పెట్టుబడుల పేరుతో రూ.5.6 కోట్ల మోసం
ABN , Publish Date - Apr 17 , 2026 | 06:57 AM
ఆన్‌లైన్ డిజిటల్ ఫారెక్స్, షేర్లలో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్‌లో జరిగిన ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లోని ‘ఎం ట్రేడ్ డిజిటల్’ సంస్థపై కేసు నమోదు
హైదరాబాద్ సిటీ: ఆన్‌లైన్ డిజిటల్ ఫారెక్స్, షేర్లలో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్‌లో జరిగిన ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ భారీ లాభాల ఆశ చూపి బాధితుల నుంచి రూ. కోట్లలో వసూలు చేసి పరారయ్యింది. నగరంలో నివాసం ఉంటున్న చిత్తూరు జిల్లాకు చెందిన లావణ్య కొనిదెల అనే మహిళ ‘ఎం ట్రేడ్ డిజిటల్’ సంస్థ యజమానిగా తనను తాను పరిచయం చేసుకుంది. తమ కంపెనీ ద్వారా ఆన్‌లైన్ ఫారెక్స్, షేర్లలో పెట్టుబడులు పెడితే నెలకు 5 శాతం లాభంతో పాటు, అదనంగా 3 శాతం మూలధన లాభం కల్పిస్తామని హామీ ఇచ్చింది.
నిర్ణీత కాలం తర్వాత మొత్తం తమ పెట్టుబడిని తిరిగి ఇస్తామని నమ్మించింది. ఆమె మాటలు నమ్మిన 34మంది బాధితులు మొదట కొద్ది మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. భారీగా లాభాలు చూపడంతో 2024 ఫిబ్రవరి నుంచి సుమారు రూ.5.6 కోట్ల మేర ఆమె కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత వారు సదరు మహిళను కలిసేందుకు ప్రయత్నించగా.. తప్పించుకు తిరుగుతోంది. దీంతో బాధితుల్లో ఒకరైన మాదాపూర్‌కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
తాను ఒక్కడినే మొత్తం రూ.67 లక్షలు లావణ్య కొనిదెల కంపెనీలో పెట్టుబడిగా పెట్టినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత మరికొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. లావణ్య కొనిదెల ‘ఎం ట్రేడ్’ డిజిటల్ ఫారెక్స్ ట్రేడింగ్, ఫండ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, క్రిప్టో 101 క్రోర్స్ క్లబ్ పేర్లతో వాట్సాప్ గ్రూపులు సృష్టించి, నకిలీ లాభాల వివరాలు చూపుతూ మరింత మంది పెట్టుబడిదారులను ఆకర్షించినట్లు బాధితులు ఆరోపించారు. ఈ మేరకు సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గోల్డ్ రేట్స్.. కొనసాగుతున్న ధరలు పెరుగుదల
ఆర్ అండ్ బీలో ఎక్స్‌టెన్షన్లు ఇవ్వొద్దు
Read Latest Telangana News and National News