Share News

రైతమ్మలకు జేజేలు

ABN , Publish Date - Mar 08 , 2026 | 11:29 AM

మహిళలను భూమాతతో పోల్చుతారు. అయితే భూమాత పచ్చగా మారి, ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తోందంటే... ఆ కృషిలో మహిళా భాగస్వామ్యాన్ని మర్చిపోరాదు. అందుకే ఐక్యరాజ్య సమితి 2026ను ‘మహిళా రైతుల సంవత్సరం’గా ప్రకటించింది.

రైతమ్మలకు జేజేలు

మహిళలను భూమాతతో పోల్చుతారు. అయితే భూమాత పచ్చగా మారి, ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తోందంటే... ఆ కృషిలో మహిళా భాగస్వామ్యాన్ని మర్చిపోరాదు. అందుకే ఐక్యరాజ్య సమితి 2026ను ‘మహిళా రైతుల సంవత్సరం’గా ప్రకటించింది. ఇది ప్రపంచ వ్యవసాయ చరిత్రలో ఒక కీలకమైన మలుపు. పొలాల్లో విత్తనాలు చల్లటం నుంచి, కుటుంబాన్ని నడిపించే దాకా... వ్యవసాయ రంగాన్ని నిశ్శబ్దంగా మోస్తున్న ఎందరో రైతమ్మల కృషికి లభించిన అంతర్జాతీయ గుర్తింపు ఇది. నేడు (మార్చి 8) ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా కొందరు మహిళా రైతుల విజయగాథలకు నీరాజనాలు పలుకుదాం...

ఆదివాసీ వరికి రక్షణ

ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు మండలం సొవ్వ, కరకవలస గ్రామాల్లో 45 మంది మహిళా రైతులు... 13 పురాతన దేశీయ వరి రకాలను సాగు చేయడంతో పాటు, కరకవలస గ్రామంలో గెడ్డ వాగు వరదలకు మునిగిపోకుండా తట్టుకునే 4 నుంచి 6 అడుగుల వరకు పెరిగే దేశీయ వరిని సాగు చేస్తున్నారు. ఇక్కడి కుటుంబాలకు ఎకరం నుంచి రెండు ఎకరాలకు మించి ఉండదు. ‘‘ఇవి దేవుడు ఇచ్చిన ధాన్యపు రకాలు అని మా నమ్మకం. బస్నా సోప్పూర్‌, బుడమ ధాన్యం, దేశీ పెద్దధాన్యం, దేశీ రాజముడి, ఎర్ర ధాన్యం, గుడుం ధాన్యం, ఇసుకరవ్వలు, జోజోర్కి ధాన్యం, మాస్టర్‌ ధాన్యం, నల్ల ధాన్యం, పసుపు సన్నాలు, సోర్‌ ధాన్యం, తేటం ధాన్యం ఇలా 13 రకాలు పండిస్తున్నాం.


ఇవన్నీ మా పూర్వీకులు ఎప్పుడో పండించినవే, మేము వాటిని కాపాడుకుంటున్నాం’ అంటున్నారు లకోయి సుమతి. ఈ దేశీయ వరి రకాలను శుద్ధి చేసి (వేరే రకాలు కలవకుండా), వాటి ఉత్పత్తిని పెంచడానికి కరకవలస గ్రామంలో బయోడైవర్సిటీ బ్లాక్‌లను గ్రామస్తులంతా ఏర్పాటు చేసుకున్నారు. ఈ పురాతన వరి వంగడాల విలువను గుర్తించిన వాసన్‌, వికాస స్వచ్ఛంద సంస్థలు ఈ మహిళా రైతుల నుంచి ప్రతీ రకానికి 500 కిలోల చొప్పున ేసకరించి విత్తనాల అభివృద్ధికి, ఇతర ప్రాంతాలకు ఈ బియ్యాన్ని మార్కెటింగ్‌ చేసి ఆదివాసీల ఆదాయం పెంచడానికి కృషి చేస్తున్నాయి. స్థానిక వరి రకాలకు అధిక డిమాండ్‌ ఉంది. పర్యాటకులు అరకు లోయలోని దుకాణాల నుంచి కిలోకు రూ.80 చొప్పున చెల్లించి బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.


