Share News

దంపతుల అదృశ్యం కేసులో అన్నీ అనుమానాలే!

ABN , Publish Date - Jul 11 , 2026 | 09:17 AM

స్విట్జర్లాండ్‌ వెళ్తున్నామని ఇంటి నుంచి బయలుదేరిన తమ తల్లిదండ్రుల ఆచూకీ లేకుండా పోయిందని ఓ యువతి చర్లపల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో అన్నీ అనుమానాలే వ్యక్తమవుతున్నాయి.

దంపతుల అదృశ్యం కేసులో అన్నీ అనుమానాలే!
Hyderabad Couple Missing Case

  • రూ.50 కోట్లతో ఉడాయించారని బాధితుల ఫిర్యాదు

  • ఆచూకీ కోరుతూ పిల్లల కంప్లైంట్‌

  • పోలీసుల అదుపులో దంపతులు?

హైదరాబాద్: స్విట్జర్లాండ్‌ వెళ్తున్నామని ఇంటి నుంచి బయలుదేరిన తమ తల్లిదండ్రుల ఆచూకీ లేకుండా పోయిందని ఓ యువతి చర్లపల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో అన్నీ అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. ఆ దంపతుల బారిన పడి రూ.లక్షల్లో మోసపోయామని పలువురు వాపోతున్నారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి-భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం మాదాపూర్‌ గ్రామానికి చెందిన పబ్బా చంద్రశేఖర్‌ (51) కుటుంబం 30 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చింది. ముగ్గురు అన్నదమ్ములు కలిసి భగవాన్‌ కాలనీలో దాదాపు మూడు దశాబ్ధాలుగా నివసిస్తున్నారు.


చంద్రశేఖర్‌ ఇటీవలే సొంత ఇల్లు కట్టుకొని భార్య స్వప్న(43), ఇద్దరు బిడ్డలు శ్రేయ(22), శ్రీనిత(19)లతో తన మకాంను అక్కడికి మార్చాడు. శ్రీ వెంకటేశ్వర మార్కెటింగ్‌ పేరిట హోల్‌సేల్‌ సిమెంట్‌(భారతి సిమెంట్స్‌) వ్యాపారం చేస్తూ, ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ (ఐవీఎఫ్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా చలామణీ అవుతూ పలువురితో సఖ్యత పెంచుకున్నాడు. ఆయన మాయమాటలను నమ్మి, వడ్డీ వస్తుందనే ఆశతో దాదాపు 80 మంది ఆయనకు రూ.లక్షల్లో అప్పులు ఇచ్చారు. అదృశ్యానికి ముందు చివరి ఇరవై రోజుల్లోనే దాదాపు రూ.40కోట్లు సేకరించినట్లు తెలుస్తోంది.


22న అదృశ్యం

గత నెల 22నుండి ఆయనతో పాటు ఆయన భార్య స్వప్న కూడా కనిపించకుండా పోవడం, చంద్రశేఖర్‌ ఫోన్‌ స్విచా్‌ఫలో ఉండడం, ఆయన ఇంటికి తాళం వేసి ఉండడం, ఇద్దరు కూతుళ్లను తన సోదరుడి వద్ద వదిలేసి వెళ్లడం వంటి విషయాలు తెలిసి బాధితులు భగవాన్‌ కాలనీలోని అతని ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేశారు. చివరకు తాము మోసపోయామని గుర్తించి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. గత నెల 30వ తేదీన ఐవీఎఫ్‌ అధ్యక్షుడు వుప్పల శ్రీనివాస్‌ గుప్తాతో కలిసి వెళ్లి మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ సుమతికి ఫిర్యాదు చేశారు. అలాగే చంద్ర శేఖర్‌ తన వద్ద నుంచి రూ.80లక్షలు అప్పుగా తీసుకొని కనిపించకుండా పోయాడని యామసాని శ్రీనివాస్‌ ఖిల్లా వరంగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈనెల 8న ఫిర్యాదు చేశాడు. మరోఐపు తమ అమ్మానాన్న ఆచూకీ తెలియడం లేదని ఆ దంపతుల కుమార్తె శ్రేయ ఈనెల 8వ తేదీన చర్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.


అనుమానాలెన్నో!

కనీసం బంధువులు, కుటుంబసభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా చంద్రశేఖర్‌ దంపతులు స్విట్జర్లాండ్‌ వెళ్లిపోయారా ని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కొందరు వ్యాపారుల బ్లాక్‌ మనీని కమీషన్‌ తీసుకుని హోల్‌సేల్‌ సిమెంట్‌ వ్యాపారం ద్వారా ‘వైట్‌’గా మార్చేవాడని, అదృశ్యానికి రెండు రోజుల ముందు ఓ మార్వాడీ వ్యాపారి తన డబ్బును ఆన్‌లైన్‌లో పంపాలని అడిగితే అకౌంట్‌లో డబ్బులు లేవని, కానీ రూ.కోట్లలో క్యాష్‌ ఉందని రెండు డబ్బు సంచులు తెరచి చూపించినట్లు సమాచారం. మరో భోషాణం లాంటి పెట్టెలో నగలు కూడా చూపాడని సదరు మార్వాడీ యువకుడు (కలెక్షన్‌ బాయ్‌) తెలిపినట్లు బాధితులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా ఓ మీడియా సంస్థకు చెందిన రాజకీయ నాయకుడికి కూడా రూ.3కోట్ల వరకు చంద్రశేఖర్‌ బకాయి పడ్డాడని, అతని బెదిరింపుల మూలంగా భార్యతో కలిసి ఆయన అదృశ్యమయ్యాడనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

రంగారెడ్డిలో దారుణం.. ఆరుగురిని హత్య చేసిన కిరాతకుడు..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 11 , 2026 | 09:17 AM