Share News

ఆగస్టు 17 తర్వాత భోగాపురం నుంచే విమానయానం

ABN , Publish Date - Jul 29 , 2026 | 11:00 AM

ఆంధ్రప్రదేశ్‌ విమానయాన రంగంలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17వ తేదీ అర్ధరాత్రి 00:01 గంటల నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి.

 ఆగస్టు 17 తర్వాత భోగాపురం నుంచే విమానయానం
Bhogapuram Airport

విజయనగరం, జులై 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ విమానయాన రంగంలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram Airport) నుంచి ఆగస్టు 17వ తేదీ అర్ధరాత్రి 00:01 గంటల నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ నుంచి నడిచే షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ విమాన సేవలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది.


దాదాపు 30 ఏళ్ల పాటు సేవలందించిన విశాఖపట్నంలోని ఐఎన్‌ఎస్‌ డేగా సివిల్‌ ఎన్‌క్లేవ్‌ నుంచి ఇకపై సాధారణ వాణిజ్య విమానాల రాకపోకలు ఉండవు. ఆగస్టు 17వ తేదీ నుంచి విశాఖ విమానాశ్రయానికి ఉన్న అంతర్జాతీయ ట్రావెల్‌ కోడ్‌ ‘VTZ’ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ కానుంది. అయితే విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ పూర్తిగా మూతపడదు. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో వినియోగంతో పాటు భారతీయ వాయుసేన, సాయుధ దళాలు, పోలీసు విమానాలు, ప్రభుత్వ అతిథుల కోసం ప్రత్యేక విమానాలు, వీఐపీ ఎయిర్‌క్రాఫ్ట్‌ల రాకపోకలు కొనసాగుతాయి. అలాగే నాన్‌-షెడ్యూల్డ్‌ వాణిజ్య కార్యకలాపాలకు కూడా అనుమతి ఉంటుందని అధికారులు వెల్లడించారు.


భోగాపురం విమానాశ్రయానికి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారికంగా గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జీఎంఆర్‌ సంస్థ పీపీపీ విధానంలో నిర్మించిన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంతానికి కొత్త విమానయాన కేంద్రంగా మారనుంది. కొత్త విమానాశ్రయం ప్రారంభంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మా ఇంట్లో రెండు పార్టీలు: భువనేశ్వరి

సూర్యుడు.. మేడిన్‌ చైనా!

ఎర్రబస్సూ రాదన్నారు.. ఎయిర్‌బస్సు వచ్చేస్తోంది!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 11:31 AM