ఓపెన్ ఏఐపై యాపిల్ దావా.. రహస్య సాంకేతిక సమాచారాన్ని దొంగిలించారంటూ ఆరోపణలు..
ABN , Publish Date - Jul 11 , 2026 | 08:59 AM
కృత్రిమ మేధ రంగంలో పోటీ రోజురోజుకూ తీవ్రతరమవుతున్న వేళ ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్, ఏఐ స్టార్టప్ ఓపెన్ ఏఐ మధ్య వివాదం నెలకొంది. ఓపెన్ ఏఐ సంస్థ తమ వాణిజ్య రహస్యాలను దొంగిలించిందని యాపిల్ ఆరోపించింది.
కృత్రిమ మేధ రంగంలో పోటీ రోజురోజుకూ తీవ్రతరమవుతున్న వేళ ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్, ఏఐ స్టార్టప్ ఓపెన్ ఏఐ మధ్య వివాదం నెలకొంది. ఓపెన్ ఏఐ సంస్థ తమ వాణిజ్య రహస్యాలను దొంగిలించిందని యాపిల్ ఆరోపించింది. ఓపెన్‌ఏఐతో పాటు తమ సంస్థలో గతంలో పనిచేసిన ఇద్దరు మాజీ ఉద్యోగులపై యాపిల్ కేసు దాఖలు చేసింది (Apple vs OpenAI).
అమెరికాలోని కాలిఫోర్నియా ఉత్తర జిల్లా న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్‌లో యాపిల్ పలు కీలక ఆరోపణలు చేసింది. తమ సంస్థకు చెందిన అత్యంత రహస్య సాంకేతిక సమాచారం, ఉత్పత్తుల నమూనాలు, తయారీ ప్రక్రియలు, సరఫరా వ్యవస్థకు సంబంధించిన కీలక వివరాలను అక్రమంగా సేకరించి ఓపెన్‌ఏఐ హార్డ్‌వేర్ ప్రాజెక్టులకు ఉపయోగించారని యాపిల్ ఆరోపించింది (OpenAI trade secrets).
ఆ మాజీ ఉద్యోగులు యాపిల్‌లో పనిచేస్తున్న సమయంలోనే కీలక రహస్య పత్రాలు, ఉత్పత్తుల రూపకల్పన వివరాలు, తయారీ విధానాలు, సరఫరా గొలుసుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఓపెన్ ఏఐకు చేరవేశారని పేర్కొంది. ఈ చర్యలు ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగాయని యాపిల్ వాదిస్తోంది. ఆ ఇద్దరు మాజీ ఉద్యోగుల్లో ఒకరు ప్రస్తుతం ఓపెన్ ఏఐ హార్డ్‌వేర్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు పిటిషన్‌లో పేర్కొంది (Apple lawsuit).
యాపిల్ ఆరోపణలను ఓపెన్ ఏఐ ఖండించింది. ప్రత్యర్థి సంస్థల వ్యాపార రహస్యాలపై తమకు ఆసక్తి లేదని, స్వతంత్ర పరిశోధనల ఆధారంగానే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపింది. కోర్టులో తమ వాదనలు వినిపిస్తామని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
ఇరాన్‌కు 24 గంటల గడువు.. హోర్ముజ్‌పై అమెరికా తుది హెచ్చరిక..