Share News

‘భోగాపురం’ దూరాభారం

ABN , Publish Date - Aug 18 , 2026 | 07:35 AM

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజున.. తొలి విమానం ల్యాండింగ్‌తో ఆనందోత్సహాలు ప్రారంభం కాగా.. మరోవైపు మొదటి రోజునే బాలారిష్టాలు ఎదురయ్యాయి.

‘భోగాపురం’ దూరాభారం

  • తొలి రోజున ‘బస్సు’ పాట్లు

  • సర్వీసులు నడపడంలో ఆర్టీసీ తడబాటు

  • అరగంటకో బస్సు అని చెప్పి.. 2 గంటలకొకటి

  • క్యాబ్‌లు బుక్‌ చేసుకొని వెళ్లిపోయిన ప్రయాణికులు

  • బస్టాప్‌లలో సౌకర్యాల లేమిపైనా అసంతృప్తి

విశాఖపట్నం/విజయనగరం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజున.. తొలి విమానం ల్యాండింగ్‌తో ఆనందోత్సహాలు ప్రారంభం కాగా.. మరోవైపు మొదటి రోజునే బాలారిష్టాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్టు విషయంలో ప్రయాణికులు ‘పాట్లు’ పడ్డారు. ఆర్టీసీ అధికారుల వైఫల్యం కారణంగా విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు వెళ్లాల్సిన వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర గంటకో బస్సు ఉంటుందని చెప్పిన అధికారులు.. రెండు గంటలకొకటి కూడా నడపలేకపోయారు.


ఎయుర్‌పోర్టుకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్టాప్‌ల్లో బస్సుల కోసం ఎదురుచూశారు. ఆలస్యం అవుతుందనే ఆందోళనలతో కొంత మంది అధిక ధరలు చెల్లించి, క్యాబ్‌లు బుక్‌ చేసుకొని వెళ్లారు. విశాఖలోని సిరిపురం, ఇస్కాన్‌ టెంపుల్‌ స్టాపుల్లో బస్సులను ఆపకుండానే వెళ్లిపోవడం గమనార్హం. బస్టా్‌పలలో కనీస సౌకర్యాలు కూడా లేవని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టులో మరుగుదొడ్ల సౌకర్యం సరిగా లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ట్యాక్సీ ధరలు కూడా అధికంగా ఉన్నాయని, ఎయిర్‌పోర్టు నుంచి భోగాపురం తీసుకెళ్లేందుకు రూ.750 వసూలు చేస్తున్నారని కొంత మంది చెప్పారు.


చెప్పిందొకటి.. జరిగిందొకటి!

విశాఖ నుంచి భోగాపురం 45 కిమీ దూరాన ఉంది. అక్కడికి క్యాబ్‌లో వెళితే రూ.1,500 నుంచి రూ.2 వేలు అవుతుంది. దీంతో ప్రయాణికులపై భారం తగ్గించడానికి ఆర్టీసీ అధికారులు మూడు నెలల ముందుగానే 20 ఎలక్ర్టిక్‌ బస్సులను రప్పించారు. వీటిని గాజువాక నుంచి రెండు మార్గాల్లో నడుపుతామని ప్రకటించారు. ఒక మార్గంలో రూ.400, మరో దానిలో రూ.300 టికెట్‌ ధర నిర్ణయించారు. ప్రతి గంటకు ఆయా మార్గాల్లో బస్సులు నడుస్తాయని, వారం రోజులుగా ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. ఆదివారం మరో అడుగు ముందుకేసి ప్రతి అరగంటకు బస్సు ఉంటుందని.. ఉదయం 4.30 నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు.


ప్రయాణికులు సోమవారం ఉదయం నుంచి భోగాపురం వెళ్లడానికి బస్సుల కోసం సమీప బస్టాప్‌లకు చేరుకున్నారు. గాజువాక నుంచి ఉదయం 4.30 గంటలకు తొలి బస్సు బయలుదేరుతుందని చెప్పిన అధికారులు.. 6.50 గంటలకు తీశారు. ఎన్‌ఏడీ జంక్షన్‌కు 7 గంటలకు ఒక బస్సు వస్తే, ఆ తర్వాత 10.30కు మరొకటి వచ్చింది. ఆలస్యం కారణంగా ప్రయాణికులు క్యాబ్‌లు బుక్‌ చేసుకొని భోగాపురం వెళ్లారు. కాగా, బస్సు రావడం ఆలస్యం కావడంతో సింహాచలం ఆర్టీసీ డిపో మేనేజర్‌ తన కారులో కొంత మంది ప్రయాణికులను ఎన్‌ఏడీ జంక్షన్‌ బస్టాప్‌ వద్ద నుంచి ద్వారకా కాంప్లెక్స్‌ వరకు తీసుకెళ్లారు. మరోవైపు తొలిరోజున గాజువాక నుంచి బయలుదేరిన బస్సుల్లో ప్రయాణికులు అంతంత మాత్రంగానే కనిపించారు. ఆక్యుపెన్సీ తక్కువగానే ఉంది. భోగాపురం విమానాశ్రయంలో ఎక్కువ బస్సులు ఉంచడంతో హైదరాబాద్‌, బెంగళూరుల నుంచి దిగిన విమాన ప్రయాణికులు వాటిలో విశాఖవచ్చారు. ఈ బస్సులు 80 శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి.


