సర్వం.. కల్తీ మయం!
ABN , Publish Date - Mar 08 , 2026 | 06:37 AM
రోజూ నిద్రలేవగానే ఉదయం తీసుకునే పాలు, టీ తయారీకి వాడే టీ పొడి కల్తీ..! వంటల్లో తప్పనిసరిగా వాడే నూనెలు, కారం పొడి, పసుపు కల్తీ..!
నిత్యావసరాలకు ‘నకిలీ’ చీడ
10 శాతం వంట నూనెలలో కల్తీ
కారం పొడిలోకి సూడాన్ రంగు, ఇటుక పొడి
పసుపులోకి బొప్పాయి పిండి, మిశ్రమాలు
పాలు, టీ పొడిలోనూ కల్తీ
మిరియాలలోకి బొప్పాయి గింజలు
కిడ్నీ వ్యాధులు, గుండెపోటు, పక్షవాతం,క్యాన్సర్, చర్మసమస్యలు వచ్చే ప్రమాదం
లైసెన్సు లేకుండా జోరుగా విక్రయాలు
తూతూ మంత్రంగా అధికారుల తనిఖీలు
(విజయవాడ/అమరావతి-ఆంధ్రజ్యోతి)
రోజూ నిద్రలేవగానే ఉదయం తీసుకునే పాలు, టీ తయారీకి వాడే టీ పొడి కల్తీ..! వంటల్లో తప్పనిసరిగా వాడే నూనెలు, కారం పొడి, పసుపు కల్తీ..! నెయ్యి, మాంసం కల్తీ..! అంతేనా.. కూరగాయలు, పండ్లు కలుషితం..! సర్వం కలుషితం, కల్తీ మయం..! టిఫిన్ సెంటర్లలో తాగే టీ, తినే ఇడ్లీ, దోసె, పూరీతో సహా అన్నీ కల్తీ. పచారీ షాపులలో లభించే నిత్యావసరాలలో డిమాండ్ ఉన్నవన్నీ కల్తీ. వంటలు, చిట్కా వైద్యం కోసం ఉపయోగించే మిరియాల గింజలలో బొప్పాయి గింజల కల్తీ. బలవర ్థక ఆహారంగా భావించే తేనె లో చక్కెర పాకం కల్తీ. అన్నింటా కల్తీయే రాజ్యమేలుతోంది. ఏది అసలైనదో, ఏది నకిలీదో తెలియని పరిస్థితి. కొందరు అక్రమార్కులు, వ్యాపారులు కల్తీ వ్యాపారంతో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. కల్తీ వస్తువులు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. విషపూరిత రంగులు, రసాయనాలను కలపడంతో చర్మ సమస్యలు, గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ముంచుకొస్తోంది. రాష్ట్రంలో వెలుగు చూసిన కల్తీ పాల ఘటనతో ఇప్పుడు ఏది అసలో, ఏది నకిలీనో అని భయపడాల్సిన పరిస్థితి. దైనందిన జీవితంలో మనం ఉపయోగించేవి ఎలా కల్తీ అవుతున్నాయో తెలుసుకుందాం.
కారం
వంటలలో తప్పనిసరిగా వాడే కారాన్ని లాభాల కోసం చాలా సులువుగా కల్తీ చేస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఎండుమిర్చి నుంచి నూనె తీసే పరిశ్రమలు ఉన్నాయి. కొందరు వ్యాపారులు నూనె తీసిన తర్వాత వచ్చే మిర్చి పిప్పిని కొనుగోలు చేసి ఎండబెట్టి, దానికి సూడాన్ రంగు కలిపి, దంచి కారంగా విక్రయించిన సంఘటనలు ఉన్నాయి. పిప్పి అనేది వ్యర్థం. దీనికి రంగు కోసం సూడాన్ కెమికల్ కలపటం వల్ల కారం లాగా కనిపిస్తుంది. గుంటూరు జిల్లాలో ఈ తరహా భారీ మోసం గతంలో వెలుగు చూసింది. అలాగే నాసిరకం మిరపకాయలను వాటి తొడెమలను తీయకుండానే మిల్లు పట్టి దానిలో రంగు కలిపి ఏ-1 రకంగా మార్కెట్‌లోకి వదులుతున్నారు. తొడెమలు తీసిన కాయలతో తయారు చేసిన కారాన్ని మాత్రమే మార్కెట్‌లోకి విడుదల చేయాలి. తొడెమలలో హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు జరిపిన సందర్భాలలో తొడెమలు తీయకుండా ఆడిన కారాన్ని గుర్తించలేకపోతున్నారు. కారంలో వాడిన సూడాన్ రంగు భ్రమింపచేస్తుంది. కల్తీ గుర్తించలేని పరిస్థితి. సూడాన్ రంగు అనేది కేన్సర్ కారకం. ఫుడ్ సేఫ్టీ అధికారులు కారం ప్యాకెట్లను పరీక్షలకు పంపిన సందర్భాలలో దీనిని గుర్తించి ఆ రంగును బ్యాన్ చేశారు. చీప్‌గా ఇటుక పొడి, ఊక వంటివి కూడా వాడి రంగు కలుపుతున్నారు.
