ఆపన్నులకు క్యారేజీ భోజనాలు
ABN , Publish Date - Mar 08 , 2026 | 10:27 AM
కోడలు భోజనం పెడితే మరో నాలుగేళ్లు బ్రతికేది... కొడుకు బాగా చూసుకుంటే తండ్రి కొన్నాళ్లు జీవించేవాడు.... ఇలాంటి మాటలు అతడి మనసులో గాఢమైన ముద్ర వేశాయి.
కోడలు భోజనం పెడితే మరో నాలుగేళ్లు బ్రతికేది... కొడుకు బాగా చూసుకుంటే తండ్రి కొన్నాళ్లు జీవించేవాడు.... ఇలాంటి మాటలు అతడి మనసులో గాఢమైన ముద్ర వేశాయి. సమాజానికి ఏదో చేయాలన్న తపన మొదలైంది. ఒంటరిగా ఉన్న వాళ్లకు ప్రతీరోజూ భోజనం పెట్టాలనుకున్నాడు. అవసరమైన వారిని గుర్తించి... వారికి క్యారేజీలో భోజనాలు పంపడం ప్రారంభించాడు. 2018లో మొదలైన ఈ భోజనాల యజ్ఞాన్ని చేస్తోంది మల్లా రాంబాబు అనే ఓ సామాన్యుడు.
వీరవాసరం, పెనుమంట్ర మండలాల్లోని 18 గ్రామాల్లో భోజనం అవసరం ఉన్నవారు నిశ్చింతగా ఉంటారు. ఎందుకంటే ఈ ఆపన్నులకు సమయానికి రోజుకు రెండు పూటలా ‘రాంబాబు క్యారేజీ’ అందుతుంది. వారి ఆకలిని తీరుస్తుంది. వయసుతో నిమిత్తం లేదు... ధనంతో సంబంధం లేదు... వండుకో వడానికి ఓపికలేని వారికి, అవసరమనుకున్న వారికి భోజనం క్యారేజీ అందుతుంది. ఒక్కో వ్యక్తి కోసం రెండు క్యారియర్‌లు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకే ఆహారం సిద్ధమవుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలలోపు 18 గ్రామాల్లోనూ 180 మందికి క్యారియర్ (రెండు పూటలకు సరిపోయేలా) అందజేసే ప్రక్రియ పూర్తయిపోతుంది. రెండు కప్పుల్లో అన్నం, ఒక కప్పులో కూర పెడతారు. మరో ప్రత్యేక బాక్స్‌లో రసం, సాంబారు, మజ్జిగ పులుసులో ఏదో ఒకటి ఉంటుంది. వీటిని అందించి ముందురోజు ఇచ్చిన ఖాళీ క్యారియర్, బాక్స్‌ను తీసుకుంటారు.
రోజుకు రూ.12 వేలు...
మొదట్లో ఎక్కువ మందికి భోజనం పంపే వారు. అది కాస్త గ్రామాల్లో చర్చ అయ్యింది. తమ తల్లికో లేదా తండ్రికో రాంబాబు క్యారేజీ వస్తుందని తెలిసిన తర్వాత... వారి కుమారుల్లో కాస్త బిడియం ఏర్పడింది. అన్నీ ఉన్నా సరే తల్లిదండ్రులను చూసుకోలేకపోవడం వల్లే బయట క్యారియర్ వస్తోందంటూ వారిలో ఆలోచన మొదలైంది. ఇక క్యారియర్ వద్దని, తామే తల్లిదండ్రులకు భోజనాలు ఏర్పాటు చేసుకోవడం మొదలెట్టారు. దాంతో క్యారియర్‌లు తగ్గాయి. ‘ఇది ఊహించని మార్పు’ అంటారు రాంబాబు.