book7.2.jpgకాయగూరలు, పండ్లకు కొత్త జీవం

తూర్పు కనుమల ప్రాంతం. పనస, పైనాపిల్‌, మామిడి వంటి పండ్లకు పెట్టింది పేరు. కానీ మార్కెట్‌ లేని రోజుల్లో అదే పంట రోడ్ల పక్కన పారేస్తున్న దృశ్యాలు రమణమ్మ మనసును కలిచివేశాయి. ఆమె ఒక వ్యవసాయ కూలీ. అనకాపల్లి జిల్లాలోని చోడవరానికి చెందిన ఆమె, బాల్యం నుంచే పేదరికంతో పోరాడుతూ వ్యవసాయ పనులు చేస్తూనే డిగ్రీ పూర్తి చేసింది. తమ ప్రాంతంలోని గిరిజన రైతులు నష్టపోతున్న తీరును చూసి ఊరుకోలేక, మాడుగుల సమీపంలోని ‘వికాసవనం’లో చేరింది. అక్కడ కొన్ని సంస్థల సహకారంతో ఎకరం విస్తీర్ణంలో సోలార్‌ డ్రైయర్లు ఏర్పాటు చేసి కాయగూరలు, పండ్లకు కొత్త జీవం పోసింది. కొండ ప్రాంతాల్లో పండే పైనాపిల్‌, మామిడి, పనస, అరటి, సపోట వంటి సీజనల్‌ ఫ్రూట్స్‌ను ముక్కలుగా చేసి, డ్రై చేసి అన్‌సీజన్‌లోనూ అందుబాటులో ఉంచుతూ ఎగుమతులు మొదలుపెట్టింది. అల్లం, మునగాకు, కరివేపాకు, ఉసిరి పొడులు కూడా ఇక్కడే తయారవు తున్నాయి.


‘‘అల్లం పొడి కూరల్లో, టీలో వేస్తారు. మ్యాంగో పొడి పులిహార, కూరల్లో ఎక్కువగా అడుగుతున్నారు. ఉసిరి పొడికీ మంచి డిమాండ్‌ ఉంది. పనస, అరటి డ్రైడ్‌ ఫ్రూట్స్‌ను ఐస్‌క్రీమ్‌ కంపెనీలు కోరుతున్నాయి,’’ అని రమణమ్మ చెబుతుంది. ఈ కృషిని గుర్తించిన హార్టికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ పండ్లు నిల్వ ఉండేందుకు కోల్డ్‌ స్టోరేజీ రూమ్‌ ఏర్పాటు చేసింది. ఫలితంగా రమణమ్మతో పాటు నలుగురు మహిళలకు ఉపాధి, రైతులకు నష్టాల తగ్గింపు, అన్‌సీజన్‌లోనూ పండ్ల లభ్యత. అధిక దిగుబడి వచ్చినప్పుడు పంటను విలువ ఆధారిత ఉత్పత్తిగా మార్చి లాభాలు పొందే మార్గం చూపింది. తూర్పు కనుమల్లో రమణమ్మ వెలిగించిన ఈ చిన్న దీపమే, పెద్ద మార్పునకు వెలుగుబాటగా మారింది.


టమాటా నష్టాలకు చెక్‌... భారతమ్మ ఐడియా!

book7.3.jpgటమాటా.... ఒక సీజన్‌లో కిలోకి వంద రూపాయలుంటుంది... ఇంకో సీజన్‌ లో కిలోకి రూపాయి కూడా ధర పలకదు! ప్రతీ సీజన్‌ లోనూ పత్రికల్లో దీని ధర ఒక తప్పనిసరి వార్త! ఇలాంటి వార్తలను బ్రేక్‌ చేసిన రైతు భారతమ్మ. రాయలసీమ ప్రాంతంలో రైతులకు టమాటా సాగు ప్రతి ఏటా ఒక ప్రశ్నగానే ఉంటుంది. మార్కెట్‌ ధరలలో తీవ్రమైన తేడాలే దానికి కారణం. ఇలాంటి పరిస్థితిలో అనంతపురం జిల్లా, బండ్రేపల్లి గ్రామానికి చెందిన భారతమ్మ ఒక పరిష్కారం చూపారు. కేవలం టమాటా మాత్రమే కాకుండా, దాంతో పాటు మరికొన్ని అంతర పంటలను కలిపి సాగు చేేస ‘పాలీ క్రాపింగ్‌’ మోడల్స్‌ని ఆమె అమలు చేశారు.