విమానం రాకతో కొత్త అధ్యాయానికి శ్రీకారం: సీఎం

అమరావతి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): భోగాపురం విమానాశ్రయానికి తొలి విమానం రాకతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు ఎక్స్‌లో తెలిపారు. ఈ విమానాశ్రయంతో రాష్ట్రంలో కొత్త అవకాశాలకు బాటలు పడ్డాయని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది కీలకంగా మారనుందని తెలిపారు.


ఏపీ అభివృద్ధికి కొత్త రెక్కలు: డిప్యూటీ సీఎం పవన్‌

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కొత్త రెక్కలు తొడుగుతూ భోగాపురం విమానాశ్రయంలో సేవలు ప్రారంభం కావడం ఎంతో ఆనందదాయకమని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ‘రాష్ట్ర ప్రగతి చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో నిర్మితమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం రవాణా సౌకర్యాల విస్తరణ మాత్రమే కాదు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల ఆకాంక్షలకు నిలువెత్తు రూపం’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


చాలా ఇబ్బంది పడ్డాను

నాది హైదరాబాద్‌. అప్పుడప్పుడు వైజాగ్‌ వస్తుంటాను. మధ్యాహ్నం 2.45 గంటలకు భోగాపురం-హైదరాబాద్‌ విమానం ఉంది. ఉదయం 10.30 గంటలకు బయలుదేరి బస్టాప్‌నకు వస్తే.. ఇక్కడ సమాచారం ఇచ్చేవాళ్లు కూడా లేరు. ఏ బస్సు ఎయిర్‌పోర్టుకు వెళ్తుందో తెలియలేదు. తాగేందుకు నీళ్లు, కూర్చోవడానికి కుర్చీలు లేవు. విమానాశ్రయానికి వెళ్లడానికి ఇన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని అనుకోలేదు. గతంలో వైజాగ్‌ విమానాశ్రయం నుంచి ప్రయాణం సాగించినప్పుడు ఈ తరహా ఇబ్బందులు పడలేదు.

- అభిషేక్‌, పర్యాటకుడు


ప్రత్యేక బస్టాప్‌లు ఉండాలి

నేను ముంబైలో ఇంజనీరింగ్‌ చేస్తున్నా. ఉదయం 10 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఏర్పాటు చేసిన బస్టాండ్‌కు చేరుకున్నా. నా ముందే ఒక బస్సు వెళ్లిపోయింది. అది భోగాపురం విమానాశ్రయానికి వెళుతుందని తెలియలేదు. అందులోని సిబ్బంది కూడా సమాచారం ఇవ్వలేదు. గతంలో గంటన్నర ముందు బయలుదేరి ఎయిర్‌పోర్టు చేరుకునేదాన్ని. ఇప్పుడు ఐదు గంటలు ముందు వచ్చినా ఎప్పుడు వెళతానో తెలియడం లేదు. విమానాశ్రయానికి వెళ్లేందుకు ప్రత్యేకంగా బస్టాప్‌ ఉండేలా చూడడంతో పాటు కూర్చునేందుకు సదుపాయాలు కల్పించాలి.

- ఎస్‌.కీర్తి, బీటెక్‌ విద్యార్థిని


ట్రాఫిక్‌ సమస్య ఉంది

హైదరాబాద్‌ వెళ్లేందుకు విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు కారులో వచ్చాం. సుమారు గంటన్నర పట్టింది. ట్రాఫిక్‌ వల్ల ఎయిర్‌పోర్టుకి రావడానికి ప్రయాణం కాస్త ఇబ్బందికరంగా అనిపించింది. ఇంటి వద్ద నుంచి కారులో ఎయిర్‌పోర్టుకు రావాలంటే టాక్సీకి రూ.2 వేల వరకు తీసుకుంటున్నారు.

- వేదశ్రీ, విశాఖపట్నం


సౌకర్యాలు మెరుగుపర్చాలి

నేను హైదరాబాద్‌ నుంచి వచ్చా. భోగాపురం ఎయిర్‌పోర్టు చాలా బాగుంది. అయితే వాష్‌ రూమ్స్‌ సౌకర్యం సరిగా లేదు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి.

- విక్రమ్‌, ఒడిశా


వార్తలు కూడా చదవండి...

నా రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదు: సీఎం

అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. సత్యకుమార్‌పై లోకేశ్ చమత్కారం

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 07:35 AM