న్యూ ఇయర్‌కు ముందే.. మాదకద్రవ్యాల రవాణా
ABN , Publish Date - Nov 26 , 2026 | 10:03 AM
హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చడమే లక్ష్యంగా ఒకవైపు పోలీస్ ఉన్నతాధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటే మరోవైపు లోకల్, అంతర్రాష్ట్ర స్మగ్లర్స్ యువతను మత్తుకు బానిసలుగా చేస్తున్నారు.
చాపకింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్స్, గంజాయి
రోజూ పోలీసులకు చిక్కుతున్న స్మగ్లర్స్
ఆటకట్టిస్తున్నా.. ఆగని దందా
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చడమే లక్ష్యంగా ఒకవైపు పోలీస్ ఉన్నతాధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటే మరోవైపు లోకల్, అంతర్రాష్ట్ర స్మగ్లర్స్ యువతను మత్తుకు బానిసలుగా చేస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. బస్తీలు, కాలనీల్లో గంజాయి మత్తు గుప్పుమంటోంది. డ్రగ్స్‌కు బానిసలై స్మగ్లర్స్‌గా మారుతున్న వారిలో ఎక్కువగా చదువుకున్న యువత, బీటెక్ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్, డాక్టర్లు ఉంటున్నారు.
తాజాగా పట్టుబడిన ముఠాలు
స్నాప్‌చాట్ వేదికగా భారీ స్థాయిలో జరుగుతున్న డ్రగ్స్ దందాను ఈగల్ పోలీసులు బట్టబయలు చేశారు. గత బుధవారం నగరంలో మణికొండ ల్యాంకో హిల్స్ నుంచి కారులో డ్రగ్స్ తరలిస్తుండగా.. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఈగల్ పోలీస్ బృందం దాడిచేసి నిందితులను పట్టుకున్నారు. 1.240 కిలోల గంజాయి, 16.59 గ్రాముల ఓజీ కుష్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫ్ నగర్, టోలిచౌకీ, గోల్కొండ ప్రాంతాలకు చెందిన ముగ్గురు స్మగ్లర్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించిన క్రమంలో ఈ డ్రగ్స్ దందాను స్నాప్‌చాట్ ద్వారా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారికి నగరంలో 800 నుంచి 900 మంది కస్టమర్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
రూ. 40లక్షల విలువైన హాషిష్ ఆయిల్
ఒడిశా నుంచి హాషిష్ ఆయిల్‌ను రవాణా చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు స్మగ్లర్స్‌ను ఉప్పల్ ఎస్‌వోటి, నాచారం పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ. 40లక్షల విలువైన 3.180 కేజీల హాషిష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ముంబై స్మగ్లర్స్‌కు సరఫరా..
గంజాయి స్మగ్లింగ్‌లో ఆరితేరిన హైదరాబాద్ స్మగ్లర్స్.. ఒడిశా నుంచి ముంబైకి గంజాయిని సరఫరా చేసి అక్కడి స్మగ్లర్స్‌కు అందజేస్తున్నారు. ఒడిశాలో కేజీ గంజాయిని రూ.7వేలకు కొనుగోలు చేసి.. ముంబై స్మగ్లర్స్‌కు రూ.15వేలకు విక్రయిస్తున్నారు. ఒడిశా నుంచి కారులో 60 కేజీల గంజాయిని తీసుకొని తరలిస్తుండగా, మాటువేసిన మల్కాజిగిరి ఎస్‌వోటి, పోచారం ఐటీ కారిడార్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి కారు, 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ హైదరాబాద్‌కు చెందిన స్మగ్లర్స్‌గా గుర్తించారు.
డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న ఎక్సైజ్ పోలీసులు నగరంలో పలు చోట్ల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జూబ్లీహిల్స్, సికింద్రాబాద్‌లో డ్రగ్స్‌తో పాటు, 13.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
డెడ్‌డ్రాప్ పద్ధతిలోనూ సరఫరా..
పోలీసుల నుంచి తప్పించుకోవడానికి స్మగ్లర్లు కొత్తగా డెడ్‌డ్రాప్ లొకేషన్ షేర్ పద్ధతిలో సరుకును నగరానికి దిగుమతి చేస్తున్నారు. రహస్య ప్రాంతాల్లో డ్రగ్స్‌ను పడేసి లోకేషన్ షేర్ చేసి కస్టమర్స్‌కు, లోకల్ విక్రయదారులకు అందజేస్తున్నారు. ఇటీవల ఈగల్ పోలీసుల దాడుల్లో ఇలాంటి స్మగ్లర్సే ఎక్కువగా పట్టుబడటం గమనార్హం. స్నాప్‌చాట్, ఇన్‌స్టా, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా సరుకు ఆర్డర్ వెళ్తుంది. నగరంలో సరుకు చేరవేసే సరఫరాదారులకు ఆ సమాచారం తెలుస్తుంది.
ఆర్డర్‌కు అవసరమైన డబ్బును కస్టమర్స్ ఆన్‌లైన్‌లో క్యూఆర్ కోడ్, లేదా ఇతర ఆన్‌లైన్ మార్గాల ద్వారా స్మగ్లర్‌కు చెందిన మ్యూల్ (నకిలీ అడ్ర్‌సలతో ఉన్న ఖాతాలు) అకౌంట్లోకి బదిలీ చేస్తారు. డబ్బులు జమ అయినట్లు తెలియగానే నగరంలో ఉన్న స్మగ్లర్స్‌కు డెడ్‌డ్రాప్ లొకేషన్ షేర్ విధానంలో బెంగళూరు నుంచి సరుకు హైదరాబాద్‌కు చేరుతోంది. ఆ సరుకు ఎలా తెస్తారు? ఎవరు తెస్తారు? ఎక్కడ పడేస్తారు? ఇలాంటి వివరాలేమీ ముందుగా తెలియవు. డ్రగ్స్‌ను హైదరాబాద్‌లో ఏదో ప్రాంతంలో పడేసిన తర్వాత ఫొటో లొకేషన్ ఆన్‌లైన్‌లో షేర్ చేస్తారు. ఆ తర్వాత నగరంలోని స్మగ్లర్స్ ఆ సరుకును తీసుకుంటారు. అనంతరం కస్టమర్స్‌కు కూడా అదే తరహాలో డెడ్‌డ్రాప్, లొకేషన్ షేర్ విధానంలో అందజేస్తారు.
డిసెంబర్‌కు ముందే నగరానికి..
డిసెంబర్‌లో న్యూ ఇయర్ వేడుకలు ఉండటంతో.. నెలరోజుల ముందుగానే లోకల్, అంతర్రాష్ట్ర స్మగ్లర్స్.. డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలను రహస్య మార్గాల ద్వారా నగరానికి డంప్ చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రోజుకో ముఠా మాదక ద్రవ్యాలతో పట్టుబడుతోంది. డిసెంబర్‌లో పోలీస్ నిఘా ఎక్కువగా ఉండటంతో ముందుగానే స్మగ్లర్స్ మాదకద్రవ్యాలను నగరానికి తీసుకొచ్చి దాచి పెడుతున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి:
భారీగా పడిపోయిన పసిడి ధరలు.. కారణం ఇదీ
తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News