‘‘టమాటాతో పాటు కూరగాయలు, ఆకుకూరలను మిశ్రమ పద్ధతిలో అంతర పంటలుగా వేయడం, ఏడాది పొడవునా పెరిగే కొన్ని తీగ జాతి పంటలు కలిపి వేయడం, ఇలా రకరకాల ప్రయోగాలు చేశాను. మార్కెట్‌ ధరల వల్ల కలిగే రిస్కు తగ్గించడం, అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం అందేలా చూడటం... ఈ మోడల్స్‌ ఉద్దేశం. గత మూడేళ్లుగా ఈ విధానం పాటిస్తున్నాను. టమాటా వల్ల ఇప్పటి వరకు నష్టపోలేదు’ అంటోంది భారతమ్మ. ఆమె సహజ వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నారు, ఆమెను ఆదర్శంగా తీసుకొని 8 మంది రైతులతో మొదలైన ఈ పాలీక్రాప్‌ విధానం ఇవ్వాళ 250 మంది రైతులకు చేరింది. శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో దాదాపు 96.50 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం ప్రధాన పంట టమాటాను మరికొన్ని అంతర పంటలతో కలిపి సాగు చేస్తున్నారు.


మంచు బిందువులతో 25 రకాల పంటలు

book7.4.jpg‘‘నాకు ముగ్గురు బిడ్డలు. డెలివరీకి ఏ ఆసుపత్రికీ వెళ్లలేదు. ఇంట్లోనే నార్మల్‌ డెలివరీ అయింది. ఇప్పటిదాకా మా కుటుంబానికి డాక్టర్‌ ఎలా ఉంటారో తెలీదు. ఒక్క టాబ్లెట్‌ కూడా వేసుకోలేదు. మేమే కాదు మా ఊరంతా అంతే ఆరోగ్యంగా ఉంటారు. ఇదంతా మా ప్రకృతి పంటల మహిమ’’ అన్నారు వినోద. ఆమెకు నాగ్వర్‌ గ్రామంలో (న్యాల్‌కల్‌ మండలం, సంగారెడ్డి జిల్లా) రెండు ఎకరాలుంది. దానిలో 25 రకాల చిరుధాన్యాలు పండిస్తున్నారు. ‘‘మాకు నీటి వసతి లేదు. వర్షాధార సాగు. మా అత్తమ్మల ద్వారా చిరుధాన్యాల పంటల సాగు నేర్చుకున్నాం. మంచు కురిసే సీజన్‌లో కొన్ని పంటలు ఆ తేమకే పండుతాయి. జొన్నల్లో 4 రకాలు, రాగులు, సజ్జలు, కొర్రల్లో అయిదేసి రకాలు... ఇలా ఏడాదంతా ఏదో ఒక పంట పండిస్తాం. నెలకో పంట దిగుబడి వస్తుంది. ముందు కుటుంబ అవసరాలకు ఉంచుకున్న తరువాత మిగిలిన పంటనే అమ్ముకుంటాం’’ అంటారామె. విత్తనాలు, ఎరువులు సొంతంగా తయారు చేసుకుంటారు తప్ప బయట నుంచి ఒక్కటి కూడా కొనరు. ఈ ఊరిలో ఎరువుల షాపులుండవు. అన్ని ఖర్చులు పోనూ ఎకరానికి లక్షన్నరకు పైగా లాభం వస్తుందన్నారు వినోద.


