అధికమాసం.. నవరాత్రి బ్రహ్మోత్సవాలివి...
ABN , Publish Date - Oct 11 , 2026 | 10:19 AM
శ్రీవేంకటేశ్వరస్వామికి ఏడాది పొడవునా నిర్వహించే ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాలు అత్యంత ముఖ్య మైనవి.
శ్రీవేంకటేశ్వరస్వామికి ఏడాది పొడవునా నిర్వహించే ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాలు అత్యంత ముఖ్య మైనవి. ప్రతీ ఏడాది ఓమారు మాత్రమే తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్స వాలు జరుగుతాయి. అయితే అధికమాసం కారణంగా ఈ ఏడాది రెండు బ్రహ్మోత్స వాలు వచ్చాయి. పురాణాల ప్రకారం శ్రీవారు వేంకటాద్రిపై కొలువైన తొలిరోజుల్లోనే బ్రహ్మ దేవుడిని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు చేయిం చారట. దీనికి అనుగుణంగా స్వామి ఆజ్ఞ మేరకు శ్రీవేంకటేశ్వ రస్వామి ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యా మాసం (అశ్వయజం)లోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.
అందువల్లే ఇవి ‘బ్రహ్మోత్సవాలు’గా ప్రసిద్ధి చెంది ఆనాటి నుంచి నేటి వరకు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. చాంద్రమాన ప్రకారం ప్రతీ మూడో ఏటా అధికమాసం వస్తుంటుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం (భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్స వాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈరెండు బ్రహ్మోత్సవాల్లో పెద్ద తేడా ఏమీ లేదు. కానీ నవరాత్రి బ్రహ్మోత్స వాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు.
విష్వక్సేనుల విశిష్టత:
విష్వక్సేనులవారు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సర్వసైన్యాధ్యక్షుడు. స్వామివారికి జరిగే ప్రధాన ఉత్సవాల ముందు రోజున ఈయన మాడవీధులలో ఉత్సవ ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు. విష్వక్సేనులు ముఖ్యంగా బ్రహ్మోత్సవం, జ్యేష్టాభిషేకం, పుష్పయాగం, వసంతోత్సవాలు, పవిత్రోత్సవాలకు ఊరేగి పర్యవేక్షించి ఆనవాయితీ. అలాగే ఆణివార, ఉగాది, దీపావళి, శ్రీరామ నవమి, శ్రీకృష్ణాష్టమి ఆస్థాన పర్వదినాలలో విష్వక్సేనులు ప్రధాన పాత్రవహిస్తారు. స్వామివారితో పాటు ఆయనకు ఆలయంలో మందిరం ఉంది. ఇది శ్రీవారి సన్నిధి దక్షిణవైపున ఉంది. ఈయన 11న రాత్రి 7-9గంటల మధ్య ఊరేగుతారు.
అంకురార్పణం:
శాస్త్రాల ప్రకారం అంకురార్పణాన్ని పగటి వేళలో నిర్వహించరు. ఖగోళశాస్త్రంలోని సిద్ధాంతాల ప్రకారమే నిర్వహిస్తారు. మొక్కలకు ఆధిదేవత చంద్రుడు కాబట్టి రాత్రి సమయంలోనే విత్తనం నాటుతారు. ఆగమాల ప్రకారం విత్తనం బాగా మొలకెత్తడాన్ని ఉత్సవం విజయవంతానికి సూచికగా భావిస్తారు. పాలికలు అనే పాత్రలను విత్తనాలను నాటేందుకు వినియోగిస్తారు. బహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శాంత, ఇంద్ర, ఇసాన, జయ తదితర దేవతలను ఆహ్వానించి అగ్ని ద్వారా పూజలు చేస్తారు. ఆ తరువాత సోమంరాజ మంత్రాన్ని, విష్ణు స్ర్తోతాన్ని పటిస్తారు. విత్తనాలు నాటే సమయంలో వరుణ మంత్రాన్ని పఠించి నీళ్ళు చల్లుతారు.
