Share News

అంతరిక్షంలో ఏఐ డేటా సెంటర్లు.. స్పేస్‌ఎక్స్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Nov 26 , 2026 | 08:41 AM

ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ మరో సంచలన ప్రాజెక్టుకు సిద్ధమైంది. అంతరిక్షంలో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) అనుమతి పొందింది.

అంతరిక్షంలో ఏఐ డేటా సెంటర్లు.. స్పేస్‌ఎక్స్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్
SpaceX AI Data Centers

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ మరో సంచలన ప్రాజెక్టుకు సిద్ధమైంది. భూమిపై మాత్రమే కాకుండా అంతరిక్షంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) అనుమతి పొందింది. ఏకంగా 10 లక్షల ఉపగ్రహాలతో ‘స్టార్‌మైండ్’ (Starmind) పేరుతో భారీ శాటిలైట్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు స్పేస్‌ఎక్స్‌కు ఎఫ్‌సీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


ఈ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలో ఏర్పాటు చేసే ఉపగ్రహాలు సౌరశక్తిని వినియోగించుకుని పనిచేస్తాయి. వీటిలో అత్యాధునిక ఏఐ కంప్యూటింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. భారీ మొత్తంలో డేటాను అంతరిక్షంలోనే ప్రాసెస్ చేసి, అవసరమైన సమాచారాన్ని తిరిగి భూమికి పంపిస్తారు. సూర్యరశ్మి ద్వారా నిరంతరం విద్యుత్‌ను పొందే అవకాశాన్ని ఉపయోగించుకోవడం ద్వారా భారీ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని స్పేస్‌ఎక్స్ భావిస్తోంది.


రేడియో ఫ్రీక్వెన్సీతో బ్యాకప్ వ్యవస్థ

ఈ ఉపగ్రహాల మధ్య ప్రధానంగా ఆప్టికల్ కమ్యూనికేషన్ వ్యవస్థను వినియోగించనున్నారు. దీనికి అదనంగా అత్యవసర పరిస్థితుల్లో రేడియో ఫ్రీక్వెన్సీ (RF) కమ్యూనికేషన్‌ను బ్యాకప్‌గా ఉపయోగించేందుకు ఎఫ్‌సీసీ అనుమతించింది. ఈ ఏర్పాట్లతో ఉపగ్రహ నెట్‌వర్క్ నిర్వహణ మరింత సమర్థంగా సాగుతుందని భావిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి ఎఫ్‌సీసీ కీలక గడువులను కూడా విధించింది. నవంబర్ 2033 నాటికి ఉపగ్రహాల ప్రయోగ ప్రక్రియ ప్రారంభించాలి. నవంబర్ 2035 నాటికి గరిష్ఠంగా అనుమతించిన సంఖ్యలో కనీసం 10 శాతం.. అంటే లక్ష ఉపగ్రహాలను ప్రయోగించాలి. నవంబర్ 2038 కల్లా మొత్తం అనుమతించిన సంఖ్యలో 50 శాతం ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని తెలిపింది.


ఇవి కూడా చదవండి:

మహిళల బిగ్‌బాష్ లీగ్: ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే బ్యాటర్ ఔట్.. వీడియో వైరల్

ఆట హాస్యాస్పదంగా మారింది.. వైభవ్ ఇన్నింగ్స్‌పై సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Nov 26 , 2026 | 08:41 AM