చిరుధాన్యాలతో సిరులు

book7.5.jpgవాతావరణ మార్పులు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలా తక్కువ నీటితో పండే చిరుధాన్యాల సాగును విస్తృతంగా చేపట్టడం మేలని వ్యవసాయ శాస్త్రవేత్తలంటారు. వీటికి కరువు పాంతాలే అనుకూలం. అయితే మిల్లెట్స్‌ సాగులో రైతులు ముందుకు వచ్చినప్పటికీ, వాటి ప్రాసెసింగ్‌లో ఉన్న క్లిష్టత, వాటి వినియోగం తగ్గడానికి రైతులు నష్టపోవడానికి కారణం అయ్యింది. ఈ సమస్యకు కొత్త పరిష్కారం చూపారు కొందరు మహిళలు. చిరుధాన్యాల పోషక విలువలు కోల్పోకుండా వాటి పొట్టుతీయడానికి అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేసి, మిల్లెట్స్‌ని పునర్వినియోగంలోకి తేవడానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు అన్ని రకాల మిల్లెట్స్‌ని ఆధునిక యంత్రాలపై ప్రాసెస్‌ చేస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా మామిడిపాలెంలో ఏర్పాటయ్యింది ‘మన్యం గ్రెయిన్స్‌’. ఊరి మధ్యనే ‘మన్యం గ్రెయిన్స్‌’ ఫ్యాక్టరీ పెట్టి, చిరుధాన్యాలతో సేమియా, ఇడ్లీ, దోసె పిండి తయారు చేసి ప్యాకింగ్‌ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఫ్యాక్టరీ సమీపంలో ఒక మిల్లెట్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేసి, సజ్జల జంతికలు, జొన్నల స్నాక్స్‌, అరికల అప్పడాలు తయారు చేస్తున్నారు. ‘మన్యం గ్రైయిన్స్‌’ మహిళల కృషి వల్ల ఏజెన్సీ రైతుల కష్టానికి తగిన గిట్టుబాటు ధర లభించింది. మామిడిపాలెం చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా చిరుధాన్యాలు పండించుకొని ఇక్కడే ప్రాసెస్‌ చేయించుకొని లాభాలు పొందుతున్నారు. ఈ మిల్లెట్స్‌ మిల్‌, రెస్టారెంట్‌ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా రెండొందలకు పైగా మహిళలకు ఉపాధి దొరికింది. వర్షాధార భూముల్లో అరుదైన సంపదను సృష్టించి, గ్రామీణ ఎకానమీని మార్చారు.


పశుగ్రాస ప్రయోగంతో పాల వెల్లువ

book7.6.jpgఅక్కడ మేత లేక పశువులు విలవిల్లాడేవి. సుదూర ప్రాంతాలైన శ్రీకాళహస్తి, రాయచోటి నుంచి పశుగ్రాసం తెప్పించుకోవాల్సి వచ్చేది. ఆర్దిక భారం తట్టుకోలేని రైతులు పశువులను చౌకగా అమ్మేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి స్థితిలో ఒక మహిళా రైతు పంటపొలాల్లో చేసిన చిన్న ప్రయోగం వీరిని సమస్యల నుంచి బయటపడేలా చేసి... పాల ఉత్పత్తిని పెంచింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో అయ్యవారిపల్లికి చెందిన హేమలత పశుగ్రాసం కష్టాల నుంచి పాడి రైతులను గట్టెక్కించడానికి, భిన్నమైన సేద్యం చేస్తున్నారు. తనకున్న రెండు ఎకరాల్లో ఒక ఎకరంలో కూరగాయలు వేసి మరో ఎకరంలో పశుగ్రాసం పెంచుతున్నారు. అయితే ఒకేరకం పశుగ్రాసం కాకుండా మల్టీ స్పీషీస్‌ ఫోడర్‌ ని పెంచడం మొదలు పెట్టారు.