మల్లా రాంబాబుకు వీరవాసరంలో తులసీ కన్వెన్షన్ హాల్ ఉంది. అదే అతడికి ఆదాయ వనరు. అక్కడే వంటకు అవసరమైన సామగ్రి ఉంది. రాంబాబుకు వంటలంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి. ప్రతీరోజూ ఇంటి నుంచి అక్కడికి వచ్చి కూర వండి వెళుతుంటాడు. వంటవాళ్లు సెలవుపెడితే భార్యతో కలిసి వంట చేసి, క్యారేజీలు సర్దుతారు. వాటిని ఆటోలోకి ఎక్కించి పంపుతారు. మెనూలో వారానికి రెండు రోజులు నాన్‌వెజ్ ఉంటుంది. ప్రతీ ఆది, బుధవారాల్లో నాన్‌వెజ్ కర్రీతో భోజనం ఉంటుంది. సోమ, శనివారాల్లో కూరగాయలతో కలిపి వండిన పప్పు, మరో మూడు రోజులు కూరగాయల భోజనం ఉంటుంది. వంట సామగ్రి. బియ్యం, కూరగాయలు, ఇతర సరుకులకు కలిపి రోజుకు రూ. 12 వేలు ఖర్చు వస్తుంది. ఆ విధంగా ఏడాదికి రూ. 36 లక్షల వరకు వెచ్చిస్తుంటారు.
విరాళాలు తీసుకోరు...
రాంబాబు విశిష్ట సేవలను తెలుసుకున్న ఎంతోమంది దాతలు విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయితే రాంబాబు సున్నితంగా తిరస్కరించాడు. చాలామంది పుట్టిన రోజులు, ఇతర శుభ కార్యాలయాలకు ఒక రోజు భోజనం పెడతామని ముందు కొస్తుంటారు. వారి కోరికనూ సున్నితంగా తిరస్కరించి నిరంతరాయంగా రాంబాబు తన కార్యాన్ని కొనసాగిస్తున్నాడు. సేవ అనేది తన సొంతమేగానీ, దానిని పేరు కోసమో, ప్రతిష్టల కోసమో కమర్షియల్ చేయలేనంటాడు.
కలెక్టర్ చెప్పారని...
రాంబాబు క్యారేజీ భోజనాల గురించి విని జిల్లా కలెక్టర్ ఒకరోజు అక్కడకు వెళ్లారు. అతడి సేవలకు ముగ్ధులయ్యారు. ప్రతీ వారం కలెక్టరేట్‌కు తమ సమస్యలను చెప్పుకోవ డానికి వృద్ధులు వస్తుంటారు. అక్కడ ఏమీ దొరకదు. వినతిపత్రం ఇచ్చేసరికి ఏ సాయం త్రమో అవుతుంది. అటువంటి వారికోసం ప్రతీ సోమవారం భోజనాలు ఏర్పాటు చేయాలని రాంబాబును స్వయంగా జిల్లా కలెక్టర్ కోరారు. ఆమె మాటతో గడచిన కొన్ని నెలలుగా ప్రతీ వారం రెండు వందల మందికి సరిపడా భోజనాలను కలెక్టరేట్‌కు పంపుతున్నారు.
డొక్కా సీతమ్మ అక్షయపాత్ర
క్యారేజీ భోజనాలతో పాటు... శుభ కార్యాలు, దిన కార్యాల్లో ఆహార పదార్థాలు మిగిలిపోతే వాటిని వృథా కాకుండా ‘డొక్కా సీతమ్మ అక్షయపాత్ర’ను నడుపుతున్నాడు రాంబాబు. ఆహారం మిగిలిందని ఎవరైనా ఫోన్ చేస్తే... గంట వ్యవధిలోనే అక్కడకు వాహనం వెళుతుంది. సమీపంలో ఉన్న స్లమ్స్‌కు వెళ్లి వాటిని కావాల్సినవారికి అందిస్తారు. గడచిన మూడు నెలలుగా దీనిని అమలు చేస్తున్నారు. ఆహారం వృథా కాకుండా ఎంతో మందికి భోజనాలు పెట్టే డొక్కా సీతమ్మ అక్షయపాత్ర కూడా విజయవంతంగా నడుస్తోంది. భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం, పాలకొల్లు తదితర ప్రాంతాల నుంచి ఫోన్‌లు వస్తుంటాయి. మిగిలిపోయిన ఆహారాన్ని ఇతరులకు వడ్డించేలా డొక్కా సీతమ్మ అక్షయపాత్ర వాహనాన్ని వినియోగిస్తున్నారు.
- రొక్కం కిశోర్, భీమవరం
ఫొటోలు: చందన వెంకట బాపూజీ
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News