Share News

అత్యంత వేడిగా.. సుదీర్ఘంగా!

ABN , Publish Date - Apr 17 , 2026 | 05:11 AM

దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం 40-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో 45 డిగ్రీలు దాటతాయని, మే, జూన్‌ నెలల్లో ఎండలు మరింత తీవ్ర మవుతాయని అంటున్నారు.

అత్యంత వేడిగా.. సుదీర్ఘంగా!

  • వచ్చే రెండు నెలలు మరింత వేడి

  • 45 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు!

  • వడగాడ్పులతో జనం ఉక్కిరిబిక్కిరి

  • పలు విదేశీ వాతావరణ సంస్థల అంచనా

విశాఖపట్నం, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం 40-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో 45 డిగ్రీలు దాటతాయని, మే, జూన్‌ నెలల్లో ఎండలు మరింత తీవ్ర మవుతాయని అంటున్నారు. ఈ ఏడాది వేసవి సుదీర్ఘంగా, అత్యంత వేడిగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు కూడా దాటిపోతాయని పలు విదేశీ వాతావరణ సంస్థల మోడళ్లు అంచనా వేస్తున్నాయి. భారతదేశం ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన వేసవిలో ఈ ఏడాదీ ఒకటి కావొచ్చని చెబుతున్నాయి. వాతావరణ అనిశ్చితితో వర్షాలు కురిస్తే తప్ప.. వేడి నుంచి ఉపశమనం లభించడం కష్టమేనని అంటున్నారు. గత వారం రోజుల నుంచి ఏపీ, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, ఛత్తీ్‌సగఢ్‌, విదర్భ, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌లలో 40, అంతకంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రెండు వారాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పలు వాతావరణ మోడళ్లు అం చనా వేస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో వేడి తీవ్రతను తగ్గించేలా ఏటా బలమైన తూర్పుగాలులు వీచేవి. అయితే ఈ ఏడాది హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తూర్పుగాలులుబలహీనంగా మారాయి. అదే సమయంలో ఉత్తరాది నుంచి పొడిగాలులు దక్షిణ భారతం వరకు వీస్తున్నాయి. ఈ సీజన్‌లో ఉత్తరాదిలో ఉన్న అధిక పీడ నం ప్రభావంతో ఉత్తర, మధ్యభారతంలో ఉన్న వేడి గాలులు దక్షిణాది రాష్ట్రాలపైకి వీస్తున్నాయని ఇస్రోవాతావరణ నిపుణుడు తెలిపారు.


ఇది ఎల్‌నినో ముందస్తు వాతావరణం!

భూమధ్యరేఖకు ఆనుకుని ఉన్న పసిఫిక్‌ మహాసముద్రంలో లానినా బలహీనపడి తటస్థ పరిస్థితులు ఏర్పడే సంకేతాలు ఉన్నాయని పలువురు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో వాతావరణం వేడెక్కుతుందని విశ్లేషించారు. అంటే ఎల్‌నినో ముందస్తు వాతావరణం ఇప్పుడు కనిపిస్తోందని వివరించారు. కాగా రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ ఆచార్యుడు సత్యనారాయణ పేర్కొన్నారు. ఈనెలలో గురువారం వరకు అనేక ప్రాంతాల్లో 40డిగ్రీలు, అంతకంటే ఎక్కువ నమోదుకావడం ఇందుకు నిదర్శనమన్నారు. దీనివల్ల వడగాడ్పుల తీవ్రత పెరుగుతుందన్నారు. ప్రధానంగా నగరాలు, పట్ణ ణ ప్రాంతాల్లో అర్బన్‌ హీట్‌ ఐలాండ్స్‌ పెరుగుతున్నాయని వివరించారు.ప్రజల ఆరోగ్యం, వ్యవసాయ పంటలు, దిగుబడిపై వడగాడ్పు ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందన్నారు.


ఉడికిన రాయలసీమ

215 మండలాల్లో 40డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు

నేడు, రేపు రాయలసీమ, కోస్తాల్లో వడగాడ్పులు

అమరావతి, విశాఖపట్నం, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): పండ తీవ్రత, తీవ్ర వడగాడ్పులతో గురువారం కోస్తా, రాయలసీమ ఉడికిపోయింది. 215 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైబడి నమోదయ్యాయి. అత్యధికంగా నంద్యాల జిల్లా సంజామలలో 45.1 డిగ్రీలు నమోదైంది. వాతావరణ అనిశ్చితికి కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల మేఘాలు ఆవరించాయి. రాయలసీమలో చెదురుమదురుగా తేలికపాటి జల్లులు కురిశాయి. శుక్రవారం మన్యం, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో 43-44డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లోని 30 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లోని 55 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది.

Updated Date - Apr 17 , 2026 | 05:12 AM