‘‘మా ప్రాంతంలో తక్కువ వర్షపాతం, ఎండ తీవ్రత ఎక్కువ. తీవ్రమైన నీటి కొరత ఉంది. అందుకే ఇక్కడ ఎండను తట్టుకునే, తక్కువ నీటితో పెరిగే, పోషక విలువలు ఉన్న పంటల కలయిక చాలా ముఖ్యం అని తెలుసుకున్నాను. ఎప్పుడూ ఒకేరకం ఆహారంతో మనుషులు విసిగిపోయినట్టే పశువులు కూడా ఉంటాయి. వాటికి భిన్నమైన రుచులు అవసరం. అందుకే అలసందలు, సజ్జ, జొన్న, ఉలవలు, రాగులు, పప్పుధాన్యాల విత్తనాలన్నీ కలిపి పండిస్తున్నాను. పంట బాగా ఎదిగిన తరువాత ఈ మల్టీ స్పీషీస్‌ ఫోడర్‌ని పశువులకు వేస్తుంటే చాలా ఇష్టంగా తింటున్నాయి. కార్పొహైడ్రేట్‌లు, ప్రొటీన్‌, ఖనిజాలు సమానంగా లభిస్తుండటంతో పాల ఉత్పత్తి పెరిగింది. అన్నింటికన్నా ముఖ్యంగా పశువుల ఆరోగ్యం మెరుగుపడింది.’ అన్నారు హేమలత.


ఈ మహిళా రైతు పశుగ్రాస ప్రయోగం సక్సెస్‌ అవ్వడంతో మిగతా రైతులంతా గ్రామసభలు నిర్వహించి అందరి సమన్వయంతో బహుళపంటల పశుగ్రాసం పెంపకం చేపట్టారు. ఈ మల్టీ స్పీషీస్‌ ఫోడర్‌ని 90 మందికి పైగా కుటుంబాలు పెంచుతున్నాయి. సుమారు 117.5 ఎకరాల్లో 274 టన్నులకు పైగా పశుగ్రాసం పండుతోంది. పాడి పశువులకు పోషక పదార్థాలు లభించి పాల దిగుబడి పెరిగి రైతుల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. గతంలో ఆ ఊరిలో 200 లీటర్ల పాలు సేకరించడం కూడా కష్టంగా ఉండేది. నేడు వెయ్యి లీటర్లకు పైగా పాలు సేకరిస్తున్నారు. ఒకప్పుడు పశుగ్రాసం కోసం నానా కష్టాలు పడిన రైతులు నేడు చుట్టుపక్కల గ్రామాలకు కూడా మేతను సరఫరా చేేస స్థాయికి ఎదిగారు.


బీడు భూముల్లో ఆత్మవిశ్వాసమే తోడుగా...

book7.7.jpgదట్టమైన అడవి, గుహలు, కొండలతో తెలంగాణ- చత్తీస్‌గఢ్‌ మధ్య విస్తరించిన సహజ సుందరమైన ప్రాంతం కర్రెగుట్టలు. ఒక వైపు సాయుధ దళాలు మరోవైపు మావోయిస్టుల కదలికల మధ్య ఎవుసం చేయడానికి రైతులు వెనుకాడుతున్న సమయంలో 150 మంది మహిళలు కొంగు బిగించి పొలాల్లోకి అడుగు పెట్టారు. ములుగు జిల్లా, వెంకటాపురం మండలంలో ఒకప్పుడు అన్నీ బీడు భూములే. అక్కడి గిరిజనులకు చిన్న కమతాలున్నప్పటికీ సాగుకి అనువుగా లేక మగాళ్లు పట్టణాలకు వలసలు వెళ్లేవారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో అక్కడకు వనసమాఖ్య అనే స్వచ్ఛంద సంస్థ బీడు భూములకు నీటి వసతి కల్పించి, భూసారం పెంచి సాగుకు అనువుగా మార్చింది.


150 ఎకరాలకు సరిపడా మామిడి మొక్కలిచ్చారు. వాటి నిర్వహణకు మహిళా రైతులు గ్రామాభివృద్ధి కమిటీగా ఏర్పడి ముందుకు వచ్చారు. ‘మామిడి తోటల మధ్య వాటర్‌మెలన్‌ సాగు మొదలు పెట్టాం. ఎకరానికి రూ. 20 వేల వరకు పెట్టుబడి పెట్టాం. పూర్తిగా ఆర్గానిక్‌ విధానంలో పండిస్తున్నాం. ఏడాదికి రెండు పంటల తీస్తున్నాం. ఎకరానికి 2 నుంచి 3 లక్షల వరకు ఆదాయం వస్తోంది’ అని తిప్పాపురానికి చెందిన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యురాలు మిడియం నాగమణి అన్నారు. అక్కడ భూములు పచ్చగా మారడంతో... వలస వెళ్లిన మగాళ్లు వెనక్కి వచ్చి పుచ్చకాయలను మార్కెట్‌కు తరలించడంలో మహిళా రైతులకు సాయపడుతున్నారు.