పెద్దశేష వాహనం: (12న తొలిరోజు రాత్రి 7-9 గంటల మధ్య)
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మొదటి వాహనం పెద్దశేషవాహనం. విశేష జ్ఞాన బలములు కలవాడు, తన ఫణామణి పంక్తులచేత దివ్యవైకుంఠ విమానాన్ని ప్రకాశింప చేసేవాడే శేషుడు. స్వామివారికి నివాసభూమిగా, సింహాసనంగా, పాదుకలుగా, వస్త్రంగా, ఆనుకునే దిడుగా, ఛత్రంగా ఆయా సమయాలలో కామరూపియైు సేవలందిస్తున్న దాసుడుగా ఉంటారని కీర్తించారు. శేషవాహనంముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, అందుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. ఆ సందేశాన్ని మనకు అందించడానికే శేషాద్రినాథుడు శేషవాహనంపై తిరుమాడవీధులలో విహరిస్తారు.
చిన్నశేష వాహనం: (13న ఉదయం 8-10 గంటల మధ్య)
నవరాత్రి బ్రహ్మోత్సవాలలో రెండోరోజు ఉదయం స్వామివారు ఐదు తలల చిన్నశేషవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. మనిషి శరీర నిర్మాణంలో మూలాధారం నుండి సహస్రారకర్ణిక వరకు ఏడు చక్రాలుంటాయి. వాటిని మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనా హత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రారములని పేర్కొంటారు. మూలాధారం నుండి సహస్రారం వరకు బ్రహ్మదండి మధ్య నుండి (వెన్నెముక మధ్య నుండి) కుండలినీ శక్తి అనే సుఘమ్నానాడి సర్పాకారంలో ఉంటుంది. మనోవృత్తులు ప్రపంచాభిముఖంగా ప్రసరించే సామాన్య మానవునిలో సర్పాకారంగావ్యాపించి ఉండే కుండలినీశక్తి శిరస్సు మూలాధారంగా ఉంటుంది. శేషవాహనంపై శ్రీవారిని దర్శించి, ధ్యానించే పురుషులకు మనోవృత్తులు శ్రీనివాసుని అధీ నమై, అభిముఖమవుతాయి. అటువంటి వ్యక్తిలోని కుండలినీ సర్పరూపపు శిరస్సు సహస్రారంలోను, పుచ్ఛం మూలాధారంలోనూ నిలుస్తాయి. చిన్నశేష వాహనాన్ని సందర్శించిన భక్తులకు కుండిలినీ యోగసిద్ధి ఫలం లభిస్తుంది.
హంస వాహనం: (13న రాత్రి 7-9 గంటల మధ్య)
నవరాత్రి బ్రహ్మోత్సవాలలో రెండో రోజు రాత్రి మలయప్పస్వామి వీణాపాణియైు సరస్వతీ మూర్తిగా దర్శనమిస్తారు. బ్రహ్మవాహనమైన హంస ప్రసిద్ధం. పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను హంస అని, పరమహంస అని కూడా వ్యవహరిస్తారు. శ్రీమన్నారాయణుడు హంస శబ్ద వాచ్చుడైన సూర్యునిలో నివసిస్తున్నాడు. అందుకే మనం శ్రీమన్నారాయణునికి ప్రతీకైన సూర్యభగవానుని ఆరాధిస్తున్నాం. హంసకు ఒక విశిష్టగుణముంది. పాలు నీరును కలిపి ముందు పెడితే పాలను స్వీకరించి నీరును వదిలివేయగల శక్తి కలిగి ఉంది. వివేకం కలవాడు అనాత్మ అయిన స్థూల సూక్ష్మాది దేహాలు వదలి ఆత్మను పరిగ్రహిస్తాడు. ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. సోహం భావం కలిగిన భక్తులలో అహంభావం తొలగించి దాసోహం అనే భావాన్ని కలిగించడానికే శ్రీనివాసుడు హంసవాహనారూఢుడై తిరువీఽధులలో విహరిస్తారు.
