Share News

ఎవరికీ సబార్డినేట్‌ని కాదు

ABN , Publish Date - Mar 08 , 2026 | 01:56 AM

పశ్చాత్తాపం–ప్రాయశ్చిత్తం... ఈ రెండూ మనుషులకు ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వస్తాయి. మనిషన్నాక ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక తప్పు చేయకుండా ఉండడు. అయితే, తప్పు చేస్తున్నామని గుర్తించి...

ఎవరికీ సబార్డినేట్‌ని కాదు

పశ్చాత్తాపం–ప్రాయశ్చిత్తం... ఈ రెండూ మనుషులకు ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వస్తాయి. మనిషన్నాక ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక తప్పు చేయకుండా ఉండడు. అయితే, తప్పు చేస్తున్నామని గుర్తించి అటువంటి తప్పులను మళ్లీ చేయకుండా... పశ్చాత్తాపం చెంది ప్రాయశ్చిత్తం చేసుకొనే వాళ్లు మనీషిగా నిలుస్తారు. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ ఇద్దరు రష్యన్‌ మహిళలతో గతంలో అక్రమ సంబంధం నెరిపారు. ఇందుకు ఆయన తర్వాత పశ్చాత్తాపం చెందారు. తన సంపదలో సింహభాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు కూడా! మన దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో తప్పులు చేసిన, చేస్తున్న రాజకీయ నాయకులు ఇందుకు భిన్నంగా బుకాయిస్తున్నారు. చేసిన తప్పు ఒప్పుకొని చెంపలేసుకోకుండా రాజకీయ ఎత్తుగడలతో రచ్చ సృష్టిస్తున్నారు. తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడటంతో ప్రారంభమైన తప్పులు ఎన్నెన్నో మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో లడ్డూనే కాదు– మతాన్ని కూడా కల్తీ చేస్తున్నారు. తిరుమల లడ్డూకు కల్తీ నెయ్యి వాడటం సత్యం. ఈ తప్పునకు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రత్యక్షంగా కారకుడు కాకపోవచ్చు. అయితే తన హయాంలో ఆ దేవదేవుడికి అపచారం జరిగినందుకు పశ్చాత్తాపం చెంది, సారీ చెప్పి ఉంటే వివాదం అంతటితో ముగిసేది. జగన్‌ అండ్‌ కో అలా చేయకుండా ఎదురుదాడికి దిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ సంస్థనూ వివాదంలోకి లాగింది. తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన సంస్థలలో ఒకటైన ఇందాపూర్‌ డెయిరీలో హెరిటేజ్‌ కూడా నెయ్యి ఉత్పత్తి చేసిందని ఆరోపించారు. దీంతో హెరిటేజ్‌ సంస్థ షేర్ల ధర క్షీణించిందని సంబరపడుతున్నారు. హెరిటేజ్‌ సంస్థ ప్రైవేట్‌ కంపెనీ. కాకపోతే అది పబ్లిక్‌ లిమిటెడ్‌. షేర్ల ధరలు క్షీణిస్తే ఆ కంపెనీ ప్రమోటర్లకంటే ఆ కంపెనీ షేర్లు కొనుగోలు చేసిన మదుపరులే ఎక్కువగా నష్టపోతారు. ఈ మాత్రం ఇంగితం కూడా లేకుండా హెరిటేజ్‌పై దాడిని ఉధృతం చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడటానికీ హెరిటేజ్‌కూ ఏమి సంబంధం? కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నందుకు క్షమాపణలు చెప్పాల్సిందిపోయి ఒక ప్రైవేట్‌ కంపెనీపై దాడిని కేంద్రీకరించి పైశాచిక ఆనందం పొందారు. ఈ వ్యవహారంపై శాసన మండలిలో కూడా రచ్చ జరిగింది. ఈ సందర్భంగా మతం తెర మీదకు వచ్చింది. కల్తీ నెయ్యి వ్యవహారం కారణంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నందున వారంతా జగన్‌రెడ్డికి వ్యతిరేకమవుతారన్న భావన వైసీపీ నాయకుల్లో ఏర్పడినట్టుగా ఉంది. అంతే, కొత్తగా మతం పుచ్చుకున్నవాడికి నామాలు ఎక్కువ అన్నట్టుగా జగన్‌రెడ్డితో సహా ఆ పార్టీ నాయకులు హిందూ మతంపై అంతకు ముందులేని ప్రేమ కనబరచటం మొదలుపెట్టారు. కడపలో పునరుద్ధరించిన దేవాలయాలలో జగన్‌రెడ్డి ప్రత్యేకంగా పూజలు చేయడం చూశాం. 2019 ఎన్నికలకు ముందు కూడా స్వరూపానంద స్వామి చొరవతో జగన్‌రెడ్డి గంగా నదిలో స్నానం ఆచరించారు.


