Share News

నాలుగేళ్ల చిన్నారితో యాసిడ్‌ తాగించిన పిన్ని

ABN , Publish Date - Apr 17 , 2026 | 04:37 AM

ఉమ్మడి కుటుంబంలో తన కుమారుడికి తగిన గుర్తింపు లభించడం లేదనే భావనతో ఓ మహిళ తన తోటి కోడలి కుమారుడిపై హత్యాయత్నం చేసింది.

నాలుగేళ్ల చిన్నారితో యాసిడ్‌ తాగించిన పిన్ని

  • తోటి కోడలి కుమారుడిపై కర్కశం

  • గతంలోనూ పలుమార్లు హత్యాయత్నం

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కుటుంబంలో తన కుమారుడికి తగిన గుర్తింపు లభించడం లేదనే భావనతో ఓ మహిళ తన తోటి కోడలి కుమారుడిపై హత్యాయత్నం చేసింది. అభంశుభం తెలియని నాలుగేళ్ల పిల్లాడితో యాసిడ్‌ తాగించి రాక్షసత్వం ప్రదర్శించింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని బోడుప్పల్‌ శ్రీనివాసకాలనీలో నివాసముంటున్న పర్వతం సతీష్ కుమార్‌-అంజమ్మ దంపతులకు నాగరాజు, జగదీష్‌ అనే కుమారులున్నారు. వారిద్దరికీ పెళ్లిళ్లు అవ్వగా పిల్లలు కూడా ఉన్నారు. సతీష్‌ కుమార్‌ దంపతులు, నాగరాజు దంపతులు, జగదీష్‌ దంపతులు ఉమ్మడి కుటుంబంగా ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. పెద్ద కుమారుడి కొడుకు (4)పై తాత సతీష్ కుమార్‌కు ఎనలేని ప్రేమ. అయితే, ఆ ఇంటి చిన్నకోడలు మంజుల ఈ విషయాన్ని సహించలేకపోయింది. మామగారు తన కుమారుడిని పట్టించుకోవడం లేదని, పెద్ద మనుమడినే చూసుకుంటున్నాడని కక్ష పెంచుకుంది. ఈ క్రమంలో సతీష్‌ కుమార్‌ తన పెద్ద మనుమడి పేరును చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. దీంతో మరింత రగిలిపోయిన మంజుల.. ఆ చిన్నారిని కడతేర్చాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఇటీవల ఇంట్లో ఉన్న చిన్నారి ముక్కు, నోరు మూసి చేతులు గట్టిగా పట్టుకుని ఊపిరాడకుండా చేసి హత్యకు ప్రయత్నించింది. గమనించిన బాలుడి తల్లి వెంటనే మంజులను ప్రశ్నించగా.. ఇద్దరం ఆడుకుంటున్నామని చెప్పి తప్పించుకుంది. ఆ తర్వాత మరో రోజు బాలుడిని ఇంటి పైఅంతస్తుకు తీసుకెళ్లి రెయిలింగ్‌పై కూర్చోబెట్టింది. గమనించిన సతీష్‌ కుమార్‌.. కోడలు మంజులను మందలించాడు. కాగా, ఈనెల 9న మంజుల ఆ చిన్నారిని ఇంట్లోని వంటగదిలోకి తీసుకెళ్లి జ్యూస్‌ తాగితే చాక్లెట్‌ ఇస్తానని చెప్పి యాసిడ్‌ తాగించింది. దాంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కాగా, జరిగిన సంఘటనపై బుధవారం రాత్రి బాధిత బాలుడి తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 17 , 2026 | 04:37 AM