Sankranti Cockfights 2026: సంక్రాంతి సంప్రదాయం పేరుతో కోడి పందేలు.. కోట్ల వ్యాపారంగా బరులు..
ABN , Publish Date - Jan 11 , 2026 | 07:27 AM
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లో కోడి పందేలకు బరులు సిద్ధం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో శ్రీనివాసపురం, లక్కవరం, కేతవరం, ఎ.పోలవరం, తాడువాయి, పేరంపేట గ్రామాల్లో పందెం బరులకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు..
జోరుగా కోడి పందేలు, గుండాట..
కోడి పందేలకు బరులు సిద్ధం..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడి పందేలు, గుండాట జూదం వంటి క్రీడలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ పండుగ సంప్రదాయ క్రీడలు నిర్వహించే పేరుతో నేలను చదును చేసి అసలైన పండుగ రోజుల్లో ప్రతి ఏడాది మాదిరిగానే కోడి పందేలు నిర్వహించేందుకు బరుల వద్ద అత్యంత ఆకర్షణీయంగా, లగ్జరీ వసతులతో ప్రత్యేక గ్యాలరీలు, కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చిరిస్తుండగా.. మరోవైపు పండుగ రోజుల్లో యథావిధిగా పందేలు జరుపుతామని దీమాతో నిర్వాహకులు ఉన్నారు.
జంగారెడ్డిగూడెం/కాళ్ల/తణుకు రూరల్/ఆకివీడు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లో కోడి పందేలకు బరులను (Sankranti Cockfights) సిద్ధం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో శ్రీనివాసపురం, లక్కవరం, కేతవరం, ఎ.పోలవరం, తాడువాయి, పేరంపేట గ్రామాల్లో పందెం బరులకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీనివాసపురంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ నుంచి కొంతమంది పందేలు వేయడానికి వస్తుండడంతో భారీగానే జరుగుతాయని రూ. లక్షల రూపాయల్లో పందేలు, గుండాటలు సాగుతాయని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో స్టాల్స్ పెట్టుకునేందుకు వేల రూపాయలు ఆడ్వాన్స్‌గా నిర్వాహకులకు అందజేస్తున్నట్లు తెలిసింది. జంగారెడ్డి గూడెం పట్టణంలో ప్రతి ఏడాదీ టీడీపీ, వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో వేర్వేరుగా బరులు సిద్ధం చేసేవారు. టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే స్థలంలో ఇటీవల దేవస్థానం అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకుని వేరే వారికి లీజుకు ఇవ్వడంతో అక్కడ బరులు వేసే పరిస్థితి లేదు. ఈ ఏడాది దగ్గరలోనే మరో స్థలంలో బరులు సిద్ధం చేసేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు..
కాళ్ల మండలంలో వేసే కోడి పందేలను తిలకించేందుకు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు. ఇందులో భాగంగా గ్రామాల్లో ఇప్పటికే పెద్ద మైదానాలు ఎక్సకవేటర్‌తో చదును చేస్తూ రోలర్‌తో అందంగా తీర్చిదిద్దుతున్నారు. కొన్నిచోట్ల భారీ ఇనుప ఫెన్సింగ్‌లతో బారికేడ్లు, స్టేజ్‌ల నిర్మాణం జరుగుతోంది. తణుకు మండలంలో ప్రధానంగా వేల్పూరు, తేతలి, పైడిపర్రు, దువ్వ మండపాక గ్రామాల్లో పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేల్పూరులో-2, తేతలి-2, పైడిపర్రు-2 చొప్పున బరులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో జాతీయ రహదారి పక్కన ఉన్న బరులు ఎక్కువ రద్దీగా ఉంటాయి. ఆకివీడు పట్టణ పరిధి భారీ స్థాయిలో రెండుచోట్ల బరులు ఏర్పాటు చేస్తున్నారు. పందెం రాయుళ్లు ఇప్పటికే లాడ్జీలు అడ్వాన్స్ చెల్లించి బుకింగ్ చేసుకున్నారని సమాచారం.