ఎలా గుర్తించాలంటే..
గ్లాస్ నీటిలో కారం పొడి వేసి చూడాలి. ఇటుకపొడి ఉంటే కిందకు పోతుంది. నీరు గాఢ ఎరుపుగా మారితే కల్తీ జరిగినట్టే.
చేతిలో కారం పొడి వేసి రుద్దితే.. గట్టిగా అనిపిస్తే ఇటుక పొడి కలిసినట్టే.
నూనెలో కారం వేసి చూడాలి. ప్రకాశవంతమైన ఎరుపురంగు వస్తే అందులో క్యాన్సర్ కారక సుడాన్ రెడ్ కలర్ కలిపినట్లుగా గుర్తించవచ్చు.
టీ పొడి
కొబ్బరి పీచు పొడిలో రంగులు కలిపి టీ పొడిని తయారు చేస్తున్న ఉదంతాలు ఉన్నాయి. ఒరిజినల్ టీ పొడిలో 30 శాతం కొబ్బరి పీచుతో తయారు చేసిన పొడిని కలిపి మార్కెట్‌లోకి వదులుతున్నారు. వాడిపోయిన టీ ఆకులను మళ్లీ ఎండబెట్టి టీ పొడిలా చేసి మళ్లీ హోటళ్లకు అమ్ముతున్నారు. టీ త్వరగా గాఢంగా కనిపించేందుకు ఆర్టిఫిషియల్ కలర్స్ కలుపుతున్నారు. టీ పొడి తూకం పెంచేందుకు ఇనుప పొడిని కలుపుతున్నారు. చౌకగా లభించే ఆకులతోనూ కల్తీ చేస్తున్నారు.
ఎలా గుర్తించాలంటే..
చల్లని నీటిలో టీ పొడి వేయండి. వెంటనే రంగు వస్తే కల్తీ జరిగినట్లు భావించాలి. స్వచ్ఛమైన టీ పొడి నెమ్మదిగా రంగు ఇస్తుంది.
తెల్లకాగితం మీద టీ పొడి వేసి తడి చేసినపుడు అసహజమైన గాఢ రంగు మరక పడితే కెమికల్ కలిసినట్లు గుర్తించాలి.
వంట నూనెలు
బ్రాండెడ్ కంపెనీలు కాకుండా అన్ బ్రాండెండ్ ప్యాకెట్లతో తక్కువ ధరకు లభించే నూనెలు కల్తీతో కూడుకుని ఉంటున్నాయి. నూనెలలో కల్తీ జరుగుతోందని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) సర్వేలో తేలింది. 10 శాతం పైగా నూనెల నమూనాలలో నాణ్యత లోపించినట్టు నివేదికలో పేర్కొనడం కల్తీకి అద ్దం పడుతోంది. లూజుగా విక్రయించే నూనెలు, బ్రాండెడ్ కానీ నూనె ప్యాకెట్లలో ప్రధానంగా ట్రై ఆర్థో క్రెసిల్ ఫాస్పేట్ అనే విషపూరిత రసాయనాన్ని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల గుండెపోటు, నాడీ వ్యవస్థ దెబ్బతినడం, పక్షవాతానికి గురి కావడం వంటి ప్రమాదాలు ఉన్నాయి. చౌకగా లభించే నూనెల మిశ్రమంలో రసాయనాలు కలుపుతున్నారు.
