పుష్పక విమానం కాదు నాయనా..!
ABN , Publish Date - Jul 25 , 2026 | 06:56 AM
ఒకరా ఇద్దరా.. పైగా అందులో చిన్నపిల్లలూ కారు.. ! ఒకే బైక్‌పై ఏకంగా ఆరుగురు యువకులు ప్రయాణించిన తీరు చూసి పోలీసులే నోరెళ్లబెట్టారు.
ఒకే బైక్‌పై ఆరుగురు.. వెంబడించి పోలీసుల కౌన్సెలింగ్.. బైక్ సీజ్
ఒకరా ఇద్దరా.. పైగా అందులో చిన్నపిల్లలూ కారు.. ! ఒకే బైక్‌పై ఏకంగా ఆరుగురు యువకులు ప్రయాణించిన తీరు చూసి పోలీసులే నోరెళ్లబెట్టారు. వెంటనే తేరుకుని వారిని వెంబడించి పట్టుకున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు. బైక్ సీజ్ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం గాడ్రాళ్లపల్లి నుంచి హిందూపురానికి శుక్రవారం ఆరుగురు ఒకే బైక్‌పై రయ్‌మంటూ దూసుకుపోతున్నారు. అటుగా వెళ్తున్న హిందూపురం రూరల్ సీఐ జనార్దన్, చిలమత్తూరు ఎస్‌ఐ శ్రీధర్ వారి చూసి.. వెంబడించారు. గాడ్రాళ్లపల్లి దాటాక బైక్ ఆపి యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ద్విచక్రవాహనంపై ఆరుగురు ప్రయాణించడం ప్రమాదకరమని, ఏదైనా జరిగితే ప్రాణాలే పోతాయని హితవు పలికారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, మోటారు వాహనాల చట్టం కింద బైక్‌ను సీజ్ చేశారు. పశ్చిమబెంగాల్‌లోని ముషీరాబాద్ జిల్లాకు చెందిన ఈ ఆరుగురూ ఈ ప్రాంతానికి వలస కూలీలుగా వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
-ఆంధ్రజ్యోతి, హిందూపురం