నాలుగు తరాలుగా..

జగన్‌రెడ్డి కుటుంబం నాలుగు తరాలుగా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తోంది. ఇది జగన్‌రెడ్డి ముత్తాత వెంకటరెడ్డితో మొదలైంది. తాత రాజారెడ్డి, తండ్రి రాజశేఖరరెడ్డి, ఇప్పుడు జగన్‌రెడ్డి కూడా అదే మతాన్ని ఆచరిస్తున్నారు. మతం అనేది వ్యక్తిగత స్వేచ్ఛ. ఎవరైనా ఏ మతాన్నయినా స్వీకరించి ఆచరించవచ్చు. జగన్‌రెడ్డి క్రైస్తవ మతాన్ని ఆచరిస్తుంటే ఆక్షేపించవలసింది ఏమీ లేదు. అయితే, ఇప్పుడు ఇది రాజకీయంతో ముడిపడి ఉన్నందున హిందూ మతమన్నా తనకు గౌరవం అని చాటి చెప్పుకోవడానికి ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టారు. క్రైస్తవుడయినందునే జగన్‌రెడ్డి తన హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడినా పట్టించుకోలేదని కూటమి నాయకులు ప్రచారం చేయడం మొదలెట్టారు. ఈ ప్రచారం వల్ల హిందువులు తనకు దూరమవుతారన్న భయంతో జగన్మోహన్‌రెడ్డి గుళ్లూ గోపురాలు తిరగడం మొదలెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో మత మార్పిడి చేసుకొని క్రైస్తవులైనవారు హిందూ దేవాలయాలకు వెళ్లరు. తీర్థప్రసాదాలు కూడా ముట్టరు. జగన్‌రెడ్డి రాజకీయాల్లో ఉన్నందున గుళ్లూ గోపురాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు ఆయన క్రైస్తవ మతాన్ని ఆచరిస్తారని చాలా మందికి తెలియదు. ఆ మేరకు ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. జగన్‌రెడ్డి మాత్రం ఆ జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. తను ఊరూరా నిర్మించుకున్న ప్యాలెస్‌లపై శిలువ గుర్తు వేయించుకున్నారు. అంతే కాదు, క్రైస్తవ మతం పుచ్చుకున్న ఇతరులు ఆయనకు ఓటు బ్యాంకుగా మారారు. ఈ నేపథ్యంలో కల్తీ నెయ్యి అంశం తెరమీదకు రావడం, దీని ఆధారంగా జగన్‌రెడ్డిని హిందూ వ్యతిరేకిగా ముద్రవేయడానికి కూటమి నాయకులు ప్రయత్నించడం జరుగుతోంది. దీంతో ఉలిక్కిపడిన వైసీపీ నాయకులు ఈ ప్రచారానికి విరుగుడుగా జగన్‌రెడ్డిని దేవాలయాలకు తిప్పడం మొదలెట్టారు. హెరిటేజ్‌ సంస్థను వివాదంలోకి లాగారు. ఈ క్రమంలో మతాన్ని కూడా కల్తీ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు శాసనమండలిలో మాట్లాడుతూ జగన్‌రెడ్డితో పాటు శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు కూడా క్రైస్తవులే అని అన్నారు. దీంతో ఉలిక్కిపడిన చైర్మన్‌ మోషేన్‌ రాజు ‘నేను క్రైస్తవుడిని కాదు, హిందువునే’ అని చైర్మన్‌ స్థానంలో కూర్చొని మరీ ప్రకటించుకున్నారు. వాస్తవానికి ఆయన క్రైస్తవాన్ని ఆచరిస్తారు. చర్చిలకు మాత్రమే వెళ్లి ప్రార్థనలు చేస్తారు. ఆయన దేవాలయాలకు వెళ్లి పూజలు చేసిన దాఖలాలు లేవు. ‘ఏసు ప్రభువు మాత్రమే నిజమైన దేవుడు’ అని ఆయన స్వయంగా చెప్పిన మాటలు ప్రచారంలోకి వచ్చాయి. క్రైస్తవ మతాన్ని ఆచరించడం నేరం కానప్పుడు మోషేన్‌ రాజు తాను హిందువునని ఎందుకు చెప్పుకొన్నట్టు? ఇందుకు కారణం లేకపోలేదు. దళితులు తాము క్రైస్తవులమని ప్రకటించుకుంటే రిజర్వేషన్ల కోటాలో బీసీలుగా పరిగణించబడతారు. దళిత కోటాను కోల్పోతారు. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవులుగా మారిన దళితులలో అత్యధికులు రికార్డుల ప్రకారం హిందువులుగానే కొనసాగుతున్నారు. మోషేన్‌ రాజు కూడా ఈ కారణంగానే తాను హిందువును అని సభా సాక్షిగా చెప్పుకొని ఉంటారు. మొత్తం మీద మతాన్ని కూడా కల్తీ చేశారు.


