లాభం ఆశ చూపి.. రూ.16.35 లక్షలు కొట్టేశారు!
ABN , Publish Date - Jul 25 , 2026 | 08:01 AM
వాట్సాప్ గ్రూపుల ద్వారా స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు వస్తాయని నమ్మించి రూ.16.35 లక్షలకు పైగా సైబర్ నేరగాళ్లు కాజేశారు.
వాట్సాప్ గ్రూపుల ద్వారా పెట్టుబడుల పేరుతో వల
జీవిత పొదుపు డబ్బులు కోల్పోయిన దంపతులు
హైదరాబాద్ సిటీ: వాట్సాప్ గ్రూపుల ద్వారా స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు వస్తాయని నమ్మించి రూ.16.35 లక్షలకు పైగా సైబర్ నేరగాళ్లు కాజేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జూన్ 2026లో బాధితుడు వేణు గోపాల్‌రావు, ఆయన భార్య శ్రావణిని ఫిన్‌సోల్ సారథి ప్లాన్ ఇనిస్టిట్యూషనల్ స్టాక్ పేరుతో నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూపుల్లో చేర్చారు. తమను ‘అనన్య కులకర్ణి’ అనే గ్రూప్ అనలిస్టు, ప్రొఫెసర్ గుల్ టెక్‌చందానీ పేరుతో పరిచయం చేసుకున్న వ్యక్తులు స్టాక్ మార్కెట్‌లో బ్లాక్ ట్రేడ్స్, అప్పర్ సర్క్యూట్ షేర్లు, ఐపీఓల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు.
వారి సూచనల మేరకు బాధితులు ‘ఫిన్‌సోల్ ఆల్‌గో’ అనే ట్రేడింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అందులో ఖాతాలు తెరిచారు. మొదట రూ.10 వేలు, రూ.25 వేలతో పెట్టుబడి పెట్టగా, వర్చువల్‌గా లాభాలు వచ్చినట్లు చూపించారు. వివిధ బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ చేశారు. దీంతో బాధితుడు పలు విడతలుగా రూ.16,97,623 జమ చేయగా, మోసగాళ్లు కేవలం రూ.62వేలు మాత్రమే తిరిగి చెల్లించారు. యాప్‌లో రూ.35 లక్షల లాభం వచ్చినట్లు చూపించి, ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలంటే రూ.6.50 లక్షల సర్వీస్ ఛార్జీ చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. డబ్బు చెల్లించకపోతే ఖాతాలోని నిధులు ఫ్రీజ్ అవుతాయని బెదిరించడంతో బాధితులకు అనుమానం వచ్చింది. చివరకు యాప్ నకిలీదని, చూపిన లాభాలన్నీ వర్చువల్ మాత్రమేనని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.
టెలిగ్రామ్ టాస్క్‌ల పేరుతో..
టెలిగ్రామ్ గ్రూప్‌లో చేర్చి ఆన్‌లైన్ టాస్క్‌లు, ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు వస్తాయని నమ్మించి ఓ గృహిణి నుంచి రూ.3.41 లక్షలకు పైగా కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుప్పాలగూడ, మణికొండకు చెందిన బాధితురాలిని మొదట వాట్సాప్ ద్వారా సంప్రదించిన సైబర్ కేటుగాళ్లు, అనంతరం ఒక టెలిగ్రామ్ గ్రూప్‌లో చేర్చారు. అక్కడ అభిషేక్ సావంత్ పేరుతో పరిచయం చేసుకున్న వ్యక్తి ఉత్పత్తుల ప్రచార టాస్క్‌లు పూర్తి చేస్తే అధిక పారితోషికంతో పాటు ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు వస్తాయని నమ్మించాడు.
అతడి సూచనల మేరకు బాధితురాలు నకిలీ ట్రేడింగ్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని, ముందుగా రూ.92,500 చెల్లించి టాస్క్‌లు పూర్తి చేసింది. అనంతరం ఖాతాలో భారీ లాభాలు వచ్చినట్లు చూపించడంతో ఆమెకు నమ్మకం పెరిగింది. గ్రూప్‌లో ఇతర సభ్యులు కూడా విజయవంతంగా డబ్బులు ఉపసంహరించుకున్నట్లు సందేశాలు పోస్టు చేయడంతో మరింత విశ్వాసం ఏర్పడింది. దీంతో బాధితురాలు తనతో పాటు భర్త బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతా నుంచి మరోసారి రూ.90వేలు, రూ.10 వేలు జమ చేసింది.
అనంతరం డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా, ముందుగా మరో టాస్క్ పూర్తి చేయాలని చెప్పి రూ.1,64,535 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ డబ్బు చెల్లించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. వాలెట్ ఐడీ ఫ్రీజ్ అయిందని, దానిని అన్‌ఫ్రీజ్ చేయాలంటే మరో రూ.2 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేశారు. అప్పటికే అనుమానం వచ్చిన బాధితురాలు విచారించగా, ఇది నకిలీ ట్రేడింగ్ వెబ్‌సైట్ ద్వారా జరుగుతున్న సైబర్ మోసమని గుర్తించింది. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పెన్షనర్స్ బెనిఫిట్స్ కార్డు పేరుతో..
హైదరాబాద్ సిటీ: పెన్షనర్స్ బెనిఫిట్ కార్డు పేరుతో బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి ఇటీవల యూట్యూబ్‌లో రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ బెనిఫిట్ కార్డ్ స్కీమ్ పేరుతో వచ్చిన ప్రకటనను చూశారు. అందులో ఇచ్చిన లింక్ ద్వారా దరఖాస్తు చేశారు. ఈ నెల 11న అఖిలేష్ మిశ్రా అనే వ్యక్తి ఫోన్ చేసి, తాను పంజాబ్ నేషనల్ బ్యాంక్, ద్వారకా బ్రాంచ్(న్యూఢిల్లీ) మేనేజర్‌నని పరిచయం చేసుకున్నాడు.
పెన్షనర్ బెనిఫిట్ కార్డు ఇప్పిస్తానని, తాను బ్యాంక్ ఉద్యోగినని నమ్మించేందుకు గుర్తింపు కార్డు పంపించడంతో బాధితుడు నమ్మాడు. బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు నంబర్, పిన్ నంబర్ చెప్పాడు. అతడు పంపించిన లింక్‌లపై క్లిక్ చేయగా మొబైల్‌కు ఓటీపీలు వచ్చాయి. వాటిని సైబర్ నేరగాడికి చెప్పగా కొద్దిసేపటికి బ్యాంక్ ఖాతా నుంచి రూ. 4.55 లక్షలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. మోసం జరిగిందని గ్రహించిన బాధితుడు బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేయించి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణపై కేంద్రానికి లేఖ
Read Latest AP News And Telangana News And International News And Telugu News