Share News

శాఖలన్నీ హైడ్రాకు మోకరిల్లాయి

ABN , Publish Date - Jul 25 , 2026 | 06:35 AM

హైడ్రా కమిషనర్‌, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఎ.వి.రంగనాథ్‌ వ్యవహార శైలిపై శుక్రవారం హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొంటున్న ఆయన న్యాయస్థానానికి సమర్పించిన..

శాఖలన్నీ హైడ్రాకు మోకరిల్లాయి

  • చట్టాలన్నీ రద్దు చేసి హైడ్రా యాక్టు చేయండి

  • జీవో ద్వారా పుట్టిన హైడ్రాకు అసాధారణ అధికారాలా?

  • కమిషనర్‌ రంగనాథ్‌ చేసేది పెద్ద తప్పు

  • అఫిడవిట్‌లో కనీస పశ్చాత్తాపం లేదు.. హైకోర్టు ఆగ్రహం

  • సైన్యం మోహరింపు ఉత్తర్వులపై 27న పరిశీలిస్తామని వ్యాఖ్య

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): హైడ్రా కమిషనర్‌, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఎ.వి.రంగనాథ్‌ వ్యవహార శైలిపై శుక్రవారం హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొంటున్న ఆయన న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్‌లో కనీస పశ్చత్తాపాన్ని వ్యక్తం చేయకపోవడాన్ని విమర్శించింది. హైడ్రాకు అసాధారణ అధికారాలు కట్టబెట్టడాన్ని కూడా తప్పుపట్టింది. శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీకి మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామ పరిధిలో ఉన్న 40 ఎకరాల ప్రైవేటు పట్టా భూమిలోకి వెళ్లరాదన్న ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలపై జస్టిస్‌ జూకంటి అనిల్‌కుమార్‌ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైడ్రా తీరును న్యాయమూర్తి తప్పుపట్టారు. రాష్ట్రంలోని అన్ని శాఖలు హైడ్రాకు మోకరిల్లాయని వ్యాఖ్యానించారు. అన్ని చట్టాలను రద్దు చేసి హైడ్రా చట్టం తీసుకొస్తే సరిపోతోందని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. హైడ్రాకు అసాధారణ అధికారాలు కట్టబెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు. ‘పోలీసు, రెవెన్యూ, నీటిపారుదల, మున్సిపల్‌ తదితర శాఖలను హైడ్రా ఎలా కమాండ్‌ చేయగలుతోంది? ఈ రాష్ట్రంలో ఇతర చట్టాలు, శాఖలు చలాయించాల్సిన అధికారాలు మొత్తం హైడ్రానే చేసేస్తుందా? హైడ్రా ఎక్కడికి వెళ్లినా భారీఎత్తున పోలీసు బలగాలు, భారీవాహనాలు, ఇతర వనరులు ఎలా సమకూరుతున్నాయి? హైడ్రాకు భారీ ఎత్తున వనరులు సమకూర్చాలని ఏ చట్టంలో ఉంది? కేవలం జీవో ద్వారా పుట్టిన హైడ్రాకు ఇంతటి విశేషాధికారులు ఎలా వచ్చాయి? హైడ్రా కమిషనర్‌ చేసేది పెద్ద తప్పు.. ఆయనను ఇలాగే వదిలేస్తే న్యాయవ్యవస్థ అన్నా, కోర్టు తీర్పులు అన్నా పరిహాసంగా మారుతాయి. కేవలం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ లా ఆఫీసర్‌ అయిన అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తితో కమిషనర్‌పై తక్షణ చర్యలు తీసుకోకుండా ఈ కోర్టు తనను తాను నియంత్రించుకుంటోంది’ అని వ్యాఖ్యానించారు.


కోర్టు ధిక్కరణకు పాల్పడలేదు: రంగనాథ్‌

ఈ సందర్భంగా రంగనాథ్‌ అఫిడవిట్‌ సమర్పిస్తూ తాను కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని తెలిపారు. పిటిషనర్‌ భూమిలోకి తాము ప్రవేశించలేదని, ప్రవేశించబోమని పేర్కొన్నారు. స్వల్పకాలిక నోటీసు కారణంగా ఈ అఫిడవిట్‌ను సమర్పిస్తున్నానని, పూర్తి వివరాలతో అదనపు అఫిడవిట్‌ ఇస్తామని పేర్కొన్నారు. దీనిని ధర్మాసనం తప్పుబట్టింది. ‘కమిషనర్‌ మొండి వైఖరి కళ్ల ముందు కనిపిస్తుండగా ఇంకా అదనపు అఫిడవిట్‌ ఎందుకని’ ధర్మాసనం ప్రశ్నించింది. ‘ప్రభుత్వం-పిటిషనర్‌కు సంబంధించిన భూవివాదంలో ఇంతకుముందు ఇచ్చిన తీర్పుల్లో ఎక్కడా కక్షిదారుగాలేని హైడ్రా అకస్మాత్తుగా తెరపైకి వచ్చి కోర్టు ధిక్కరణకు పాల్పడటం ఏమిటి? అన్ని శాఖలకు తానే ప్రతినిధి అన్నట్లు, సర్వాంతర్యామి తానే అన్నట్లు న్యాయపాలనలో జోక్యం చేసుకుంటూ కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడం ఏమిటి? ఇది చట్టానికి ఇంతవరకు ఎప్పుడూ తెలియని కొత్త విషయం. ఈ హైకోర్టు చరిత్రలో గతంలో లేని, ఎప్పుడూ వినని, వింత విషయం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అత్యంత సీనియర్‌ అయిన అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తితో కమిషనర్‌ను అదుపులోకి తీసుకోవాలన్న ఉత్తర్వులు జారీచేయకుండా మూడోసారి తనను తాను కోర్టు నియంత్రించుకుందని పేర్కొంది. అదనపు అఫిడవిట్‌ దాఖలు చేస్తామని ఏజీ చెబుతున్న నేపథ్యంలో దానిని పరిశీలించిన అనంతరం.. సైన్యాన్ని మోహరించాలన్న ఉత్తర్వులను అమలు చేయాలా? వద్దా? అనే అంశాన్ని ఈనెల 27న పరిశీలిస్తామని తెలిపింది. తదుపరి విచారణను కూడా అదే రోజుకు వాయిదా వేసింది.

Updated Date - Jul 25 , 2026 | 06:37 AM