సింహవాహనం: (14న ఉదయం 8-10 గంటల మధ్య)
బ్రహ్మోత్సవాలలో మూడోరోజు ఉదయాన మలయప్ప యోగనరసింహ స్వామిరూపంలో సింహ వాహనంపై ఊరేగుతారు. వనరాజు, మృగాలలో రారాజు సింహం. గాంభీర్యానికి, దక్షతకు ప్రతీక సింహం. అందువల్ల సృష్టిలో సింహానికి ఇతర ప్రాణులకు లేని విశిష్టత ఉంది. మహావిష్ణువు అవతారాలలో నాల్గోవది నృరసింహ అవతారం. ధర్మరక్షణకై స్వామి నృసింహాస్వరూపంలో సింహాన్ని అధిష్టించి రావడం విశేషం. అందులో దుష్టజన శిక్షణ, శిష్టజన రక్షణలో భాగంగా దుర్మార్గుడైన హిరన్యకశివుని వధించి, ప్రహ్లాదుని రక్షించడమే ఇందుకు సంకేతం. ఈ వృత్తాంతాన్ని భక్తులకు కనులకు కట్టినట్లుగా చూపించేందుకై సింహ వాహన ఉత్సవం నిర్వహిస్తారు.
ముత్యపుపందిరి వాహనం: (14న రాత్రి 7-9గంటల మధ్య)
మూడోరోజు రాత్రి ఏడుకొండలస్వామి ముత్యపుపందిరిపై వాహనంతో ప్రత్యక్షమవుతారు. ముత్యాలు విలువైనవి, చల్లదనాన్ని ప్రసాదించి తెల్లని కాంతులు వెదజల్లుతాయి. సముద్రం మనకు ప్రసాదించిన మేలి వస్తువులలో ముత్యం ఒకటి. శ్రీకృష్ణుడు ముక్కుపైన, మెడలో మత్యాలను ఆభరణాలుగా ధరించినట్లు శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. ఇంతటి ప్రాశస్తమైన ముత్యాలను పంది రిగా మలుచుకున్న వాహనంలో స్వామివారు మురుపు గొల్పుతూ, ముచ్చటగా ఊరేగుతారు. ప్రజల నుండి వసూలు చేసిన పన్నులు, సుంకాలు, ఇతర బహుమతుల్ని భద్రపరచిన ప్రభువు కరువుకాటకాల క్లిష్టపరిస్థితులలో ప్రజలను ఆదుకుంటారని చెప్పడం ఈ వాహనం పరమార్థం.
కల్పవృక్ష వాహనం: (15న ఉదయం 8-10 గంటల మధ్య)
నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనం విశేషముంది. కల్పవృక్షం, కామధేనువు, చింతామణి మొదలైనవి కోరిన కోరికలను ప్రసాదిస్తాయని నమ్మకం. అమృతాన్ని ఆపేక్షించి సురులు, అసురులు క్షీరసాగరమథనం చేశారు. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకుని మథనం చేయగా ఆ సమయంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో ఈ కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరినవారికి ఆకలిదప్పులుండవు. అంతేకాదు పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. తనను శరణజోచ్చిన భక్తులకు కోరికలను స్వామి నెరవేరుస్తారని చెప్పడానికే కల్పవృక్ష వాహనంపై ఊరేగుతారు.
