ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:43 AM
పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ తీర్పును సవాలు చేస్తూ బీఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌లపై మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని సంబంధిత...
3 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం
హైదరాబాద్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ తీర్పును సవాలు చేస్తూ బీఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌లపై మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని సంబంధిత ఎమ్మెల్యేలకు గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బీఆర్‌ఎస్ తరఫున గెలిచి, కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలె యాదయ్య, కడియం శ్రీహరి, బండ్ల కష్ణమోహన్‌రెడ్డి, టి.ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకటరావు, సంజయ్‌కుమార్, గూడెం మహిపాల్‌రెడ్డిలపై దాఖలైన అనర్హత పిటిషన్‌లను కొట్టివేస్తూ స్పీకర్ తీర్పును వెలువరించారు. దీనిని సవాలు చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జి.జగదీశ్‌రెడ్డి, కె.పి.వివేకానంద, కె.సంజయ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీహెచ్.ప్రభాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలు దాఖలు చేసిన 10 పిటిషన్‌లపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌ల బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. కౌంటర్ల దాఖలుకు మూడు వారాల సమయం ఇస్తూ విచారణను జూన్ 6కు వాయిదా వేసింది.