీపీఎస్‌ ట్రాకింగ్‌ మొదలుపెట్టేలోగా అకస్మాత్తుగా చనిపోయింది. చిన్నారి అన్వేషణలో కీలక ఆధారం జారిపోయినట్లయింది. దీంతో చిన్నారి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. పోలీసులు సైతం కుక్క మృతితో తదుపరి అన్వేషణ ఎలా దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.


ఆ కుక్కకు రేబిస్‌?!

అటవీప్రాంతం నుంచి తిరిగివచ్చిన నాటి నుంచీ కుక్క విచిత్రంగా అరవడం, దగ్గరకు వచ్చినవారిపై దాడి చేయడం వంటివి చేసింది. దాని ఒంటి నుంచి పలుచోట్ల రక్తం రావడంతో కుక్కపై దాడి చేసి ఎవరైనా పాపను అపహరించారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ లోగా సపర్యలు చేయగా కుక్క కోలుకోవడంతో దానికి శుక్రవారం జీపీఎస్‌ అమర్చి బయటకు వదిలారు. ఇంటినుంచి అటవీప్రాంతంలో ఆరు కిలోమీటర్ల మేర తిరగ్గా, జీపీఎస్‌ ద్వారా కదలికలను ట్రాక్‌ చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుండడం, తిండి సరిగ్గా తినక నీరసంగా ఉండడంతోపాటు.. కుక్కను వేరే కుక్కలు, లేదా జంతువులు కరిచినట్లు వైద్యులు గుర్తించారు. శుక్రవారం రాత్రి కుక్కకు వెటర్నరీ వైద్యుడు రేబిస్‌కు సంబంధించిన రెండు ఇంజక్షన్లు చేశారు. అయినా చనిపోవడంతో దీనికి కారణమేమిటన్నది తేల్చేందుకు దీని శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపారు.


కొండచిలువా.. కిడ్నాపా..??

చిన్నారి ఆచూకీ కనుగొనేందుకు జిల్లా ఎస్పీ బింధుమాధవ్‌ పూర్తిస్థాయిలో పోలీసులను మోహరించారు. పెద్దాపురం సబ్‌ డివిజన్‌ నుంచి 400 మంది పోలీసులతో అడవిని జల్లెడ పట్టారు. సివిల్‌ పోలీస్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, అటవీశాఖల సిబ్బంది మొత్తం వెయ్యి ఎకరాల్లో చిన్నారి కోసం గాలించాయి. చిన్నారి తప్పిపోయిన ప్రాంతంలో ఉన్న కొండలపైకి మూడుసార్లు పోలీసులు వెళ్లి వచ్చారు. కాగా, పాపతప్పి పోయిన అడవిలో కొండచిలువలు ఉన్నట్లు అటవీశాఖ చెబుతోంది. అదేమైనా మింగేసిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈప్రాంతంలో కొండముచ్చులు, అడవిపందులు అధికం. అదికాకుండా ఎవరైనా అపహరించుకుపోతే ముందస్తు ప్లాన్‌ ప్రకారం పాపను కిడ్నాప్‌ చేయాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. మరోపక్క చిన్నారి తండ్రికి కారు గొడవ కారణంగా ఉన్న విబేధాల నేపథ్యంలో పోలీసులు వారిని విచారించారు. కానీ వారు ఆరు నెలలుగా ఇటువైపు వచ్చిన దాఖలాలు కూడా లేవు. చివరికి చుట్టుపక్క గ్రామాలు, సీసీ ఫుటేజీలు, సెల్‌ టవర్‌ లొకేషన్‌ ద్వారా అనుమానాస్పద కదలికలు పరిశీలించినా చిన్న క్లూ కూడా లభించలేదు.

ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలకు కబురు

చిన్నారి జాడ మిస్టరీగా మారడంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సైతం రప్పిస్తున్నారు. అలాగే, పోలవరం జిల్లా దేవీపట్నంలో పులి సంచారం నేపథ్యంలో దాన్ని పట్టుకునేందుకు వన్యప్రాణి విభాగ నిపుణులు వచ్చారు. వీరిని కూడా ఆదివారం ఇక్కడ మోహరించి వీరి వద్దనున్న అధునాతన పరికరాల సాయంతో పాప జాడను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పాప జాడ గుర్తించే వరకు ఎన్నిరోజులైనా జల్లెడ పడతామని ఎస్పీ బిందుమాధవ్‌ వివరించారు.

Updated Date - Jun 14 , 2026 | 04:55 AM