ఎగబడుతున్న గుండాట, ఇతర ఆటలు
బరుల కోసం విజయవాడ వాసుల బేరాలు
నిర్వాహకులకు కాసుల వర్షం
బరి వ్యాపారం.. బాగుంది
భీమవరంరూరల్, జనవరి10 ఆంధ్రజ్యోతి): సంక్రాంతి కోడి పందేల బరులకు మంచి వ్యాపారంగా మారింది. బయట ప్రాంతాల వారు బరులకు ధర నిర్ణయించి.. వారి ఆధీనంలోకి తీసుకునే విధానం ఎంచుకున్నారు. ఈ మేరకు నిర్వాహకులకు కాసుల వర్షం కురుస్తోంది. బరి ఏర్పాటు చేసి కోడి పందేలు ఒక్కటి మాత్రమే నిర్వాహకుడు చేతిలో ఉంచుకుంటారు. మిగిలిన గుండాట వంటివి బయటి ప్రాంతాల వారి ఆధీనంలోకి ఇస్తున్నారు. చిన్నబరులకు రూ.12 లక్షలు, పెద్ద బరులకు రూ.30 లక్షలు పైగా ఇచ్చేందుకు విజయవాడ నుంచి వచ్చినవారు ఆసక్తి చూపుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఏడాదికంటే బరుల సంఖ్య పెరుగుతోంది. కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయి.
బరుల ఏర్పాటుకు ప్రచారం..
సంక్రాంతి కోడి పందేల బరులు వేసే నిర్వాహకులు అదే పంథాలో వెళ్తున్నారు. ముందుగా క్రీడలు నిర్వహించి సమయానికి కోడి పందేలు అందుబాటులోకి తేనున్నారు. ఈసారి బరుల ఏర్పాటు మరింత ఆకర్షణగా చేస్తున్నారు. గతంలో లాగా జిల్లాలో నాలుగు, ఐదు చోట్ల కాకుండా.. ప్రతి మండలంలో ఒకటి, రెండు పెద్ద బరులు వీఐపీ గ్యాలరీలు, స్టేజ్‌లతో ఏర్పాటవుతున్నాయి. బరులు అందంగా ఏర్పాటు చేసేందుకు లక్షల రూపాయలు ఖర్చుపెడుతున్నారు. కొన్ని చోట్ల చుట్టాలు, ఇతర ప్రాంత వాసులను ఆకట్టుకునేలా భీమవరం ప్రాంతంలో సంక్రాంతి సంస్కృతి తెలిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వాటిని తెలిపేందుకు గ్రామాల్లో మైక్ ప్రచారం చేస్తున్నారు. వీరవాసరంలో క్రీడాపోటీలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. తదుపరి అవే కోడి బరులుగా మారతాయి. ఈవిధంగా అన్ని ప్రాంతాల్లో సంక్రాంతి హడావుడి కోడి పందేల బరుల రూపంలో కనిపిస్తోంది.
అధికారుల నిఘా తుస్..
సంక్రాంతి సమయంలో గ్రామాల్లో కోడి పందేలు వేయరాదని అధికారులు ప్రచారం చేసేవారు. కోడి పందేల నిషేధం అని బ్యానర్లు పెట్టేవారు. అలాంటిది ఎక్కడా కనిపించడం లేదు. గ్రామాల్లో బరులు ఏర్పాటుకు నేల చదును, బరుల దిబ్బలపై ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. జిల్లా యంత్రాంగం మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెబుతున్నా దిగువస్థాయి అధికారుల నిఘా కరువైంది.
ఆన్‌లైన్‌లో పందెం కోళ్ల విక్రయం..
గణపవరం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగకు పందెం కోళ్లు సిద్ధమవుతున్నాయి. కోళ్ల పందెం అనగానే గుర్తొచ్చే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాతో పాటూ గణపవరం మండలం జాబితాలో ఇటీవల చేరింది. గత ఏడాది ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోనే బదులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాను వాడుకుంటున్న పందెంరాయుళ్లు ఆన్‌లైన్‌లో విక్రయాలకు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. పందెం పుంజులకు నిర్వాహకులు.. బలవర్ధక ఆహారం ఇవ్వడంతో పాటూ ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం గణపవరం మండలంలో గణపవరం, అర్థవరం, పిప్పర జల్లికాకినాడ, కేశవరం, తదితర గ్రామాల్లో పుంజులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తున్నారు. వాటిని ఆన్‌లైన్‌లో రూ.10 వేల నుంచి రూ.లక్షవరకు విక్రయిస్తున్నారు.