సర్వభూపాల వాహనం: (15న రాత్రి 7-9 గంటల మధ్య)
నాలుగో రోజు రాత్రి ఏడడుగుల ఎత్తు, పూర్తిగా బంగారురేకులతో నిర్మించిన వాహనం సర్వభూపాలవాహనంలో వివరిస్తారు స్వామివారు. దేవచోడవంశానికి చెందిన మట్లకుమార అనంతరాయలు ఇచ్చిన వాహనాలలో ఇదోకటి. సర్వభూపాలురు అంటే అందరు రాజులని అర్థం. విష్ణ్వంశలేని వారు రాజుకాలేడు. అందుచేత రాజులందరూ అంతో ఇంతో భగవదంశ కలవారే. వారు అంశులైతే. స్వామి అంశి. ఇక్కడ రాజులకు రాజాధిరాజుకు అంశ అంశి భావం కుదిరింది. అందుకే సర్వభూపాల స్థానంలో భగవంతుడు ఊరేగుతారు. ఈ భూపాలకులలో అష్టదిక్పాల కులు కూడా చేరుతారు. వీరందరు స్వామిని సుప్రభాతవేళ సేవిస్తారు. భూపాలకులందరు అధికార సంపన్నులే. ఆ అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే భగవత్సేవాపరులే ఉండాలి. అందువల్ల రాజులారా మీ భుజస్కంధాలపైనా, త్రికరణాల లోనూ స్వామిని వహించండి. తద్వారా మీరు ధన్యులు కావచ్చు. మీ పాలనలో ప్రజలను కూడా ధన్యులను చేయవచ్చు అనే దివ్యమైన, భవ్యమైన సందేశం ఈ సర్వభూపాల వాహనసేవ నుంచిగ్రహించవచ్చు.
మోహనీ అవతారం విశిష్టత: (16న ఉదయం 8-10 గంటల మధ్య)
ఐదో రోజు ఉదయం మలయప్ప స్వామి మోహనీ రూపంలో దంతాలపల్లకీలో తిరువీధులలో ఊరేగుతారు. తోడుగ శ్రీకృష్ణస్వామి మరొక పల్లకీలో ప్రదక్షిణ చేస్తారు. ఉత్సవమూర్తి మామూలుగా నిలబడే భంగిమలో కాకుండా ఆసీనులైన భంగిమలో కనిపించడం దీని ప్రత్యేకత. స్త్రీలు ధరించే అన్ని ఆభరణాలతో స్వామివారికి అలంకరిస్తారు. పట్టుచీర, కిరీటంపైన రత్న ఖచితమైన సూర్యచంద్రసావేరి, నాసికకు వజ్రఖచితమైన ముక్కుపుడక, శంఖచక్రాల స్థానంలో రెండు వికసించిన స్వర్ణకమలాలను అలంకరిస్తారు. దేవతలు, రాక్షసులు క్షీరసాగరం మథనంలో శిష్టుల్ని రక్షించడానికి అతిలోక మోహనమైన కన్యరూపం ధరించి దేవతలకు అమృతప్రదానం చేసిన జగన్మోహరూపమే మోహినీ అవతారం.
గరుడవాహనం: (16న రాత్రి 6.30-11.30 గంటల మధ్య)
ఐదో రోజు రాత్రి మలయప్పస్వామి ఊరేగే వాహనం గరుడ వాహనం. మూలవిరాట్టుకున్న మకరకంఠి, సహస్రనామ హారం, లక్ష్మిహారం మొదలైనవాటిని ఉత్సవమూర్తులకు అలంకరించడం ఈ వాహనంలో ప్రత్యేకత. గరుత్మంతుడు నిత్యసూరి, స్వామికి దాసుడు, సఖుడు, వాహనం, పతాకచిహ్నం, గరుత్మంతునికి తెలియని స్వామిరహస్యాల్లేవు. గరుడుని పెరియతిరువడి అనడం వైష్ణవసంప్రదాయం. గరుడసేవలో స్వామివారిని దర్శిస్తే సమస్త పాపాలు హరిస్తాయంటారు. అందుకే ఏ ఉత్సవాన్ని రాని భక్తజనం ఈ సేవకు హాజరవుతారు.