పసుపు
పసుపులో బొప్పాయి పిండిని కలుపుతున్నారన్న విషయాన్ని ఇటీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. బియ్యపు పిండి, చాక్ పౌడర్, మైదా, లీడ్ క్రోమెట్, మెటాలిన్ ఎల్లో వంటివి కలిపి కల్తీ చేస్తున్నారు. ఒరిజినల్ పసుపులో వివిధ రకాల వస్తువులు బరువు, రంగు కోసం కలిపి దానిని ఒరిజినల్ పసుపులా అమ్మేస్తున్నారు. ఎంతో హానికరమైన రంగులు కలిపిన పసుపును దీర్ఘకాలం వాడితే కాలేయం, కిడ్నీలకు హాని కలుగుతుంది.
ఎలా గుర్తించాలంటే..
గ్లాసు నీటిలో పసుపు పొడి వేయాలి. నిజమైన పసుపు నెమ్మదిగా కిందకు చేరుకుంటుంది. నీరు వెంటనే పసుపు రంగులోకి మారితే కల్తీ అని గుర్తించాలి.
ఏదైనా జరిగితేనే హడావుడి
ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా చూడాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు మార్కెట్లో విక్రయించే ప్రతి ఆహార ఉత్పత్తిని తనిఖీ చేసి లైసెన్స్ ఇవ్వాలి. సగానికి పైగా ఉత్పత్తులు అలాంటి అనుమతి లేకుండానే మార్కెట్లోకి వస్తున్నాయి. ఆహార కల్తీ నిరోధానికి వంట నూనెల నియంత్రణ చట్టం, ఆహార కల్తీ నిరోధక చట్టం, పాల ఉత్పత్తుల నియంత్రణ చట్టం, ఆహార భద్రతా ప్రమాణాల చట్టం వంటివి ఉన్నాయి. అవేవీ క్షేత్రస్థాయిలో సరిగా అమలు కాకపోవడమే అతిపెద్ద సమస్య. గతేడాది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆహార భద్రతా ప్రమాణాల సూచీలో ఏపీ 28వ స్థానంలో ఉంది. ఆసుపత్రి పాలవుతున్న వారిలో 20 శాతం మంది కల్తీ ఆహారం తినడంతోనే అని తేలింది. కల్తీ ఆహారం తిని ఏదైనా ఘటన జరిగినప్పుడు ఆహార తనిఖీ అధికారులు హడావుడి చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల తర్వాత పట్టించుకోవడంలేదు. దీంతో కల్తీ చేసిన వారికి శిక్షలు పడటం లేదు. కల్తీ పదార్థాలు తిని ప్రజలు రోగాల బారినపడుతున్నారు. ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించిన కల్తీ ఆహారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ఆహార భద్రతా విభాగంలో ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలి. ప్రమాణాలతో కూడిన పరీక్షా కేంద్రాలు నెలకొల్పాలి. కల్తీ రాయుళ్లకు కఠిన శిక్షలు, భారీ జరిమానాలు విధిస్తేనే కల్తీకి కొంతైనా అడ్డుకట్ట వేయవచ్చు.
కల్తీకి కఠిన శిక్షలు
కల్తీ రాయుళ్లను కట్టడి చేసేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ)తో పాటు నియంత్రణ, నిరోధక చట్టాలున్నాయి. నిషిద్ధ, కల్తీ ఆహారాలు ఉత్పత్తి చేస్తూ.. విక్రయిస్తూ పట్టుబడితే ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ యాక్ట్ 2006 ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. నేరారోపణపై జరిమానా, శిక్ష.. ఒక్కోసారి రెండూ విధించే అవకాశం ఉంది. కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయ దారులకు రూ.లక్ష వరకూ జరిమానా విధించవచ్చు. నేర తీవ్రతను బట్టి ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకూ శిక్షలు విధిస్తారు. కల్తీ ఆహారం తిన్న వ్యక్తి మరణిస్తే, కల్తీ చేసిన వ్యక్తికి పదేళ్ల నుంచి జీవిత ఖైదు వరకూ శిక్ష పడే అవకాశం ఉంది.