ఈ నేపథ్యంలోనే హిందువులు సంఘటితమైతే తమ రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయన్న భయంతో వైసీపీ నాయకులు ఇప్పుడు హిందూ జపం చేస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు కల్తీ మతం వరకూ వచ్చింది. కల్తీ నెయ్యి వ్యవహారం తెర మీదకు వచ్చినప్పుడే జరిగిన దానికి క్షమాపణలు చెప్పి ఉంటే వివాదం అంతటితో ముగిసి ఉండేది. అలా చేయకుండా ఎదురుదాడికి దిగడం వల్ల తమ మతాన్ని కూడా కప్పిపుచ్చుకోవాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకున్నారు.

గేట్స్‌ను విమర్శించే అర్హత ఉందా...

ఇంతకు ముందే చెప్పుకొన్నట్టుగా కల్తీ నెయ్యి వాడకానికి జగన్‌రెడ్డి ప్రత్యక్షంగా కారకుడు కాకపోయి ఉండొచ్చు. కాసులకోసం కక్కుర్తిపడిన ఎవరో ఆ పాతకానికి ఒడిగట్టారు. జరిగిన దానికి నైతిక బాధ్యత వహించి దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవలసిందిగా జగన్‌రెడ్డి కోరి ఉంటే హుందాగా ఉండేది. అలా చేయకపోగా మనసులో ఇష్టం లేకపోయినా గుళ్లూ గోపురాల చుట్టూ తిరగవలసి వస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే మన రాజకీయ నాయకులకు దేవుడు, మతం కూడా రాజకీయాలకు ముడి సరుకుగా మారిపోయాయనిపిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం తాము విశ్వసించని మతాన్ని నమ్ముతున్నట్టు ప్రకటిస్తారు. ఇష్టం లేని దేవుడికి పూజలు చేస్తారు. మనసులో చిరాకుగా ఉన్నప్పటికీ నామాలు పెట్టుకుంటారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం అంటే ఇదే. ఇప్పుడు చెప్పండి, బిల్‌గేట్స్‌ను నానా మాటలూ అన్నవారికి ఆయనను విమర్శించే నైతిక అర్హత ఉందా? కల్తీ నెయ్యి అంశం రుజువైన తర్వాత కూడా బుకాయిస్తున్న ఈ ముఠాకు, ఎవరూ కోరకపోయినా బేషరతుగా క్షమాపణలు చెప్పిన బిల్‌ గేట్స్‌ను నిందించే నైతికత ఉందా? బిల్‌ గేట్స్‌ తిండికైన ఖర్చెంతో చెప్పాలని కోరడం ఏమిటి? ఆయన తిండికి లేక ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారా? ఇలాంటి విపరీత ధోరణులు వైసీపీకి మాత్రమే సొంతం. ఆ పార్టీ రాజకీయ ఎత్తుగడలు కూడా ఊహలకు అందనంత క్రూరంగా ఉంటాయి. తప్పు చేసినప్పుడు దాన్ని అంగీకరించడానికి ధైర్యం కావాలి. ఈ ధైర్యం ఉన్నందునే బిల్‌ గేట్స్‌ క్షమాపణలు చెప్పుకొన్నారు. ధైర్యం లేనందునే జగన్‌ అండ్‌ కో కల్తీ నెయ్యి విషయంలో ఎదురుదాడిని ఎంచుకున్నారు. ఎవరు ఏ దారిని ఎంచుకున్నా పాపం చేసిన వారిని ఆ దేవదేవుడే చూసుకుంటాడు.


