Share News

పండగల వేళ.. చోరుల పంజా..

ABN , Publish Date - Oct 07 , 2026 | 10:01 AM

వరుస సెలవులు, దసరా, దీపావళి పండుగల సీజన్‌ సమీపిస్తున్న వేళ గ్రేటర్‌ పరిధిలో దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి.

పండగల వేళ.. చోరుల పంజా..
Hyderabad Theft Cases

  • వరుస చోరీలతో జనం బెంబేలు..

  • సైబరాబాద్‌లో చెడ్డీగ్యాంగ్‌.. శివారులో ఏటీఎం లూటీ

  • మేడిపల్లిలో డైమండ్‌ షోరూంలో చోరీ

  • వరుస సెలవుల నేపథ్యంలో అంతర్రాష్ట్ర ముఠాల కన్ను

  • సోషల్‌ మీడియాలో వైరల్‌ అయితేనే వెలుగులోకి..

హైదరాబాద్‌ సిటీ: వరుస సెలవులు, దసరా, దీపావళి పండుగల సీజన్‌ సమీపిస్తున్న వేళ గ్రేటర్‌ పరిధిలో దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. ట్రై కమిషనరేట్ల పరిధిలో వరుస చోరీలు, దోపిడీలు జరుగుతుండటంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఇళ్లకు తాళాలు వేసి పండుగ వేళ ఊళ్లకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే.. అత్యాధునిక టెక్నాలజీ, సీసీటీవీ కెమెరాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. దొంగల కదలికలను ముందే పసిగట్టి కట్టడి చేయడంలో పోలీసుల వైఫల్యంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దొంగతనాల గురించి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయితే తప్ప పోలీసులు వీటిని అధికారికంగా బయటకు చెప్పడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.


అల్వాల్‌లో రెండిళ్లలో..

అల్వాల్‌లో రెండు ఇళ్లలో తాళాలు పగులగొట్టిన దొంగలు సుమారు రూ.30లక్షల విలువైన 20తులాల బంగారం, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దొంగలు రెక్కీ చేసి చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.


ఉపాధి కోసం వచ్చి చోరీలు

ఉపాధి కోసం యూపీ, బిహార్‌, హరియాణ, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల నుంచి నగరానికి వలస వస్తున్న కొంతమంది.. మొదట్లో సాధారణ పనులు చేసుకుంటూ క్రమంగా నగరంపై పట్టు సాధిస్తున్నారు. ఇక్కడి సంపాదన సరిపోక సులభంగా డబ్బు సంపాదించేందుకు అపార్ట్‌మెంట్లు, విల్లాలు, శివారు ప్రాంతాల్లోని ఖరీదైన కాలనీలను టార్గెట్‌ చేస్తున్నారు. రెక్కీ నిర్వహించి, బయటి నుంచి తమ అనుచర ముఠాలను రప్పించి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలుతోంది.


city5.2.jpgచెడ్డీగ్యాంగ్‌ హల్‌చల్‌..

సైబరాబాద్‌ పరిధిలోని నెక్నాంపూర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. ఒంటిపై దుస్తులు లేకుండా, ముఖాలకు మాస్కులు ధరించి, మారణాయుధాలతో వచ్చిన ఆరుగురు సభ్యుల ముఠా ఓ ఫ్లాట్‌లో చొరబడి రూ. 80 వేలు దోచుకెళ్లింది.

ఏటీఎం లూటీ

శంషాబాద్‌ జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ పరిధిలో సాతంరాయి యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలోని డబ్బును దుండగులు దోచుకెళ్లారు. గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎంను తెరిచిన దుండగులు రూ.7.4 లక్షలు దోచుకెళ్లారు. ఇది అంతర్రాష్ట్ర ముఠా పనేనని పోలీసులు భావిస్తున్నారు.


మేడిపల్లిలో 5 నిమిషాల్లోనే..

మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలోని మేడిపల్లిలో క్యారెట్‌ లైన్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ షోరూమ్‌ షట్టర్‌ను చాకచక్యంగా లిఫ్ట్‌ చేసిన దొంగలు రూ.2కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు. కేవలం 5 నిమిషాల వ్యవధిలో ఈ దోపిడీ చేయడం గమనార్హం. ఇది తెలిసిన వారి పనే అని, ఎవరైనా ఇక్కడి వ్యక్తులు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాను పిలిపించి ఈ తరహా దోపిడీ చేయించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

గోల్డ్ రేట్స్.. మళ్లీ పెరిగాయిగా.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..

దసరాకు గ్రేటర్‌ నుంచి ప్రత్యేక బస్సులు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 10:01 AM