బంగారం వ్యాపారి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు
ABN , Publish Date - Oct 16 , 2026 | 11:21 AM
వారం రోజుల క్రితం చిక్కడపల్లిలో కిడ్నాప్‌నకు గురైన బంగారం వ్యాపారి శ్రీనివాసరావు కిడ్నాప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.
సుపారీ ఇచ్చింది ఒకరు..
కిడ్నాప్ చేసింది మరొకరు..
నేడో రేపో మీడియాకు వెల్లడించే అవకాశం
హైదరాబాద్ సిటీ: వారం రోజుల క్రితం చిక్కడపల్లిలో కిడ్నాప్‌నకు గురైన బంగారం వ్యాపారి శ్రీనివాసరావు కిడ్నాప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కిడ్నాప్ ముఠాలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసినట్లు సమాచారం.
లావాదేవీల్లో భాగస్వామితో వివాదాలు
చిక్కడపల్లిలో నివాసం ఉంటూ రామంతాపూర్‌లో బంగారం వ్యాపారం నిర్వహిస్తున్న శ్రీనివాసరావుకు శ్రీకాంత్ అనే వ్యక్తి వ్యాపార భాగస్వామిగా ఉన్నట్లు సమాచారం. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఇద్దరి మధ్య వివాదాలు, మనస్పర్థలు వచ్చాయి. ఈ కారణంతో శ్రీనివాసరావును కిడ్నాప్ చేసి వివాదాన్ని క్లియర్ చేసుకోవాలని శ్రీకాంత్ భావించాడు. సురేష్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చాడు. డబ్బును సుపారీ ముఠాకు ముందే ఇచ్చినట్లు తెలిసింది. శ్రీకాంత్ ఇచ్చిన సుపారీని స్వీకరించిన సురేష్ ముఠా.. శ్రీనివాసరావును కిడ్నాప్ చేసి అతడికి అప్పగించకుండా తమ వెంట తీసుకెళ్లారు. శ్రీకాంత్‌కు ఇచ్చిన మాటను తుంగలో తొక్కి.. వారే నిజమైన కిడ్నాపర్లుగా చెప్పుకున్నారు. వ్యాపారి శ్రీనివాసరావును బంధించి అతని కటుంబసభ్యులను బ్లాక్ మెయిల్ చేసి రూ.కోటిన్నర కొట్టేయాలని కొత్త పథకం వేశారు.
రూ.కోటి ఇచ్చి విడిపించుకున్న కుటుంబం
సురేష్ ముఠా బ్లాక్‌మెయిల్‌కు భయపడిన శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు కోటి రూపాయలు ఇచ్చి అతడిని విడిపించుకున్నారు. అనంతరం శ్రీకాంత్‌కు సురేష్ ఫోన్ చేసి కిడ్నాప్ ప్లాన్ ఫ్లాప్ అయిందని, శ్రీనివాసరావు తమ నుంచి తప్పించుకున్నాడని కట్టుకథ చెప్పారు. అప్పటికే కిడ్నాప్ ముఠా కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ ఫుటేజీల ఆధారంగా గాలిస్తున్నారు. కిడ్నాప్ నకు పథకం వేసిన శ్రీకాంత్‌తోపాటు సుపారీ తీసుకున్న ముఠా నాయకుడు సురే్‌షను, మరో 8 మందిని అదుపులోకి తీసుకొని, శ్రీనివాసరావు కుటుంబం వద్ద కొట్టేసిన రూ.కోటి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నేడో, రేపో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కిడ్నాప్ క్రైమ్ కథా చిత్రాన్ని ఉన్నతాధికారులు వెల్లడించే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
సగం మంది వెన్నునొప్పి బాధితులే..!
బార్ల లక్కీ డ్రాకు ఏర్పాట్లు పూర్తి
Read Latest AP News And Telangana News And International News And Telugu News