కోడి పందేల నిర్వహణపై ఉత్కంఠ!
బరుల వద్ద గుండాట, పేకాట శిబిరాలకు భారీ డిమాండ్
అడ్వాన్స్‌లు చెల్లించేందుకు నిర్వాహకుల ఆసక్తి
జంగారెడ్డిగూడెం రూరల్/ తణుకు రూరల్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ అంటే ఉభయగోదావరి జిల్లాల్లో గుర్తుకు వచ్చేవి కోడి పందేలు, పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా. కోర్టులు హెచ్చరికలు జారీ చేసినా.. ప్రతి ఏడాదీ పండుగ ముసుగులో పందేల బరుల్లో కోడి పుంజులు రక్తం చిందిస్తూనే ఉంటాయి. ఈ ఏడాది సైతం పందేలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడెక్కడ పందేల బరులు ఏర్పాటు చేస్తారు..? అనే అంశాలపై ఇప్పటి నుంచే అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం పందేలు జరగనివ్వమని చెబుతున్నప్పటికీ ఇవన్నీ 'షరా మామూలే' అనే భావన పందేల నిర్వాహకుల్లో ఉంది.
మూడు నెలల ముందునుంచే అడ్వాన్స్‌లు..
కోడి పందేలకు ఆవసరమైన స్థలం ఎంపికతో పాటు పందేలను కాసే మరో గ్రూపును, కోడికి కత్తులు కట్టే వారిని, బరిలో కోతాట, గుండాట ఆడించే వారికి మూడు నెలల ముందుగానే ముందస్తు చెల్లింపులు జరిగినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. గ్రామాల్లో కోడి పందేలకు అనువైన స్థలం మూడు రోజులకు అద్దె నిమిత్తం ఒక్కొక్కరికి రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఒక్క స్థలానికే ముందస్తుగా చెల్లించినట్లు తెలిసింది. వీటితో పాటు ఒక్కో బరిలో టెంట్, షామియానా. లైటింగ్ కోసం రూ.4లక్షల నుంచి రూ.8 లక్షల వరకు చెల్లింపుల అంగీకారం కుదుర్చుకున్నారు. బరి వద్ద గస్తీ నిర్వహించేందుకు ప్రైవేట్ గార్డులకు రూ.లక్ష వరకు చెల్లింపులు జరిగినట్టు తెలిసింది. పందెం బరుల వద్ద గుండాట, పేకాట వంటి జూద క్రీడలు నిర్వహించేందుకు.. మూడు నెలల ముందునుంచే నిర్వాహకులకు గుండాట పెట్టే వారు రూ.లక్ష నుంచి రూ.లక్షల వరకు చెల్లిస్తున్నారని సమాచారం.
సార్ మాకు అవకాశం ఇవ్వండి..!
'సార్ మొదటి నుంచి మీ వెనుకే మేము ఉన్నాము. మనందరం ఒక్కటే. గతేడాది నష్టం వచ్చింది. ఈ ఏడాది మీ పందేల బరి వద్ద కోతాట, పేకాట, గుండాట శిబిరాలకు అవకాశం ఇవ్వండి' మహా ప్రభూ అంటూ ఇప్పటికే జూద క్రీడల నిర్వాహకులు పందెం బరుల నిర్వాహకులు, ముఖ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అడ్వాన్స్‌లు చెల్లిస్తున్నట్టు సమాచారం.
కోడి పందేలు నిర్వహిస్తే చర్యలు..
కోడి పందేలను అడ్డుకుని తీరుతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే గతంలో పందేలు నిర్వహించిన వారిపై, కత్తికట్టే వారిపై బైండోవర్ కేసులను నమోదు చేస్తున్నారు. గతంలో పందేలు నిర్వహించే ప్రాంతాలను పోలీసులు తరచూ పరిశీలిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు, ఫ్లెక్సీల ఏర్పాటు, బైండోవర్లు చేస్తున్నారు. ఎలాగైనా పందేలు జరుపుకోవాలని పందెం రాయుళ్లు.. మరోవైపు కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం..
దుర్గగుడిలో అపచారం.. ఏం జరిగిందంటే..
Read Latest AP News And Telugu News