Share News

మహిళల బిగ్‌బాష్ లీగ్: ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే బ్యాటర్ ఔట్.. వీడియో వైరల్

ABN , Publish Date - Nov 26 , 2026 | 08:04 AM

మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ చరిత్రలోనే ఆసక్తికరమైన రీతిలో వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ డియాండ్రా డాటిన్ వికెట్ కోల్పోయింది.

మహిళల బిగ్‌బాష్ లీగ్: ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే బ్యాటర్ ఔట్.. వీడియో వైరల్
Women's Big Bash League

ఇంటర్నెట్ డెస్క్: మహిళల బిగ్‌బాష్ లీగ్ (WBBL)లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ చరిత్రలోనే ఆసక్తికరమైన రీతిలో వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ డియాండ్రా డాటిన్ వికెట్ కోల్పోయింది. బుధవారం మెల్‌బోర్న్ రెనెగేడ్స్, బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో డాటిన్ ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే ‘ఫ్రీ బాల్ బౌల్డ్ ఔట్’ రూపంలో ఔటై పెవిలియన్‌కు చేరింది. బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో (పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి) ఈ తరహాలో ఔటైన తొలి క్రికెటర్‌గా ఆమె నిలిచింది.


అసలు ఏం జరిగిందంటే?

మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరఫున ఆడుతున్న డియాండ్రా డాటిన్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చింది. డబ్ల్యూబీబీఎల్ నిబంధనల ప్రకారం ఒక బ్యాటర్ ఔటయ్యాక కొత్త ప్లేయర్ 75 సెకన్లలోపు క్రీజులోకి రావాలి. ఆలస్యమైతే ఫ్రీబాల్ వేసే అవకాశం బౌలర్‌కు కల్పిస్తారు. ఆ బంతిని ఎదుర్కొనే అధికారం బ్యాటర్‌కు ఉండకు. అయితే హీట్‌పై 138 పరుగుల ఛేదనలో 15వ ఓవర్‌లో డియాండ్రా ఆలస్యంగా క్రీజులోకి వచ్చింది. దీంతో అంపైర్లు ఆమెను క్రీజు నుంచి ఐదు మీటర్ల దూరంలో నిలబెట్టారు. బౌలర్ సారా గ్లెన్ బంతిని నేరుగా వికెట్లపైకి విసిరింది. బంతి స్టంప్స్‌ను తాకడంతో డాటిన్ ఔటైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత బిగ్‌బాష్ చరిత్రలో ఇలా వికెట్ కోల్పోయిన తొలి ప్లేయర్‌గా డాటిన్ నిలిచింది. స్కోర్‌కార్డులో మాత్రం ఆమె ఒక బంతి ఎదుర్కొని సారా గ్లెన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయినట్లు నమోదైంది. డాటిన్ వికెట్ కోల్పోయినప్పటికీ మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని రెనెగేడ్స్ చివరి బంతికి ఛేదించింది.


ఇవి కూడా చదవండి:

వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా

ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్

Updated Date - Nov 26 , 2026 | 08:04 AM