Share News

ఆరోగ్య బీమా రంగంలో డిజిటల్‌ విప్లవం

ABN , Publish Date - Mar 08 , 2026 | 06:19 AM

ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల పరిష్కారంలో పారదర్శకతను పెంచేందుకు, సాంకేతిక గందరగోళాన్ని తొలగించేందుకు డిజిటల్‌ చట్టం ఒక కొత్త ప్రమాణంగా నిలుస్తుందని నేషనల్‌ హెల్త్‌ అథారిటీ...

ఆరోగ్య బీమా రంగంలో డిజిటల్‌ విప్లవం

  • క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌కు ఇక కొత్త ప్రమాణాలు

  • ఎన్‌హెచ్‌ఏ సీఈవో డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ బర్న్వాల్‌

కంది, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల పరిష్కారంలో పారదర్శకతను పెంచేందుకు, సాంకేతిక గందరగోళాన్ని తొలగించేందుకు డిజిటల్‌ చట్టం ఒక కొత్త ప్రమాణంగా నిలుస్తుందని నేషనల్‌ హెల్త్‌ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) సీఈవో డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ బర్న్వాల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- హైదరాబాద్‌ (ఐఐటీహెచ్‌)లో ‘నేషనల్‌ హెల్త్‌ క్లెయిమ్‌ ఎక్స్‌ఛేంజ్‌’ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన హెల్త్‌ క్లెయిమ్‌ హ్యాకథాన్‌ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్‌ డీన్‌ జి. నరహరిశాస్త్రి, ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌, ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ ప్రతినిధి గిరిధర్‌ జ్ఞానీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ కింద బీమా సంస్థలు, ఆస్పత్రులు, హెల్త్‌టెక్‌ స్టార్ట ప్‌ల మధ్య సమన్వయం పెంచడమే ఈ హ్యాకథాన్‌ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. క్లెయిమ్‌ ప్రాసెసింగ్‌ సమయం, ఖర్చు తగ్గించేలా వినూత్న సాఫ్ట్‌వేర్‌ పరిష్కారాలను అన్వేషించాలన్నారు. తెలంగాణ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ అమలులో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని సునీల్‌ కుమార్‌ కొనియాడారు.


ఆకట్టుకున్న హెల్త్‌కేర్‌ ప్రదర్శనలు

హ్యకథాన్‌లో ప్రదర్శించిన పలు హెల్త్‌కేర్‌ పరికరాలు పలువురిని ఆకర్షించాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌ ఖర్చు సామాన్యులకు భారంగా మారుతున్న తరుణంలో ‘ఏరోబేసిస్‌’ సంస్థ కేవలం రూ.2 లక్షలకే ‘జీవన్‌లైట్‌’ పేరుతో స్వదేశీ పోర్టబుల్‌ వెంటిలేటర్‌ను రూపొందించింది. దీనిని ఇంట్లోనే వాడుకోవచ్చని, మొబైల్‌ యాప్‌ ద్వారా రోగి పల్స్‌రేటు, రక్తపోటును పర్యవేక్షించవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం ఈ మిషిన్‌ పాండిచ్చేరిలో అందుబాటులో ఉందని, త్వరలోనే మార్కెట్‌లో ప్రవేశపెడుతామని చెప్పారు. ఈ హ్యకథాన్‌లో విజేతలకు ఎన్‌హెచ్‌ఏ సీఈవో సునీల్‌ కుమార్‌ బర్న్వాల్‌ ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు.

Updated Date - Mar 08 , 2026 | 06:19 AM