చిచ్చు పెట్టే రాజకీయం...

ఈ విషయం అలా ఉంచితే, కూటమి విషయంలో జగన్‌ అండ్‌ కో ఎంచుకున్న తాజా ఎత్తుగడలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. విభజించు–పాలించు అన్న నాటి బ్రిటిష్‌ వాడి పన్నాగాలను ఇప్పుడు అమలు చేయ పూనుకున్నారు. కూటమి బలంగా ఉండటానికి కారకులని తాము భావిస్తున్న వారి మధ్య తంపులు పెట్టే పనులకు శ్రీకారం చుట్టారు. మొదటగా కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు ఫలించకపోవడంతో కూటమికి అండగా ఉంటున్న సామాజిక వర్గాలను దూరం చేసే ప్రయత్నాలు చేపట్టారు. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా నష్టపోయిన వారి కులాన్ని హైలెట్‌ చేస్తూ వచ్చారు. తమను బలపరిచే వర్గాల వారు అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడినప్పటికీ వారి కుల మతాలు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఎదుటివారిని మాత్రం ఎండగడుతున్నారు. ప్రజలను కూడా ఇలా కులాల వారీగా విడదీసి చూడటం ఆ పార్టీ సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. పవన్‌ కల్యాణ్‌ను బలహీనపరచేందుకు కాపులను ఆయనకు దూరం చేసే ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఇందుకోసం అంబటి రాంబాబును వాడుకుంటున్నారు. ఉన్నపళంగా ఆయనను కాపు నాయకుడ్ని చేశారు. పరామర్శల పేరిట కాపు నాయకులను ఆయన వద్దకు అదే పనిగా పంపుతున్నారు. ముద్రగడ పద్మనాభరెడ్డి వంటి వారు రంగంలోకి దిగారు. ఇలాంటి రాజకీయ ఎత్తుగడలను తప్పుపట్టాల్సిన పని కూడా లేదు. ఈ క్రమంలో వ్యక్తులు, వ్యవస్థల మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నాలు చేయడమే అభ్యంతరకరంగా ఉంది. చంద్రబాబుకు మద్దతుదారులు అని తాము భావిస్తున్న వారి మధ్య ఏ చిన్న అవకాశం వచ్చినా తంపులు పెట్టడానికి వ్యూహరచన చేయడమే ఆశ్చర్యంగా ఉంది. సంప్రదాయ రాజకీయాలకు అలవాటుపడిన వారికి ఇలాంటి ఆలోచనలు ఊహకు కూడా అందవు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వ్యవహారమే ఇందుకు నిదర్శనం. ఒక మహిళతో నాయుడు సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలు సామాజిక మాధ్యమాలలో ఉన్నట్టుండి ప్రత్యక్షమయ్యాయి. కల్తీ నెయ్యి వ్యవహారంతో సతమతమవుతున్న వైసీపీ నాయకులకు ఇది ఒక అందివచ్చిన అవకాశం. నాయుడికీ, ఆ మహిళకూ మధ్య ఎటువంటి సంబంధం ఉందో తెలియదు. అది వారి వ్యక్తిగతం. అయితే బీఆర్‌ నాయుడు ఇప్పుడు టీటీడీ చైర్మన్‌ కనుక నైతికత అనే అంశం తెరమీదకు వస్తుంది. కల్తీ నెయ్యి విషయంలో మమ్మల్ని అల్లరి చేసినందుకు ప్రతిగా ఇప్పుడు మిమ్మల్ని అల్లరి చేస్తాం అన్నట్టుగా వైసీపీ సోషల్‌ మీడియా రంగంలోకి దిగి బీఆర్‌ నాయుడిని అల్లరి చేసింది. టీటీడీ చైర్మన్‌ పదవిలో ఉండి ఉండకపోతే ఇది నాయుడి వ్యక్తిగత వ్యవహారంగానే ఉండిపోయేది. ఇప్పుడది కాస్తా పబ్లిక్‌ అయిపోయింది. ఎంతటి వారైనా కాంత దాసులే అన్న నానుడి ఊరకే రాలేదు. ప్రముఖులకు మహిళలతో అనైతిక సంబంధాలు కొత్త కూడా కాదు. భారత తొలి ప్రధాని నెహ్రూపై కూడా ఎన్నో వదంతులు వచ్చాయి.