సముద్రాన్ని వెనక్కి నెట్టారు..

book7.8.jpgసముద్రం, ఊర్లు... ఈ రెండింటి మధ్య సహజమైన వంతెనలుగా నిలిచే మడ అడవులు ఈ రోజు కీలకశక్తిగా మారాయి. తుఫాన్లు, సునామీలు, వరదల సమయంలో తీరాన్ని కోతకు గురికాకుండా అడ్డుకునే రక్షణ కవచాలివి. మత్స్య సంపదకు పుట్టినిల్లులాంటి ఈ అడవులు సముద్రతీర గ్రామాలకు జీవనాధారాన్ని కూడా అందిస్తున్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. గత శతాబ్దం చివరికి ప్రపంచంలో ఉన్న మడ అడవుల్లో సగానికి పైగా విస్తీర్ణం నశించిందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమస్య వల్ల ఆంధ్రప్రదేశ్‌, కృష్ణా డెల్టా ప్రాంతంలో వ్యవసాయం, చేపల వేట మీద ఆధారపడే లక్షలాది కుటుంబాల జీవితం తరచూ వచ్చే తుఫాన్లు, వరదలతో సంక్షోభంలో పడింది.


దీనికి పరిష్కారంగా మడ అడవుల పునరుద్థరణకు మహిళలే ముందుకు వచ్చారు. కృష్ణా జిల్లాలోని సొర్లగొండి, నాలి, బసవనిపాలెం గ్రామాల్లో స్థానిక మహిళల భాగస్వామ్యంతో 200 హెక్టార్ల విస్తీర్ణంలో మడ అడవుల పునరుద్థరణ స్వామినాథన్‌ ఫౌండేషన్‌ సహకారంతో ప్రారంభమైంది. ఇది కేవలం మొక్కలు నాటే కార్యక్రమం కాదు. వాతావరణ మార్పులకు ఎదురొడ్డి నిలబడే గ్రామాల సామర్థ్యాన్ని పెంచిన ఉద్యమం. ఇక్కడి మహిళలు మరో అడుగు ముందుకేశారు. సముద్రపు బ్యాక్‌ వాటర్‌ను చిన్న మడుల్లోకి మళ్లించి చేపలు, పీతల పెంపకం చేపట్టారు.


ఫలితంగా తీరానికి రక్షణ, మత్స్య సంపద పెరుగుదలతో స్థిరమైన ఆదాయం ఈ రెండు కలిసి గ్రామాల్లో కొత్త ఆశను నింపాయి. ‘‘మడ అడవులు కేవలం చెట్లు కాదు.. అవి తీరప్రాంతాల రక్షణ కవచాలు... అని ఫౌండేషన్‌ వారు మాకు చెప్పారు. వాటిని కాపాడితే మా జీవితం, పర్యావరణం, రేపటి భవిష్యత్తు అన్నీ సురక్షితంగా ఉంటాయి. ఇప్పుడు మడ అడవులు పెరుగుతున్నాయి. తుఫాన్‌ వచ్చినా, కెరటాలు పెరిగినా నష్టం ఉండదని ఊరంతా ధైర్యంగా ఉంది’’ అన్నారు పద్మ. ఈ గ్రామాల్లో మడ అడవులు ఇప్పుడు కేవలం ప్రకృతి సంపద కాదు... అవి భరోసా, ఆత్మవిశ్వాసం, రేపటి భవిష్యత్తు. ఇదంతా మహిళా సంకల్పమే.

- శ్యాంమోహన్‌, 94405 95858


ఈ వార్తలు కూడా చదవండి:

ఎవరికీ సబార్డినేట్‌ని కాదు

సర్వం.. కల్తీ మయం!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 08 , 2026 | 11:29 AM