అన్నా.. నీ వెంటే నేను!
ABN , Publish Date - Jul 11 , 2026 | 10:35 AM
ఆ అన్నదమ్ములది 60 ఏళ్ల అనుబంధం. ఆప్యాయత, అనురాగంతో పెరిగారు. ఏవో పొరపొచ్చాలతో వారి మధ్య కొన్నేళ్లుగా మాటల్లేవు.
24 గంటల వ్యవధిలోనే అన్నదమ్ముల మృతి
ముద్దనపల్లెలో విషాదం
రామకుప్పం(తిరుపతి): ఆ అన్నదమ్ములది 60 ఏళ్ల అనుబంధం. ఆప్యాయత, అనురాగంతో పెరిగారు. ఏవో పొరపొచ్చాలతో వారి మధ్య కొన్నేళ్లుగా మాటల్లేవు. అయినా, ఒకరిపై ఒకరికి ప్రేమాభిమానాలు తగ్గలేదు. ఈ క్రమంలో అన్న మృతిచెందాడు. అదే వేదనతో ఉన్న తమ్ముడు 24 గంటల్లోనే గుండెపోటుకు గురై అసువులు బాశాడు. ఈ విషాద ఘటన రామకుప్పం మండలం ముద్దనపల్లెలో చోటుచేసుకుంది. ముద్దనపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యం(66), షణ్ముగం(60) అన్నదమ్ములు. ఎంతో అనుబంధంతో కలిసిమెలిసి ఉన్న వీరి మధ్య కొన్నేళ్లుగా మాటల్లేవు.
రామకుప్పంలో దుకాణంతోపాటు ఇల్లు కట్టుకుని సుబ్రహ్మణం ఉంటున్నారు. గ్రామంలోనే షణ్ముగం ఉన్నారు. ఈ నేపథ్యంలో హృద్రోగంతో బాధపడుతున్న సుబ్రహ్మణ్యం నాలుగు రోజుల క్రితం బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చేరారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో తీవ్రగుండెపోటుతో ప్రాణాలొదిలారు. మృతదేహాన్ని సాయంత్రానికి కుటుంబసభ్యులు రామకుప్పానికి తీసుకొచ్చారు. నిర్జీవంగా పడున్న అన్నచూసి షణ్ముగం తల్లడిల్లిపోయారు. ఇంటికి వెళ్లినా అదే వేతనతో.. ముభావంగా ఉన్నారు. శుక్రవారం తెల్లారుజామున ఆయన కూడా గుండెపోటుతో మృతిచెందారు.
ఇలా 24 గంటల వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. టీడీపీ అభిమానులైన వీరి మృతిపట్ల గ్రంథాలయ పరిషత్ రాష్ట్ర డైరెక్టరు మునస్వామి, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పట్రనారాయణాచారి, మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు వెంకటాచలం, కామరాజనాయక్, మాజీ అధ్యక్షులు ఆంజనేయరెడ్డి, ఆనందరెడ్డి, కడ పీఏసీ సభ్యుడు రఘుతో పాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రశ్నిస్తే ఇంత నీచానికి దిగజారుతారా? వైసీపీ మహిళా నాయకురాలి సంచలన వీడియో
Read Latest AP News And Telangana News And International News And Telugu News