Share News

వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా

ABN , Publish Date - Nov 25 , 2026 | 06:02 PM

15 ఏళ్లకే ప్రపంచ రికార్డులను తిరగరాస్తున్న భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అతడి చిన్ననాటి కోచ్‌ మనీశ్ ఓజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌ భవిష్యత్తులో వన్డేల్లో ట్రిపుల్‌ సెంచరీ కూడా సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.

వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా
Vaibhav Suryavanshi

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో యూఏఈపై 53 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. 15 ఏళ్లకే ప్రపంచ రికార్డులను తిరగరాస్తున్న ఈ కుర్రాడిపై అతడి చిన్ననాటి కోచ్‌ మనీశ్ ఓజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌ భవిష్యత్తులో వన్డేల్లో ట్రిపుల్‌ సెంచరీ కూడా సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. అతడు నెలకొల్పుతున్న రికార్డులను బద్దలు కొట్టాలంటే వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాటర్‌ క్రిస్‌ గేల్‌ మళ్లీ మైదానంలోకి రావాల్సిందేనని వ్యాఖ్యానించాడు.


‘వైభవ్ సూర్యవంశీ ఏదో ఒక రోజు వన్డేల్లో డబుల్ సెంచరీ చేస్తాడని రెండేళ్ల క్రితమే నేను ఊహించా. ఇప్పుడు అతడి ఆటతీరును చూస్తుంటే ట్రిపుల్‌ సెంచరీ కూడా సాధించడం అసాధ్యమేమీ కాదు. వైభవ్‌ ఏదో ఒక రోజు 300 పరుగులు కూడా చేస్తాడని నేను నిజంగా నమ్ముతున్నాను. యూఏఈతో అతడు ఆడిన ఇన్నింగ్స్‌ అసాధారణం. అందులో దూకుడు, వినోదం, అద్భుతమైన బ్యాటింగ్‌ అన్నీ ఉన్నాయి. వన్డే క్రికెట్‌ను చూసే విధానాన్నే అతడు మార్చేస్తున్నాడు. 14-15 ఓవర్లలోనే 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలిగే సామర్థ్యం వైభవ్‌కు ఉంది. ఇదే దూకుడుతో 50 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేస్తే ఇంకెన్ని పరుగులు సాధించగలడో ఊహించుకోవచ్చు. ప్రస్తుతానికి వైభవ్‌ రికార్డులను బద్దలు కొట్టగల ఆటగాడు ఎవరూ కనిపించడం లేదు. వాటిని అధిగమించాలంటే బహుశా విండీస్ దిగ్గజం క్రిస్‌ గేల్‌ తిరిగి రావాలేమో. వైభవ్‌ నెలకొల్పిన రికార్డులను వైభవే బద్దలు కొట్టగలడు’ అని మనీశ్ ఓజా వెల్లడించాడు.


టీమిండియాలో మరిన్ని అవకాశాలివ్వాలి..

‘వైభవ్‌ ఈ మ్యాచ్‌లో ఆడాడు కాబట్టే 204 పరుగులు చేయగలిగాడు. బెంచ్‌పైనే కూర్చోబెడితే ఇలాంటి ఇన్నింగ్స్‌ ఎలా ఆడతాడు? ఆటగాడు మైదానంలోకి దిగి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడే అనుభవం వస్తుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో అతడికి కనీసం రెండు, మూడు అవకాశాలైనా ఇవ్వాలి. ఒక మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేస్తే తర్వాతి మ్యాచ్‌లోనూ అవకాశం కల్పించాలి. అతడిని కేవలం ప్రత్యామ్నాయ ఆటగాడిగా చూడకూడదు’ అని మనీశ్ ఓజా బీసీసీఐ సెలెక్టర్లకు సూచించాడు.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. రెండో స్థానానికి జస్‌ప్రీత్ బుమ్రా

మీరట్‌లో షాకింగ్ ఘటన.. నడిరోడ్డుపై యువతిని ఈడ్చుకెళ్లిన మాజీ ప్రియుడు!

Updated Date - Nov 25 , 2026 | 06:02 PM