Share News

సాగు యాంత్రీకరణ సబ్సిడీ రైతుల ఖాతాల్లోకే..

ABN , Publish Date - Mar 08 , 2026 | 05:56 AM

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన సబ్సిడీ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసే విధానాన్ని అమలు..

సాగు యాంత్రీకరణ సబ్సిడీ రైతుల ఖాతాల్లోకే..

  • రైతు వేదికలపై సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటు: తుమ్మల

హైదరాబాద్‌, మార్చి 7(ఆంధ్రజ్యోతి): వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన సబ్సిడీ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసే విధానాన్ని అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన విధివిధానాలను రూపొందించాలని సూచించారు. హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రానున్న ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో రైతులకు సబ్సిడీపై అందించే పచ్చిరొట్ట విత్తనాలను వచ్చే ఏప్రిల్‌ నెలాఖరుకు సిద్ధంగా ఉంచుకోవాలని, ఈ మేరకు ఏర్పాట్లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికలలో సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని, ఇందుకు రెడ్కో సంస్థ సహకారం తీసుకోవాలని సూచించారు. రానున్న ఖరీఫ్‌ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి అవసరమైన ఎరువులను ముందుగానే తెప్పించి నిల్వ ఉంచేందుకు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలన్నారు. ఖరీఫ్‌-2026 సీజన్‌కు రాష్ట్రానికి 11.50 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు.

Updated Date - Mar 08 , 2026 | 05:58 AM