హనుమత వాహనం: (17న ఉదయం 8-10 గంటల మధ్య)
ఆరో రోజు ఉదయం స్వామివారు దాస భక్తుడైన హనుమద్వాహనంలో వరదహస్తం దాల్చిన వెంకటాద్రిరాముడిగా ఊరేగుతారు. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం,వక్తృత్వాలు హనుమంతుని స్మరిస్తే పుష్కలంగా లభిస్తాయి. హనుమంతుడు భగవ ద్భక్తులలో అగ్రగణ్యుడు. శ్రీవైష్ణవ సంప్రదాయంలో గరుడసేవనుపెరియ తిరువడి, హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తించారు.గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన కావించిన మహనీ యులు కనుక తన భక్తితత్పరతను చాటిన హనుమంతుడి ద్వారా భక్తులు స్ఫూర్తి పొందడానికి వీలుగా మారుతిపై స్వామి ఊరేగుతారు.
పుష్పకవిమానం: (17న సాయంత్రం 4 గంటలకు)
పుష్పకవిమానం సేవను మూడేళ్లకు ఒకసారి వచ్చే అధికమాసం సందర్భంగా నిర్వహించే నవరాత్రి బహ్మోత్సవాల్లో మాత్రమే నిర్వహిస్తారు. వాహనసేవల్లో అలసిపోయే స్వామి, అమ్మవార్లు సేదతీరడానికి పుష్పక విమానంలో వేంచేపు చేస్తారు. దాదాపు టన్ను బరువుతో పుష్పక విమానాన్ని తయారు చేసి అందులో స్వామి అమ్మవార్లను ఊరేగిస్తారు.
గజవాహనం: (17న రాత్రి 7-9 గంటల మధ్య)
ఆరో రోజు రాత్రి స్వామివారిని రాజులను పట్టాభిషేకం చేసే సమయంలో గజాధిష్టితులను చేసే విధంగా అలంకరించి ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహణం కావించే ప్రక్రియ నేటికీ కొనసాగుతోంది. ఇదే రోజున టీటీడీ సంరక్షణలో ఉన్న అనేక గజరాజులు పాలు పంచుకొంటాయి. స్వామివారి ప్రతి వాహనసేవలో బ్రహ్మరథం వెనుక అశ్వాలు, వృషభాలతో ఠీవిగా ఈ గజాలు కూడా నడిచివస్తాయి. పురాణాలలో గజేంద్రమోక్షం కథ ప్రసిద్ధమైంది. ఈ వాహనసేవలో గజేంద్రుడు శ్రీహరిని వహించినట్లు భక్తులు కూడా శ్రీనివాసుని హృదయపీఠికపై వహించి, శరణాగతి చెందాలన్న దివ్యసందేశమిస్తుంది.
సూర్యప్రభ వాహనం: (18న ఉదయం 8-10 గంటల మధ్య)
సూర్యుడు కర్మసాక్షి. చరాచరప్రపంచానికి వెలుగును ప్రసాదించే ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర్వుడు. సూర్యమండల మధ్యస్థుడని శంఖచక్ర గదాయుధఽధారి అనే అర్థంలో సూర్యప్రభ వాహనం జరుపుతారు. సూర్యున్ని కూడా శాసించేవాణ్ణి నేనే అని సూర్యప్రభ వాహనం ప్రతీక. సూర్యుడు తేజోనిధి, సకలరోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత, వర్షాలు, వాటివల్ల పెరిగే సస్యాలు, పెరిగే ఔషదాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యుడు సప్తరశ్మి, శైలవాసి, సప్తాశ్వరథారూఢుడై నిత్యం విహరిస్తూ తన తేజస్సుతో లోకానికి చైతన్యం కలిగిస్తున్నారు. అట్టి సూర్యప్రభను అధిష్టించిన శ్రీనివాసుడుని దర్శించిన యాత్రికులకు పూర్ణఫలాన్ని ప్రసాదిస్తుంది.