రాజకీయాలలో కీలక పదవులలో ఉన్న వారిపై గతంలో కూడా ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ క్రమంలోనే బీఆర్‌ నాయుడు వ్యవహారం తెరమీదకు వచ్చింది. జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల రాసలీలలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నందున భాగస్వామ్య పార్టీలకు చెందిన వారి వ్యక్తిగత వ్యవహారాలు వెలుగులోకి రావడం సహజం. ఇద్దరు వ్యక్తుల మధ్య సాగేది వారి వ్యక్తిగత వ్యవహారం. ఈ క్రమంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినా, ఒత్తిడి చేసినా నేరం అవుతుంది.

ఇదీ నా నైజం...

బీఆర్‌ నాయుడుకు, ఆ మహిళకు మధ్య ఎటువంటి సంబంధం ఉన్నా అది వారి వ్యక్తిగతం అని భావించాలి. అయితే, చలామణిలో ఉన్న వీడియోలు, ఇతరత్రా అంశాలు ఆయన టీటీడీ చైర్మన్‌గా నియమితులు కాక ముందటివి కనుక నాయుడు మహాపరాధం చేశారని చెప్పడానికి లేదు. అయితే, వైసీపీ తన రాజకీయ వికృత క్రీడలో భాగంగా ఈ వ్యవహారంలోకి నన్ను కూడా లాగే ప్రయత్నం చేయడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. సదరు వీడియోలను నేనే సామాజిక మాధ్యమాలలో పెట్టించానని ప్రచారం చేయడం ద్వారా నాకూ నాయుడికీ మధ్య వైరం సృష్టించే ప్రయత్నం చేశారు. నాయుడికి టీటీడీ చైర్మన్‌ పదవి కట్టబెట్టడం నాకు ఇష్టం లేదని కూడా ప్రచారం చేశారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారి అజ్ఞానానికి జాలిపడటం మినహా ఏం చేయగలం? నేను ఏ రాజకీయ నాయకుడికీ సబార్డినేట్‌గా ఉండే వ్యక్తిని కాను. చంద్రబాబు లేదా మరొకరి దగ్గర నేను నేనుగానే, స్వతంత్రంగా ఉంటాను. అందుచేత టీటీడీ పదవి పొందిన బీఆర్‌ నాయుడిపై నాకు కోపం ఉండటానికి కారణమే లేదు. పదవి కోరుకోవడం ఆయన ఇష్టం. ఏ పదవీ ఆశించకపోవడం నా ఇష్టం. బీఆర్‌ నాయుడి విషయంలో ఎవరి ప్రమేయం ఉందో తెలియదుగానీ, వైసీపీ నాయకులకు ఒక అవకాశం అందివచ్చింది. కల్తీ నెయ్యి వివాదంలో చిక్కుకున్న ఆ పార్టీ ఈ అంశం అడ్డుపెట్టుకొని వైతరణి నదిని దాటే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. కుట్రలు, కుతంత్రాలు చేయడానికి నేను రాజకీయ నాయకుడిని కాను. నేను నమ్మిన అంశాన్ని నీళ్లు నమలకుండా నేరుగానే చెప్పేస్తా. నిన్నగాక మొన్న నైనీ కోల్‌ బ్లాక్‌ అంశంలో ఒక చానెల్‌ యజమానికి సంబంధం ఉందని నేరుగానే చెప్పాం కదా? ముసుగులో గుద్దులాట మా సంస్థ విధానం కాదు. అందుకే కదా కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది రాజకీయ నాయకులకు మేమంటే గిట్టదు.

