Share News

కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణపై కేంద్రానికి లేఖ

ABN , Publish Date - Jul 25 , 2026 | 06:48 AM

కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్ర జలశక్తి శాఖ, ఎన్‌డీఎ్‌సఏ చేసే సిఫారసులను రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు

కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణపై కేంద్రానికి లేఖ

  • సాంకేతిక సిఫారసుల ఆధారంగా ముందుకు: మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్ర జలశక్తి శాఖ, ఎన్‌డీఎస్ఏ చేసే సిఫారసులను రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్‌ నిర్వహణపై స్పష్టమైన సాంకేతిక మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతూ.. కేంద్ర జలశక్తి శాఖ, జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎస్ఏ)లకు లేఖలు రాయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్‌డీఎస్ఏ సూచనల మేరకు మూడు బ్యారేజీలను ప్రస్తుతం ఫ్రీ-ఫ్లో (నీటి ప్రవాహం సజావుగా కొనసాగే) స్థితిలో ఉంచామన్నారు. బ్యారేజీల్లో మళ్లీ నీటిని నిల్వ చేయాలా...వద్దా...? పంపింగ్‌ చేపట్టాలా... వద్దా...? అనే అంశాలపై లిఖితపూర్వకంగా ఆయా విభాగాలు అభిప్రాయం తెలిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. కేంద్రానికి రాసే లేఖకు ఇప్పటిదాకా జరిగిన పరీక్షల ఫలితాలు, సాంకేతిక పరిశీలనల వివవరాలన్నీ జోడించాలన్నారు. బ్యారేజీల్లో ఇప్పటి వరకు నీటిని ఎందుకు నిల్వ చేయలేదో, పంపింగ్‌ ఎందుకు చేపట్టలేదో వివరించాలన్నారు. ఈ లేఖను రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ రెసిడెంట్‌ కమిషనర్‌ ద్వారా వ్యక్తిగతంగా కేంద్ర జలశక్తి శాఖకు అందజేయాలన్నారు. బ్యారేజీల నిర్వహణపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర జలశక్తి శాఖ చేసిన వ్యాఖ్యలపై మంత్రి చర్చిస్తూ... ఎన్‌డీఎస్ఏ మాత్రం బ్యారేజీలను ఫ్రీ-ఫ్లో కండిషన్‌లో ఉంచాలని సిఫారసు చేసిందని పేర్కొన్నారు. కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) నివేదికలు, గ్రౌండ్‌ పెనట్రేటింగ్‌ రాడార్‌(జీపీఆర్‌) సర్వే ఫలితాలు, ఫొటోలు, రాఫ్ట్‌ ఫౌండేషన్‌ కింద ఏర్పడిన ఖాళీపై సాంకేతిక ఆధారాలను జోడించాలన్నారు.


కాగా అన్నారం బ్యారేజీ పునరుద్ధరణపై కేంద్ర నీటి, విద్యుత్‌ పరిశోధన కేంద్రం(సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) చేసిన సర్వే ఫలితాల విశ్లేషణ తుది దశలో ఉందని అధికారులు వివరించారు. అన్నారం బ్యారేజీ రాఫ్ట్‌ ఫౌండేషన్‌లో క్యావిటీస్‌ ఉన్నాయని...ఆ బ్యారేజీలో నీటి నిల్వ సాధ్యం కాదని వారు నివేదించారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ డిజైన్‌ ఆగస్టు చివరి నాటికి, పునరుద్ధరణకు కావాల్సిన వ్యయంపై ప్రాథమిక అంచనా సెప్టెంబరు నాటికి సిద్ధమవుతాయన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై సాంకేతిక విశ్లేషణ రెండు వారాల్లో పూర్తవుతుందన్నారు. బ్యారేజీల ప్రాథమిక పునరుద్ధరణ ప్రతిపాదనలను తదుపరి సాంకేతికకమిటీ సమావేశంలో అందించాలని మంత్రి ఆదేశించారు. పాలమూరు--రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పురోగతిని కూడా ఆయన సమీక్షించారు.

Updated Date - Jul 25 , 2026 | 06:51 AM