ఇస్రో యువిక.. విద్యార్థులకు ఆహ్వానం
ABN , Publish Date - Mar 05 , 2026 | 07:58 AM
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లోని పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు దేశంలోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రాలను సందర్శించే అరుదైన అవకాశాన్ని ఇస్రో కల్పిస్తోంది. అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు యువిక-2026 పేరిట ఆహ్వానం పలుకుతోంది.
యువిక.. అరుదైన వేదిక
ఇస్రో సెంటర్లను సందర్శించే అవకాశం
తొమ్మిదో తరగతి విద్యార్థులకు ప్రాధాన్యం
ఆన్‌లైన్‌లో 31లోగా దరఖాస్తుకు గడువు
నరసన్నపేట, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లోని పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు దేశంలోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రాలను సందర్శించే అరుదైన అవకాశాన్ని ఇస్రో (ISRO YUVIKA) కల్పిస్తోంది. అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు యువిక-2026 పేరిట ఆహ్వానం పలుకుతోంది. ఎంపికైన విద్యార్థులకు స్నేస్ టెక్నాలజీ, సైన్స్ అప్లికేషన్స్‌పై ప్రాథమిక జ్ఞానాన్ని అందించి... స్ఫూర్తి నింపే ఉద్దేశంతో ఇస్రో ఈ యువ విజ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
రిజిస్ట్రేషన్ ఎలాగంటే..
ముందుగా జిగ్యాస (జేఐజీవైఏఎస్‌ఏ.ఐఐఆర్‌ఎస్.జీవోవీ.ఇన్) వెబ్‌సైట్‌లో విద్యార్థి పేరు, ఈ-మెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకోవాలి. మెయిల్‌కు వచ్చే లింక్‌పై క్లిక్ చేసి.. వెరిఫై చేసుకోవాలి. లాగిన్ అయ్యి ఆన్‌లైన్ క్విజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు ఆన్‌లైన్‌లో నింపాలి. ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఆన్‌లైన్ ప్రక్రియ గతనెల 27వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఈ నెల 31వ తేదీతో గడువు ముగుస్తుంది.
ఎంపికైన విద్యార్థులకు శిక్షణ..
ఇస్రో ‘యువిక’ కార్యక్రమాన్ని దేశంలోని 7 స్పేస్ సెంటర్లలో నిర్వహిస్తోంది. ఎంపికైన విద్యార్థులకు మే నెలలో రెండు వారాల పాటు శిక్షణ ఇస్తుంది. దీని ద్వారా అంతరిక్ష పరిశోధనలపై అవగాహన, అంతరిక్ష కేంద్రాలను సందర్శించే అవకాశం కల్పిస్తుంది.
వెయిటేజ్ ఇలా..
విద్యార్థులు ఎనిమిదో తరగతిలో పొందిన మార్కులకు 50 శాతం, స్పేస్, సైన్స్‌క్లబ్‌లో నమోదై ఉంటే 5శాతం, క్రీడలు, అథ్లెటిక్స్, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాల్లో ఉంటే 5శాతం, గ్రామీణులకు 20శాతం వెయిటేజ్ ఉంటుంది. ఆన్‌లైన్‌లో క్విజ్ మార్కులకు 10శాతం, రాష్ట్ర, జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు, సైన్స్ ప్రతిభా పరీక్షలు, ఒలింపియాడ్‌లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి 10శాతం వెయిటేజ్ ఉంటుంది.
సద్వినియోగం చేసుకోవాలి..
సైన్స్ పట్ల అవగాహన పెంచేందుకు ఇస్రో కల్పిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. హెచ్‌ఎంలు, సైన్స్ టీచర్లు దీనిపై విద్యార్థులను సిద్ధం చేయాలని ఆదేశించాం. ఈ విషయంపై అవగాహన కల్పించాలని జిల్లా సైన్స్ ఫోరానికి సూచిస్తాం.
-రవిబాబు, డీఈవో, శ్రీకాకుళం
ఈ వార్తలు కూడా చదవండి..
ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలన్నదే మా లక్ష్యం: మంత్రి నారా లోకేశ్
శాసనమండలిలో గందరగోళం.. శ్రీవారి లడ్డూ అంశంపై వాగ్వాదం
Read Latest Telangana News And AP News And Telugu News