చంద్రప్రభ వాహనం: (18న రాత్రి 7-9 గంటల మధ్య)
బ్రహ్మోత్సవాల ఏడో రోజు రాత్రి స్వామివారు చంద్రప్రభపై ఊరేగుతారు. చంద్రున్ని కూడా శాసించేమూర్తి తానే అని చెప్పడం చంద్రప్రభ వాహనం మరో విశేషార్థం. చంద్రుడు భగవంతుని మారురూపమే. తాను చుక్కల్లో చంద్రుడని, రసస్వరూపుడైన చంద్రుడై భగవానుడు ఔషధులను పోషిస్త్తున్నారని అర్థం. ఈ సందర్శనం ఆధ్మాత్మిక, అధిభౌతిక, ఆధిదైవికమనే త్రివిధ తాపాలను నివారిస్తుంది.
స్వర్ణరథం: (19న ఉదయం 7-9 గంటల మధ్య)
ఎనిమిదో రోజు ఉదయం స్వర్ణరథంలో స్వామి, అమ్మవార్లు విహరిస్తారు. స్వర్ణరథోత్సవం ఒక విశిష్టమైన ఉత్సవం. స్వర్ణరథం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. భగవంతుడు శైబ్య, సుగ్రీవ, మేఘ పుష్ప, వలాహక అనే నాలుగు గుర్రాలు పూన్చిన రథమెక్కి విహరిస్తారు. దారుకుడు ఆయన సారఽథి. ఈ రథం మీద పయనిస్తున్న కృష్ణస్వామిని దర్శించిన కాంతలు ఆ భగవద్వైభవాన్ని ఘనంగా వర్ణిస్తుంది. ఈ విధంగా వేంకటాద్రి కృష్ణుని రథయాత్ర నూతన స్వర్ణ కాంతులీనుతూ ముందుకు సాగుతుంది. నాటి రథగమనాన్ని వీక్షించిన ద్వారకా ప్రజలకు కలిగిన ఆనందమే నేటి స్వర్ణరథస్థుడైన కేశవుని చూచిన భక్తులకు కూడా సిద్ధిస్తుందనుటలో సందేహం లేదు.
అశ్వవాహనం: (19న రాత్రి 7-9 గంటల మధ్య)
నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ఎనిమిదోరోజు రాత్రి అశ్వవాహనంపై స్వామివారు ఊరేగుతారు. అదుపు, ఆజ్ఞలేని గుర్రాల లాంటి పాపుల్ని, జీవుల్ని అందులో పెట్టగలనని నిరూపించడానికే అశ్వవాహనం. జంతువులలో మిక్కిలి వేగం గల జంతువు అశ్వం. అనాదిగా మానవుడు అశ్వాలను వాహనాలుగా వినియోగించాడు. ఆధునికవాహన సౌకర్యాలకు ముందు అశ్వాలే ముఖ్యమైన వాహనం. అంతేకాకుండా రథగమనానికి కూడా అశ్వాలనే ఉపయోగించేవారు. భగవానుని అవతారాలు పది ప్రసిద్ధమైనవి. చివరి అవతారం కల్కి. కలియుగాం తంలో కల్కి రూపం ధరించి కత్తి చేతబూని అశ్వ వాహనంపై స్వామి దుష్టజన సంహారం చేస్తాడని పురాణోక్తి. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తాయి. కావున అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. స్వామి అశ్వవాహనాధిరూఢుడై భక్తులకు దర్శనమిస్తారు.
చక్రస్నానం: (20న ఉదయం 6-9 గంటల మధ్య)
నవరాత్రి బ్రహ్మోత్సవాలలో చివరిదైన ఉత్సవం చక్రస్నానం. యజ్ఞాంతంలో ఆచరించబడే అవభృథస్నానమే. యజ్ఞం చివర అవభృథస్నానం చేయడం సంప్రదాయం. తొమ్మిది రోజులు ఒక యజ్ఞంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడంతో లక్షలాదిగా జనం పాల్గొనే యజ్ఞం. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకుంటారో వారందరు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సంవృద్ధితో తులతూగుతారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
సుప్రీంకోర్టు సీరియస్‌గా ఉంటేనే!
Read Latest AP News And Telangana News And International News And Telugu News