రుతుపవనాలు బలహీనం
ABN , Publish Date - Jul 11 , 2026 | 05:46 AM
దక్షిణ భారతంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. దీనికి తోడు రాష్ట్రం పరిసరాల్లో ఆవర్తనాలు, ద్రోణులు లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో..
పెరిగిన ఉష్ణోగ్రతలు.. అక్కడక్కడా వర్షాలు
విశాఖపట్నం, జూలై 10(ఆంధ్రజ్యోతి): దక్షిణ భారతంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. దీనికి తోడు రాష్ట్రం పరిసరాల్లో ఆవర్తనాలు, ద్రోణులు లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో శుక్రవారం పొడి వాతావరణం నెలకొంది. కోస్తా, సీమల్లో ఎక్కువచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. జంగమహేశ్వరపురంలో 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ అనిశ్చితితో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. శుక్రవారం ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు శ్రీకాకుళం జిల్లా బుడుమూరులో 26, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 15.25 మి.మీ. వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.