Share News

బీసీల జనాభాకు తగ్గ ప్రాతినిధ్యమేది?

ABN , Publish Date - Apr 17 , 2026 | 04:47 AM

జిత్నీ ఆబాదీ, ఉత్నీ భాగీదారీ’ (జనాభాకు తగ్గట్టే ప్రాతినిధ్యం కూడా)... ఇటీవల కాలంలో ప్రధానంగా బీసీలకు సంబంధించి ప్రచారంలోకి వచ్చిన నినాదమిది! దీన్ని తెలంగాణ రాష్ట్రం విషయంలో తీసుకుంటే....

బీసీల జనాభాకు తగ్గ ప్రాతినిధ్యమేది?

  • రాష్ట్రంలో 46.25 శాతం బీసీలు

  • శాసనసభలో ప్రాతినిధ్యం మాత్రం 16.8 శాతమే

  • 2023లో ఎన్నికైన ఎమ్మెల్యేల్లో బీసీలు 20 మందే

  • వీరిలో సగానికిపైగా 4 కులాలకు చెందిన వారే

  • 17 మంది ఎంపీల్లో కేవలం నలుగురే బీసీలు

  • 40 మంది ఎమ్మెల్సీల్లో బీసీలు 9 మంది మాత్రమే

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): ‘జిత్నీ ఆబాదీ, ఉత్నీ భాగీదారీ’ (జనాభాకు తగ్గట్టే ప్రాతినిధ్యం కూడా)... ఇటీవల కాలంలో ప్రధానంగా బీసీలకు సంబంధించి ప్రచారంలోకి వచ్చిన నినాదమిది! దీన్ని తెలంగాణ రాష్ట్రం విషయంలో తీసుకుంటే ’ఉత్నీ భాగీదారీ నహీ హై’ (అంతగా ప్రాతినిధ్యం లేదు) అని చెప్పాల్సి ఉంటుంది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘సమగ్ర కులసర్వే నివేదిక’లో రాష్ట్రంలో బీసీ జనాభా 46.25 శాతంగా తేల్చిన సంగతి తెలిసిందే. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గానూ వివిధ పార్టీల నుంచి శాసనసభకు ఎన్నికైన బీసీలు 20 మంది మాత్రమే. అంటే.. రాష్ట్ర శాసనసభలో బీసీల ప్రాతినిధ్యం 16.80 శాతంగానే ఉంది. అంటే బీసీల జనాభాలో సగానికన్నా తక్కువే అన్నట్టు! ఈ 20 మంది బీసీ ఎమ్మెల్యేల్లో కూడా అత్యధికంగా గౌడ సమాజిక వర్గం నుంచి నలుగురు ఉన్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ముగ్గురు, యాదవ, పద్మశాలి సామాజిక వర్గాల నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. ఆ రకంగా ఈ నాలుగు సామాజిక వర్గాల నుంచే 11 మంది.. అంటే సగానికి పైగా ఉన్నారు. మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో ముదిరాజ్‌, రజక, బొందిలి, ఆర్య క్షత్రీయ, వంజరి, గంగపుత్ర, పెరిక, లోథి, కురుమ సామాజిక వర్గాల నుంచి ఒకరు చొప్పున ఉన్నారు. ఇక రాష్ట్రం నుంచి ఉన్న 17 మంది ఎంపీల్లో బీసీ వర్గానికి చెందిన వారు నలుగురే ఉన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాగా ముదిరాజ్‌ సామాజికవర్గం నుంచి ఎంపీలు ఈటల రాజేందర్‌, లింగాయత్‌ సామాజిక వర్గం నుంచి ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ ఉన్నారు. శాసనమండలిలోని 40 మంది సభ్యుల్లో తొమ్మిది మంది బీసీలున్నారు. వీరిలో నలుగురు మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. మిగిలిన ఐదుగురు పద్మశాలి, రజక, ముదిరాజ్‌, గౌడ, విశ్వకర్మ సామాజిక వర్గాల నుంచి ఉన్నారు.


బీసీ జనాభాలో ‘ముదిరాజ్‌’ టాప్‌.. ప్రాతినిధ్యం అంతంతే!

రాష్ట్ర జనాభాతో లెక్కగడితే బీసీ కులాల్లోని పన్నెండింటిలో ఒక్కో శాతంపైగా ఉన్నారు. ఈ 12 కులాల జనాభా మొత్తంగా 26.39 లక్షలుగా ఉంది. రాష్ట్ర జనాభాలో 7.4 శాతం వాటాతో ముదిరాజ్‌ సామాజిక వర్గం అగ్రస్థానంలో ఉంది. ఈ సామాజిక వర్గం నుంచి శాసనసభ, లోక్‌సభ, శాసనమండలిలో ఒకరు చొప్పున మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మక్తల్‌ నుంచి గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని.. సీఎం రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గౌడ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్‌ను, పద్మశాలి సామాజిక వర్గం నుంచి కొండా సురేఖను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రాష్ట్ర జనాభాలో ముదిరాజ్‌, గౌడ, యాదవ, మున్నూరుకాపు, పద్మశాలీలు 24.9శాతంగా ఉన్నారు. అంటే బీసీల్లో ఈ ఐదు సామాజికవర్గాల జనాభే ఎక్కువ. ఆ మేరకు పదవుల్లోనూ ఆ ఐదు సామాజిక వర్గ నేతలకే ప్రాధాన్యం దక్కుతోంది.

బీసీ సబ్‌ కోటా లేకుండా మహిళా రిజర్వేషన్లు వద్దు: దాసు సురేశ్‌

దేశ రాజకీయాల్లో వెనుకబడిన వర్గాల ప్రతినిధిగా ఎదిగానని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ.. అదే వర్గానికి చెందిన ఆడబిడ్డల హక్కులను ఎందుకు విస్మరిస్తున్నారని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్‌ ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో దొడ్డిదారిలో ఉన్నత వర్గాల మహిళలకు మాత్రమే అవకాశాలు కల్పించే కుట్ర జరుగుతోందని గురువారం ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ మహిళలకు ప్రత్యేక సబ్‌ కోటా లేకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే బీసీ సమాజానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. దీనిపై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 17 , 2026 | 05:53 AM