నకిలీ ఈ-మెయిల్‌తో రూ. 4.30 లక్షల గోల్‌మాల్
ABN , Publish Date - Jul 11 , 2026 | 09:45 AM
వ్యాపార లావాదేవీల్లో సరఫరాదారు పేరుతో నకిలీ ఈ-మెయిల్ పంపి బ్యాంకు ఖాతా వివరాలను మార్చి రూ.4.30 లక్షలు కాజేసిన ఘటన సైబరాబాద్‌లో వెలుగుచూసింది.
బ్యాంకు ఖాతా మార్చి డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ సిటీ: వ్యాపార లావాదేవీల్లో సరఫరాదారు పేరుతో నకిలీ ఈ-మెయిల్ పంపి బ్యాంకు ఖాతా వివరాలను మార్చి రూ.4.30 లక్షలు కాజేసిన ఘటన సైబరాబాద్‌లో వెలుగుచూసింది. బాధిత సంస్థ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఎం/ఎస్ 360 డిగ్రీ ప్రాపర్టీ అండ్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ యలవలూరి రాజశేఖర్ ఆర్క్ ఎం కన్సల్టింగ్ సంస్థతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 12న సరఫరాదారు అధికారిక ఈ-మెయిల్ నుంచి వచ్చినట్లుగానే ఇన్వాయిస్ వచ్చింది.
అందులో ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా వివరాలు ఉన్నాయి. అనంతరం జూన్ 16న (rkarkmconsult.in@gmail.com) అనే ఈ-మెయిల్ ఐడీ నుంచి మరో ఇన్వాయిస్ పంపి, చెల్లింపును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాకు పంపాలని అందులోని సారాంశం. ఆ ఈ మెయిల్‌ను నిజమైనదిగా నమ్మిన సంస్థ అధికారులు రూ. 4,30,620లను ఆ ఖాతాకు బదిలీ చేశారు.
అనంతరం చెల్లింపు వివరాలను అదే ఈ మెయిల్‌కు పంపగా, బ్యాంకు ఖాతాలో సమస్య ఏర్పడిందని, డబ్బు తిరిగి వచ్చిందని పేర్కొంటూ మరోసారి కెనరా బ్యాంకు ఖాతాకు చెల్లించాలని కోరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమానం రావడంతో సంబంధిత సరఫరాదారును ఫోన్‌లో సంప్రదించగా, తమ సంస్థ నుంచి అలాంటి ఈ మెయిల్‌లు పంపలేదని, చెల్లింపు తమ ఖాతాకు రాలేదని తెలిసింది. దీంతో మోసపోయినట్లు గుర్తించి బాధితులు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
రంగారెడ్డిలో దారుణం.. ఆరుగురిని హత్య చేసిన కిరాతకుడు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News