3-kothapaluku.jpg


ఇప్పుడు వైసీపీ కుయుక్తుల విషయానికి వద్దాం! తమకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతుగా ఉంటున్న వారిని, సహకరిస్తున్న వారిని దూరం చేయడానికి జగన్‌ అండ్‌ కో సరికొత్త రాజకీయ క్రీడకు తెర లేపినందున తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూటమి నాయకులపైనే ఉంది. తప్పు చేసి దొరికిపోయినా కూడా బుకాయించగల నేర్పరితనం వైసీపీ సొంతం. ఈ క్రమంలోనే నెయ్యిని మాత్రమే కాదు మతాన్ని కూడా కల్తీ చేస్తున్నారు. ఊహలకు, అంచనాలకు అందని రాజకీయ ఎత్తుగడలకు పాల్పడుతున్న జగన్‌ అండ్‌ కో విషయంలో కూటమి నాయకులే కాదు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ సోషల్‌ మీడియాతో పాటు పేటీఎం బ్యాచ్‌ చేస్తున్న విష ప్రచారం బారిన పడకుండా కూటమి నాయకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేని పక్షంలో 2019కి పూర్వంవలె అసత్యాలే సత్యాలుగా ప్రచారంలోకి వస్తాయి. తస్మాత్‌ జాగ్రత్త! ఈ విషయం అలా ఉంచితే పశ్చిమ ఆసియా దేశాలలో యుద్ధ వాతావరణం కారణంగా చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడినందున రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుకు నెల రోజుల పాటు అనుమతిస్తున్నామని భారతదేశానికి వరం ఇస్తున్నట్టుగా అమెరికా ప్రకటించడం సగటు భారతీయుల మనసును చివుక్కుమనేలా చేస్తోంది. ఒక గణతంత్ర దేశాన్ని మరో దేశం ఇలా సామంత రాజ్యంగా మార్చుకోవడమేమిటి? అని బాధ కలుగుతోంది. ఆయుధ బలంతో విర్రవీగుతున్న అమెరికాకు ఇది తగదు. చలిచీమల చేత చిక్కి చచ్చును మహాసర్పం అన్నట్టుగా బాధిత దేశాలన్నీ ఏకమైన నాడు అమెరికా పరిస్థితి ఏమిటో ఆ దేశ ప్రజలు ఆలోచించుకోవాలి. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యవాద పాలకులనే ఎదిరించి నిలిచిన చరిత్ర భారతదేశం సొంతం అని అమెరికా గుర్తించడం ఆ దేశానికే మంచిది!

ఆర్కే

Updated Date - Mar 08 , 2026 | 01:56 AM