ఏలూరు జిల్లాలో పెద్దపులి కలకలం.. ఆవుపై దాడి చేసి చంపిన పులి
ABN , Publish Date - Jul 01 , 2026 | 09:24 AM
ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. వేలేరుపాడు మండలంలోని చింతలపాడు గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఓ ఆవుపై పెద్దపులి దాడి చేసి చంపింది.
ఏలూరు జిల్లా, జులై 1 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. వేలేరుపాడు మండలంలోని చింతలపాడు గ్రామ సమీపంలో ఈరోజు(బుధవారం) తెల్లవారుజామున ఓ ఆవుపై పెద్దపులి దాడి చేసి చంపింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామస్థులు అప్రమత్తమవగా, అటవీ శాఖ అధికారులు పులి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
పులికి రేడియో కాలర్ అమర్చి దాని కదలికలను ట్రాక్ చేస్తున్నారు. రేడియో కాలర్ ద్వారా అందుతున్న సంకేతాల ఆధారంగా పులి ప్రస్తుతం యడవల్లి అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పులి సంచారం ఉన్న ప్రాంతాలపై అటవీ శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
చింతలపాడు గ్రామ సమీపంలో పులి ఆవుపై దాడి చేయడంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆయా గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతాలకు వెళ్లే వారు, పశువులను మేపేందుకు వెళ్లే రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో అటవీ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని హెచ్చరించారు.
పులి గ్రామల్లోకి రాకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పులిని సురక్షితంగా బంధించి తిరిగి అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు బోన్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అవసరమైతే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పులి కనిపించిన వెంటనే సమాచారం అందించాలని గ్రామస్థులకు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ విద్యా వ్యవస్థపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు
ఫడణవీస్‌తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News