డాక్టర్లకు చుక్కలు చూపిస్తున్న ఎండలు.. ఆపరేషన్లను మధ్యలో ఆపేసి..
ABN , Publish Date - Jul 11 , 2026 | 08:23 AM
బ్రిటన్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణ జనం నుంచి ఏసీల్లో పని చేసే ఉద్యోగుల వరకు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. నేషనల్ హెల్త్ సెంటర్స్‌లో సర్జరీలు చేసే డాక్టర్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
ఇంటర్‌నెట్ డెస్క్: బ్రిటన్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణ జనం నుంచి ఏసీల్లో పని చేసే ఉద్యోగుల వరకు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. నేషనల్ హెల్త్ సెంటర్స్‌లో సర్జరీలు చేసే డాక్టర్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. తీవ్రమైన ఉక్కపోత కారణంగా ఆపరేషన్లను మధ్యలోనే నిలిపివేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, క్లినిక్‌లు, ఇతర వైద్య కేంద్రాలలో ఉక్కపోత విపరీతంగా పెరిగిపోవడంతో డాక్టర్లు, నర్సులు తీవ్రమైన డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు.
డీహైడ్రేషన్ కారణంగా తల తిరగడం.. కొన్ని సందర్భాల్లో స్పృహతప్పి పడిపోయే స్థితికి చేరుకుంటున్నారు. డీహైడ్రేషన్ సమస్య కారణంగా సర్జరీలు చేసేటప్పుడు పెద్ద పొరపాట్లు జరగకుండా నివారించడానికి కొంతమంది సర్జన్లు ఆపరేషన్‌లను మధ్యలోనే ఆపేస్తున్నారు. తమ సర్జికల్ దుస్తులను తొలగించి, శరీరాన్ని చల్లబరుచుకుంటున్నారు. చల్లగా ఏదైనా తాగి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత సర్జరీని పూర్తి చేస్తున్నారు.
రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అధ్యక్షుడు డాక్టర్ టిమ్ లేన్ ది టెలిగ్రాఫ్ పత్రికతో మాట్లాడుతూ.. ‘పాత ఎన్‌హెచ్ఎస్ భవనాల్లో ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంటోంది. ఉక్కపోతను డాక్టర్లు తట్టుకోలేకపోతున్నారు. చాలా ఆపరేషన్లు ఆలస్యం అవుతున్నాయి. మరికొన్ని రద్దవుతున్నాయి. కొన్ని ఆపరేషన్ థియేటర్లలో హ్యుమిడిటీ (గాలిలోని తేమ శాతం) ఎంత ఎక్కువగా ఉందంటే, శస్త్రచికిత్సకు ఉపయోగించే పరికరాలపై నీటి బిందువులు చేరుతున్నాయి. రోగులు కేవలం ఒక చిన్న ఫ్యాన్ మాత్రమే ఉన్న గదులలో శస్త్రచికిత్స కోసం వేచి ఉండాల్సి వస్తోంది’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..
ఇరాన్‌కు 24 గంటల గడువు.. హోర్ముజ్‌పై అమెరికా తుది హెచ్చరిక..