ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 26 , 2026 | 09:24 AM
ఏపీలో ఈరోజు 23 మున్సిపాలిటీలకు, పంచాయతీలకు తొలిదశ ఎన్నికలు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. బాధ్యత కలిగిన పౌరులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
అమరావతి, నవంబర్ 26: రాష్ట్రంలో తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌తో పాటూ 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లి ఎంపీయూపీ స్కూల్‌లోని పోలింగ్ కేంద్రంలో కుటుంబసభ్యులతో కలిసి సీఎం ఓటు వేశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈరోజు 23 మున్సిపాలిటీలకు, పంచాయతీలకు తొలిదశ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. బాధ్యత కలిగిన పౌరులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం మరింత బలపడాలంటే ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
ఓటు హక్కు వినియోగించుకుంటే ప్రశ్నించే హక్కు ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. భారత్‌లోని ప్రజాస్వామ్యం అత్యంత బలమైనదన్నారు. భారతదేశం మరింతగా అభివృద్ధి జరిగేందుకు సమర్థవంతమైన నాయకత్వం అవసరమని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో డబ్బు ప్రభావం లేకుండా ఓటు వేసే పరిస్థితి ఉండాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలు ముందుకు రావాలని కోరారు. నేడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో భారత్‌కు దశ దిశా నిర్దేశం చేశారన్నారు. ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్య ఆయుధాన్ని ఇచ్చారని తెలిపారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటరు తమ హక్కును వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి...
ఏపీలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్
అధికారిక కార్యక్రమంగా రామోజీ జయంతిపై పిల్
Read Latest AP News And Telugu News